టోక్యో రికార్డును భార‌త్ అధిగ‌మించేనా!

క‌రోనా ప‌రిస్థితుల మ‌ధ్య‌న వాయిదా ప‌డి ఆ త‌ర్వాతి సంవ‌త్స‌రం జ‌రిగిన టోక్యో ఒలింపిక్స్ ముగిసిన మూడేళ్ల‌లోనే మ‌ళ్లీ ఒలింపిక్స్ జ‌రుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ విష‌యంలో భార‌తీయుల మ‌దిలోని ప్ర‌శ్న గ‌త ప‌ర్యాయం…

క‌రోనా ప‌రిస్థితుల మ‌ధ్య‌న వాయిదా ప‌డి ఆ త‌ర్వాతి సంవ‌త్స‌రం జ‌రిగిన టోక్యో ఒలింపిక్స్ ముగిసిన మూడేళ్ల‌లోనే మ‌ళ్లీ ఒలింపిక్స్ జ‌రుగుతూ ఉన్నాయి. ఈ ఒలింపిక్స్ విష‌యంలో భార‌తీయుల మ‌దిలోని ప్ర‌శ్న గ‌త ప‌ర్యాయం భార‌త్ సాధించిన ప‌త‌కాల సంఖ్య‌ను ఈ సారి అధిగ‌మించేనా అనేది! ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో భార‌త అంకం గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. ద‌శాబ్దాల పాటు హాకీలో భార‌త్ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించినా ఆ స్వ‌ర్ణ‌యుగం ముగిశాకా.. కొన్ని ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఇండియా ఊసే లేదు! ఆ త‌ర్వాత 90ల నుంచి క‌నీసం ఇండియా పేరు ఒక్క ప‌త‌కం అయినా ప‌త‌కాల ప‌ట్టిక‌లో క‌నిపించ‌డం మొద‌లైంది.

అయితే వంద కోట్లకు మించిన జ‌నాభా క‌లిగిన ఇండియాకు ఒలింపిక్స్ ప‌త‌కం అనేది ఎప్పుడూ అపురూప‌మే! అప్పుడ‌ప్పుడు మ‌నోళ్లు రెండు మూడు ప‌త‌కాల‌తో మెరిసినా ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌డుతూ లేస్తూనే సాగుతోంది ఇండియా గ‌మ‌నం. ప్ర‌స్తుత పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతాలు జ‌రిగిపోతాయ‌నే ఆశ‌లు ఏమీ లేవు కానీ, సంచ‌ల‌న రీతిన ఇండియా టోక్యో ఒలింపిక్స్ రికార్డును అయినా అధిగ‌మిస్తుందా అనేద ఆశ‌!

టోక్యోలో ఇండియాకు మొత్తం ఏడు ప‌త‌కాలు ల‌భించాయి. వాటిల్లో నీర‌జ్ చోప్రా సాధించిన స్వ‌ర్ణం ఉంది, ద‌శాబ్దాల త‌ర్వాత హాకీ టీమ్ కు ద‌క్కిన ప‌త‌కం ఉంది. ఏడు ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాకు ఒక ఒలింపిక్స్ లో ద‌క్కిన అత్య‌ధిక ప‌త‌కాల సంఖ్య‌. ఈ సారి ఇండియా త‌ర‌ఫున మొత్తం 16 స్పోర్ట్ ఈవెంట్ ల‌లో వంద మందికిపైగా క్రీడాకారులు ప్రాతినిధ్యం వ‌హిస్తూ ఉన్నారు.

గ‌త ప‌ర్యాయం ప‌త‌కం సాధించిన నీర‌జ్ చోప్రో మ‌రోసారి అదే ఫీటే సాధిస్తాడ‌నే ఆశ‌లున్నాయి. హాకీ టీమ్ గ‌త ప‌ర్యాయం క‌న్నా త‌న స్థాయిని మరింత మెరుగు ప‌రుచుకుని ప‌త‌కం సాధిస్తే అంత‌క‌న్నా మురిపెం లేదు. ఒక పీవీ సింధు వ‌ర‌స‌గా మూడో ఒలింపిక్స్ లో ప‌త‌కం సాధించి ట్రిపుల్ ఒలింపియ‌న్ మెడ‌లిస్ట్ గా నిలిచే ఆశ‌ల‌ను రేపుతూ ఉంది. ఒక వీరుగాక ప్ర‌ధానంగా బాక్సింగ్, బ్యాడ్మింట‌న్, ఆర్చ‌రీ, షూటింగ్, రెజ్లింగ్ ల‌లోనే ఇండియా ప‌త‌కాల ఆశ‌లున్నాయి. అథ్లెటిక్స్ లో ఈ సారి ఎవ‌రి పేరూ గ‌ట్టిగా వినించ‌డం లేదు!

