ఒకప్పుడు పిజ్జా అంటే రొటీన్ గా ఉండేది. కానీ ఇప్పుడు అదే పిజ్జాలో వందల రకాలు వచ్చేశాయి. ఈ జంక్ ఫుడ్ ను తినకూడదంటూ ఇప్పటికే చాలా సర్వేలు వెల్లడించాయి. తాజాగా అలాంటిదే మరో సర్వే బయటకొచ్చింది. ఈసారి ఈ సర్వే ఇండియాలోనే జరిగింది. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో కావడం, ఫలితాలు మరింత ఆశ్చర్యకరంగా ఉండడం విశేషం.
ఇన్నాళ్లూ పిజ్జా తింటే కేవలం స్థూలకాయం మాత్రమే వస్తుందని అంతా భావించారు. దీని వల్ల గుండె జబ్బులు కూడా వస్తాయని తెలుసు. కానీ తాజా సర్వేలో తేలిందేంటంటే.. పిజ్జా తింటే శృంగార జీవితం కూడా నాశనం అయిపోతుందట. “ఆ పని”కి అస్సలు పనికిరాకుండా పోతారని అంటోంది మ్యాక్స్ హెల్త్ కేర్ సంస్థ.
ఢిల్లీలో 800మంది పురుషులు, మహిళలపై ఈ సంస్థ పరీక్షలు నిర్వహించింది. 21నుంచి 40ఏళ్ల మధ్య వయసున్న వీళ్లంతా రెగ్యులర్ గా పిజ్జాలు, బర్గర్ లు లాగించే అలవాటున్నవాళ్లు. వీళ్లపై పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు.
వీళ్లంతా సెక్స్ ను ఆసాంతం ఆస్వాదించలేకపోతున్నారని సర్వేలో తేల్చారు. మరో విషయం ఏంటంటే.. వీళ్లలో 15శాతం మందికి అసలు శృంగారం అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోతోందని కూడా ఈ స్టడీలో తేల్చారు.