SRH తీరు మార‌లేదు, అదే క‌థ‌!

ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు మ‌రో సీజ‌న్ ను త‌న‌దైన రీతిలో ఆరంభించింది. స‌మ‌ష్టిగా ఆడి గెల‌వ‌డం కానీ, నాలుగైదు ఓవ‌ర్ల‌లో ప‌రిస్థితి మొత్తాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం కానీ ..…

ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు మ‌రో సీజ‌న్ ను త‌న‌దైన రీతిలో ఆరంభించింది. స‌మ‌ష్టిగా ఆడి గెల‌వ‌డం కానీ, నాలుగైదు ఓవ‌ర్ల‌లో ప‌రిస్థితి మొత్తాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం కానీ .. గ‌త కొన్ని సీజ‌న్లుగా ఈ జ‌ట్టుకు అల‌వాటు కాని ప‌నిగా మారింది! 

గ‌త మూడు నాలుగు సీజ‌న్ల నుంచి ఇదే త‌ర‌హాలో ఈ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఉంటోంది. 20 ఓవ‌ర్ల మ్యాచ్ ల‌లో జ‌రిగే అద్భుతాల గురించే క్రికెట్ ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకుంటారు. గెలుస్తుంద‌నుకున్న జ‌ట్టు ఓడిపోవ‌డం, ఓడిపోతోంద‌నుకున్న జ‌ట్టు గెల‌వ‌డం వంటి మ‌లుపులు ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే ఎస్ఆర్హెచ్ విష‌యంలో ఎంత‌సేపూ ప్ర‌త్య‌ర్థులు ఇలాంటి ఫీట్లను చేస్తారు త‌ప్ప‌.. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు మాత్రం.. ఎంత‌సేపూ ఓట‌మికే ఫిక్స్ అయిన‌ట్టుగా త‌న పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తూ ఉంది.

గ‌త సీజ‌న్, అంత‌కు ముందు సీజ‌న్  లో ఇలాంటి మ్యాచ్ ల‌ను ఎన్నింటినో చూశారు ఎస్ఆర్హెచ్ అభిమానులు. విశేషం ఏమిటంటే.. ప్ర‌స్తుత సీజ‌న్లో తొలి మ్యాచ్ ను అదే రీతిన ఆరంభించింది స‌న్ జ‌ట్టు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లో జ‌రిగిన సీజ‌న్ ఆరంభ మ్యాచ్ లో స‌న్ జ‌ట్టు.. ధారాళంగా ప‌రుగులు ఇచ్చింది.  అదే స‌మ‌యంలో ప‌రుగులు రాబ‌ట్టాల్సిన ఆట‌గాళ్లు మాత్రం పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌రుగుల వ‌ర‌ద పారించిన పిచ్ మీదే వీరు చెత్త‌గా ఆడారు! 

ఫ‌లితంగా.. ఫ‌స్ట్ ప‌వ‌ర్ ప్లే లో అత్యంత త‌క్కువ స్కోరును చేసిన జ‌ట్టుగా కూడా ఎస్ఆర్హెచ్ కీర్తిని మూట‌గ‌ట్టుకుంది. నిన్న రాత్రి మ్యాచ్ లో తొలి ఆరు ఓవ‌ర్ల‌లో ఎస్ఆర్హెచ్ చేసిన ప‌రుగుల సంఖ్య 14! ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇదొక పేల‌వ బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌. అంత‌కు ముందు ఇదే పిచ్ పై రాజ‌స్థాన్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 210 ప‌రుగులు చేసింది. త‌న చివ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లోనే ఆ జ‌ట్టు దాదాపు యాభై ప‌రుగులు చేసింది. అంత‌కు ముందు కూడా ఓవ‌ర్ కు స‌గ‌టున ప‌ది ప‌రుగులు చేసింది. అయితే కేన్ విలియ‌మ్స‌న్ సేన బ్యాటింగ్ లో ఓన‌మాలు రాన‌ట్టుగా ఆడింది.

తొలి ఆరు ఓవ‌ర్ల‌లో 14 ప‌రుగులు చేసి మూడు వికెట్ల‌ను కోల్పోయింది. ఆ త‌ర్వాత ఏ ద‌శ‌లోనూ భారీ ప‌రుగుల చేధ‌న దిశ‌గా సాగ‌లేక‌పోయింది. ఉన్నంత‌లో చివ‌ర్లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ బ్యాట్ ను కాస్త ఝ‌లిపించాడు. 14 బంతుల్లో 40 ప‌రుగులు చేశాడు సుంద‌ర్. మార్క్ ర‌మ్ హాఫ్ సెంచ‌రీతో కాస్త ప‌రువు నిల‌బెట్టాడు. సుంద‌ర్ త‌ర‌హాలో మ‌రొక బ్యాట్స్ మన్ రెచ్చిపోయి ఉన్నా… మ్యాచ్ రంజుగా ఉండేది. అయితే ఎస్ఆర్హెచ్ అభిమానుల‌కు అలాంటి ట్రీట్ ఇవ్వ‌డంలో మ‌రోసారి ఫెయిల‌య్యింది.