ఈటెల రాజేందర్ అనే ఒక్క నాయకుడు బలంగా ఉంటే చాలు.. నిత్యం మీడియాలో మాట్లాడగలుగుతూ ఉంటే చాలు. ఆయన చెబుతున్న మాటలకు చేసే డిమాండ్లకు విలువ ఇస్తూ పోతే గనుక.. అసలు కేంద్ర ప్రభుత్వం విభజన కు అనుకూలం నిర్ణయం తీసుకున్నందుకు తమను తామే నిందించుకుని, ఇప్పుడు ప్రక్రియ చేపట్టినందుకు వగచి విచారించి యావత్తు వ్యవహారాన్ని ఏకమొత్తంగా అటక ఎక్కించేయడం తథ్యం అని అని పలువురు తెలంగాణ వాదులే విస్తుపోతున్నారు. ఈటెల రాజేందర్‌కు అసలు తెలంగాణ ఏర్పడడమే ఇష్టం లేదని.. అందుకే రకరకాల గొంతెమ్మ కోరికలతో ప్రక్రియ చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నాడని పలువురు తెలంగాణ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును ఒప్పుకునేది లేదు అని తీవ్రమైన ప్రకటనలతో విరుచుకు పడుతున్న ఈటెల రాజేందర్.. తాను పోలవరాన్ని ఆపగలనని అనుకుంటున్నారేమో గానీ.. నిజానికి తెలంగాణను కూడా ఆపే సైంధవుడిలా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.
ఈటెల తన చిత్రవిచితమ్రైన డిమాండ్లతో ఇప్పటికే తెలంగాణ ఇవ్వదలచుకున్న వారిని భయపెట్టే రీతిలో మాట్లాడుతున్నారు. ఆయన చేస్తున్న ప్రకటనల్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలను పరిశీలించినట్లయితే..
1) తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆలోచన లేదని, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తెరాస మీదనే ఉన్నదని, ప్రజలంతా తెరాసను, కేసీఆర్‌నే విశ్వసిస్తున్నారని తొలుత ప్రకటించి ఈటెల సంచలనం సృష్టించారు. తెలంగాణ ఇస్తే గనుక.. కేసీఆర్ గులాబీ దళం తమలో కలిసిపోతుంది. ఇక విజయదుందుభి మోగించడమే అని పండగ చేసుకుంటూ ఉన్న కాంగ్రెస్ వాదులకు ఇది అశనిపాతం.
2) ఒకవైపు సీడబ్ల్యూసీ ఎలా నిర్ణయించారో అలాగే చేయాలని అంటూనే.. పదేళ్లపాటూ కూడా హైదరాబాదులో శాంతి భద్రతల పర్యవేక్షణను గవర్నరు చేతిలో పెడితే ఊరుకోబోయేది లేదు అని ప్రకటించడం.
3) సీమాంధ్రకు కావాలిస్తే ఎంత పెద్ద ప్యాకేజీ అయినా ఇచ్చుకోండి.. కానీ యాభయ్యేళ్లుగా నిత్యం దోపిడీకి గురవుతూ వచ్చిన తెలంగాణ ప్రాంతానికి తొలుత ఆ నష్టాన్ని పూడ్చే ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే.. వారికి ఇవ్వాలని అనడం.
4) కాంగ్రెస్ ఏమైనా ఉదారంగా తెలంగాణ ఇచ్చిందా.. ఈ క్రెడిట్ కాంగ్రెస్‌కు ఎందుకు దక్కుతుంది. వెయ్యి మంది బలిదానాలు చేసిన వారికి, పోరాటాలు చేసిన వారికి మాత్రమే దక్కుతుందని అంటూ.. లబ్ధి పొందదలచుకుంటున్న కాంగ్రెస్‌ను నిందించే ప్రకటనలు చేయడం.
5) రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి ఇచ్చిన ఒకే ఒక్క హామీ.. పోలవరం జాతీయ ప్రాజెక్టు హోదా అనేది మాత్రమే. అలాంటి నేపథ్యంలో అసలు పోలవరం ప్రాజెక్టు కట్టడానికే వీల్లేదని దీన్ని అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం.
ఇలాంటి అనేకానేక ప్రకటనలతో ఈటెల రాజేందర్ తనను తాను విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి దక్కగల ప్రయోజనాలను అడ్డుకునే సైంధవుడిగా భావించుకోవచ్చు. కానీ ఇలాంటి చర్యలు, ప్రకటనల ద్వారా ఆయన తెలంగాణకు కూడా సైంధవుడిగా మారితే గనుక.. అక్కడి ప్రజలు కూడా ఆయనను క్షమించరు.
-కపిలముని