రెండు కోట్ల జ‌నాభా ఉన్న ఆస్ట్రేలియా ప‌త‌కాల విష‌యంలో దుమ్ము రేప‌డం మ‌రోసారి ఖాయ‌మే, ఇక ప‌త‌కాల వేటలో ముందు వ‌ర‌స‌లో ఉండే దేశాల్లో చైనా త‌ప్ప మ‌రే దేశం కూడా జ‌నాభా విష‌యంలో ఇండియాకు పోటీ వ‌చ్చేది లేదు. 140 కోట్ల జ‌నాభా ఉన్న దేశంలో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అథ్లేట్లే 119 ఉన్నార‌ట‌! కోటి మందికి ఒక్క‌రు అనే నిష్ఫ‌త్తి కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇండియాలో క్రీడ‌ల‌కు ఉన్న ఆద‌ర‌ణ ఏపాటిలో ఎవ‌రికీ కొత్త‌గా వివ‌రించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. క్రీడ అంటే మ‌న‌కు క్రికెట్ ఒక్క‌టే. న‌యాత‌రంలో చాలా మంది త‌మ పిల్ల‌ల‌ను క్రీడ‌ల‌కు పంపుతున్నారు. అది కూడా త‌మ పుత్ర ర‌త్నాలు క్రికెట‌ర్లు అయితే కావాల్సినంత గ్లామ‌ర్, ఇంకా మ‌రెంతో డ‌బ్బు వ‌స్తుంద‌నే లెక్క‌ల‌తో కొంద‌రు త‌మ పిల్ల‌ల‌ను క్రికెట్ కు పంపుతున్నారు త‌ప్ప ఇంక వేరే స్పోర్ట్ అంటే అదో ప‌నికిమాలిన ప‌ని అన్న‌ట్టుగా ఉంది.

ద‌శాబ్దాల‌కు ద‌శాబ్దాలు గ‌డిచిపోతున్నా ఇండియ‌న్స్ ధోర‌ణిలో అయితే ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇప్పుడే కాదు.. మ‌రో ఇర‌వై సంవ‌త్స‌రాల త‌ర్వాత అయినా ఇండియా ఒలింపిక్స్ లో చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల‌కు పోటీ ఇవ్వ‌గ‌లుగుతుంద‌నే న‌మ్మ‌కాలు ఏమీ లేవు! ఒలింపిక్స్ స్థాయి ఫ‌లితాలు రావాలంటే.. క‌నీసం ఇర‌వై సంవ‌త్స‌రాల పాటు అవిశ్రాంత కృషి అవ‌స‌రం. అయితే ఇప్ప‌టికీ మూడో తర‌గ‌తి నుంచినే పిల్ల‌ల‌కు కోడింగ్ నేర్పాలి, చ‌దువు అంటే క్లాస్ రూమ్ లో కూర్చుని నేర్చుకునేది మాత్ర‌మే, ఆట‌లంటే స‌మ‌యం వ్య‌ర్థం. ఆటలంటే కంప్యూట‌ర్ గేమ్స్ లేదంటే సెల్ ఫోన్ తో ఆడుకునేవి అనే ధోర‌ణే మన దేశంలో కొన‌సాగుతూ ఉంది. ఇలాంటి ధోర‌ణితో ఒలింపిక్ మెడ‌ల్స్ ఎక్స్ పెక్ట్ చేయ‌డం కూడా క‌రెక్ట్ కాదు.

ఏదోలా చ‌దివేసి, ఏ బీటెక్కో కంప్లీట్ చేసి, ఏదో ఒక ఉద్యోగం వెదుక్కోవ‌డ‌మే జీవిత ల‌క్ష్యం అన్న‌ట్టుగా పిల్ల‌ల పెంప‌కం సాగుతోంది. ఒక డ‌బ్బున్న కుటుంబాల్లో పిల్ల‌ల‌కు ఎండ త‌గ‌ల‌కూడ‌దు, చ‌దువు కూడాఏదో స్టేట‌స్ కోసం, ఫ్యామిలీ బిజినెస్ లు సాగించేసుకుంటారు, ఒక ట్యాలెంట్ ఉన్న ప్రోత్స‌హం లేని గ్రామీణ‌, పేద కుటుంబాల ప‌రిస్థితి స‌రేస‌రి! స్పోర్ట్స్ టాలెంట్ అన్ని స్థాయిల వాళ్ల‌లోనూ ఉండ‌వ‌చ్చు. మ‌ధ్య‌త‌ర‌గ‌తికేమో ఉద్యోగ‌మే ప‌ర‌మావ‌ధి. హై క్లాస్ కేమో అవ‌స‌రం లేదు, రూర‌ల్ పేద‌రికంలో ఉండే వారికి మాత్రం ప్రోత్సాహం ఉండ‌దు. ఆర్థిక ప‌రిస్థితి అనుకూలించ‌దు! ఇలా ఎవ‌రికి వారు బిజీ. కాబ‌ట్టి.. ఇప్పటిక‌ప్పుడే కాదు, ఇంకో పాతికేళ్ల త‌ర్వాత కూడా ఇండియా ప‌త‌కాల విష‌యంలో ఇలా కొన‌కొన ఆశ‌ల‌తో కొట్టు మిట్టాల్సిందేనేమో!

4 Replies to “టోక్యో రికార్డును భార‌త్ అధిగ‌మించేనా!”

  1. నిజమ్గా చదువో , పరపతో లేకపోతె ఇండియాలో పూట గడవని పరిస్థితి. ఇంత మంది నేతలు వారి వందిమాగధుల సొల్లు రాతలు తప్ప ఒరగపెట్టింది ఏమి లేదు. అంత నిరాశలో ఎదురొడ్డి పోరాడి సాధించానా ఒక్క పధకం 100 padhakala పెట్టు.

    1. బాబు గాడు మాత్రం భ్రమరావతిలో ఒలింపిక్స్.

      నియమకి ఒక్కడేనా..కాదని అర్థం అవుతుంది.

Comments are closed.