ఫన్ చర్ : డిసెంబరు 31 తర్వాత ఏమొస్తంది…

సన్నాసి : డిసంబరు 31 తర్వాత ఏమొస్తదన్నా… Advertisement రామయ్య : ఏమొస్తది… జనవరి 1 వస్తంది. అంతేగదా… ఎందుకడగతావుండావు…? సన్నాసి : ఏవీలేదన్నా… డిసెంబరు 31 దాకా ఓపిగ్గా ఉండండి అని ముఖ్యమంత్రి…

సన్నాసి : డిసంబరు 31 తర్వాత ఏమొస్తదన్నా…

రామయ్య : ఏమొస్తది… జనవరి 1 వస్తంది. అంతేగదా… ఎందుకడగతావుండావు…?

సన్నాసి : ఏవీలేదన్నా… డిసెంబరు 31 దాకా ఓపిగ్గా ఉండండి అని ముఖ్యమంత్రి అంటావుండాడు. అందుకని…

రామయ్య : ఎందుకురా… ఆనాకేవుండాది. జనవరి 1తేదీ వస్తంది. అంతేగదా… దీనికోసం ఎదురుజూస్తావుండండి అని ముఖ్యమంత్రిజెప్పినాడా…?

సన్నాసి : అదిగాదన్నా… మన రాష్ట్రం రెండు ముక్కలు జేస్తావని కాంగ్రెసు పార్టీ అనుకోనుండాదిగదా… ఇది మన ముఖ్యమంత్రికి ఇష్టంలేదంట. మనోళ్లుగూడా నిన్నటిదాకా సమ్మెజేసినారుగదా… నిన్ననే పనిలోకెళ్లినార్లే… అయితే ముఖ్యమంత్రి మాత్తరం నేను రాష్ట్రం ఒక్కటిగా ఉండాలను కోరుకుంటావుండాను అనిజెపతావుండాడు… ఇట్టాజెప్పే అందరినీ సల్లబరస్తుండాడు. 

రామయ్య : ఎంతకాలం ఇట్టాజేస్తాడ్రా… ఒకసారి ఆళ్లు ముక్కలు జేసేస్తావంటే ఊరుకుంటారా… ఎట్టైనా ముక్కలు జేసేస్తారు. పాపం అప్పుడేవంటాడో మన కిరణ్‌బాబు.

సన్నాసి : ఏంజేస్తాడ్లేఅన్నా… అప్పుడుగూడా నేను సమైక్యం కావాలంటాను. కానీ అధిష్టానం జెప్పిన మాటను మీరను, గీసిన గీటు దాటను అంటాడు. అంతే.

రామయ్య : లేదురా… ఇప్పుడే కిరణ్‌ బాబు ఏవన్నాజెయ్యాల. ఇప్పుడేగాన ఆయన ఢల్లీికెళ్లి సోనియమ్మతో ఏవన్నా జెపితే అవతందేవో… ఆ దిక్కులో ఏవన్నా జేస్తే బాగుండు.

సన్నాసి : లేదన్నా… ఈముక్కగూడా మనోళ్లు ఆయనకి జెప్పినారంట… మన తెలుగోళ్లంతా లక్షల్లో డిల్లీకెల్లి దర్నాజేస్తే… దెబ్బకి కాంగ్రెస్‌కి పట్టిన విభజన దెయ్యం దిగతంది అని జెప్పినారంట. దానికిగ్గూడా కిరణ్‌బాబు వొద్దొద్దు… డిసెంబరు 31 దాకా ఓపికబట్టండి అంటావుండాడంట. 

రామయ్య : ఆనకేంజేస్తాడ్రా… జనవరి ఒకటి ఆపీనూఇయరు అంటా అందరికీ సుబాకాంచలు జెప్తాడంతే…

సన్నాసి : లేదన్నా అప్పుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వొస్తందంట. అప్పుడు అందరం గలిసి బిల్లును ఓడిరచేద్దాం. అప్పుడేంజేస్తారు డిల్లీవోళ్లు. ఒకసారి అసెంబ్లీలో బిల్లు ఓడిపోయినాక ఇక అది సాగదు అని కిరణ్‌బాబు జెపతావుండాడంట…

రామయ్య : ఒరే పిచ్చోడా… నీకు బలేపేరుబెట్టినార్రా… సన్నాసి అని. నీ పేరుకుదగ్గట్టే నువ్వుగూడా ఈ మాటలు నమ్మతావుండావా… అప్పుడు బిల్లు ఓడిపోవడం అనేది జరగకపోయిందంటే… ఇంక ఏవీలేదు… అంతా అయిపోనట్టే… అయినా పాపం కిరణ్‌బాబుది దింపుడుగళ్లం ఆశరా… మనోళ్లు ఒక మాటమీదుంటేలోళ్లా… ఆళ్లని నమ్ముకోని బిల్లును తిరగ్గొడదామని కిరణ్‌బాబు ఆశపడతావుండాడు… సూద్దాం. ఏంజరగతందో…?

సన్నాసి : దింపుడుగళ్లం ఆశంటే ఏందన్నా…?

రామయ్య : శవాన్ని దీసకెళ్లేటప్పుడు ఊరి చివరికి ఎల్లినతర్వాత ఒకసారి పాడె దించి శవం పేరును మూడుసార్లు పిలస్తారంట. ఒకేల శవం బతికేవుంటే లేస్తదని. కానీ నాకు బుద్దెరినంక ఇంతవరకూ ఏ శవం పాడెమీదినుండి లేవలేదురా… సన్నాసీ…!