ఎమ్బీయస్‍: కిశోర్‌కుమార్ లైఫ్‌నే మార్చేసిన డేనీ కేయే

ఒక నటుడు తెరపై డాన్సు, మిమిక్రీ, మైమ్, పేరడీ చేస్తూ చక్కటి పాటలు కూడా పాడగలడని కిశోర్ ఎన్నడూ ఊహించలేదు. కానీ డేనీ అవన్నీ చేసి చూపించాడు.

కిశోర్‌కుమార్ పేరు చెప్పగానే ఒక గాయకుడు మాత్రమే కాదు, ఒక నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీతదర్శకుడు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా నటుడిగా కిశోర్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అతడు కమెడియన్ అంటే కమెడియన్ కాదు. మామూలు మూస హీరో అంటే హీరో కాదు. అమాయకత్వం, కొంటెతనం, హాయిగా ఉండే మనస్తత్వం కలిగి హుషారుగా పాటలు పాడే కథానాయకుడతను. “చల్తీకా నామ్ గాడీ” “హాఫ్ టికెట్”, “నౌకరీ”, “ఝుమ్రూ”, “బాప్‌రేబాప్” – ఇలా ఎన్నో సినిమాలలో అటువంటి పాత్రలు ధరించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడతను. అప్పటికి చిత్రరంగానికి పరిచయం కాని సరికొత్త హీరో ఇమేజ్ అది. ఎమోషనల్ అయిపోయి, బిగుసుకుపోయిన డైలాగులు గుప్పించే హీరోలకు విభిన్నంగా హాయిగా ఆడి, పాడే కిశోర్ పాత్రలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

కిశోర్ చిత్రరంగంలో ప్రవేశించింది ఇటువంటి పాత్రలు వేయడానికి కాదు. అతను చిన్నప్పటినుండి ఆశపడ్డది గాయకుడు కావాలని. సైగల్ అతనికి ఆరాధ్యదైవం. కానీ అతని గొంతు పాటలు పాడడానికి పనికిరాదు పొమ్మన్నారు స్టూడియో వాళ్లు, వాళ్ల అన్నయ్య బావమరిది ఎన్.ముఖర్జీ నడిపే ఫిల్మిస్తాన్తో సహా! అశోక్ కుమార్ చేతికి బాంబే స్టూడియో వచ్చిన తర్వాత “జిద్దీ” అనే సినిమాలో చిన్న తోటమాలి పాత్ర లభించింది. సైగల్ స్టయిల్లో ఓ పాట (మర్‌నే కీ దువాయేఁ క్యోం మాంగూఁ) పాడాడు కూడా, ఆ తర్వాత వచ్చిన ఛాన్సు “ఫరేబ్”. ఇవన్నీ సీరియన్ సినిమాలే. కిశోర్‌కు ప్రత్యేకమైన గుర్తింపేమీ రాలేదు.

తన కెరియర్ ఎటుపోతుందో తెలియని స్థితిలో ఉండగానే కిశోర్ డేనీ కేయే సినిమాలు చూడడం సంభవించింది. ఒక నటుడు తెరపై డాన్సు, మిమిక్రీ, మైమ్, పేరడీ చేస్తూ చక్కటి పాటలు కూడా పాడగలడని కిశోర్ ఎన్నడూ ఊహించలేదు. కానీ డేనీ అవన్నీ చేసి చూపించాడు. డేనీ రొమాంటిక్ హీరో కాదు. అతని ప్రేక్షకులు ప్రధానంగా చిన్నపిల్లలు. కానీ ఆ సినిమాలు చూసిన పెద్దలు కూడా పిల్లల్లా పడిపడి నవ్వుతారు. ఈ ఫార్ములా కిశోర్‌కి అద్భుతంగా నచ్చింది. అతనిలా డాన్సు చేస్తూ యోడిలింగ్‌ చేస్తూ, పాటలు పాడుతూ వేసే సరదా వేషాలు తనకు నప్పుతాయనిపించింది. తనను తానే డేనీగా మలచుకున్నాడు. “ముకద్దర్” (1950) సినిమాలో అమెరికన్ బ్రాడ్వే స్టయిల్లో గళ్లచొక్కా, టాప్ హేట్, చేతిలో వాకింగ్ స్టిక్ తో ప్రత్యక్షమయ్యాడు. అతి త్వరలోనే “ఇండియన్ డేనీ కేయే”గా పేరు తెచ్చుకున్నాడు. టోటల్లీ ఎంటర్టైనింగ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ‘‘బాప్‌ రే బాప్‌’’ (1955)లో హీరోగా అవకాశం వచ్చినపుడు డేనీనే పూర్తిగా అనుకరించి మొదటి హిట్‌ కొట్టాడు. ‘‘న్యూ ఢిల్లీ’’లోని ‘నఖరేవాలీ..’ పాటలో కిశోర్ ఆహార్యం చూడండి. కిశోర్ జీవితం దిశనే మార్చివేసిన ఈ డేనీ కేయే ఎవరు? ఒక అమెరికన్ ఎంటర్‌టైనర్.

అతని అసలు పేరు డేవిడ్ డేనియల్ కమిన్స్‌కీ. జనవరి 18, 1913 (112 సంవత్సరాల క్రితం యీ వారంలోనే!) న్యూయార్కు సిటీలో, వలస వచ్చిన రష్యన్ కుటుంబంలో పుట్టాడు. తండ్రి టైలర్, చాలామంది ప్రముఖులలాగానే అతడూ చిన్నప్పుడు దారిద్ర్యంతో బాధపడ్డాడు. హైస్కూల్‌తో చదువు మానేసి క్లబ్బుల్లో కామెడీ చేశాడు. కేథలీన్ యంగ్ క్లబ్‌లో డేనీ కేయే డాన్స్ ప్రదర్శన ఇచ్చిన తొలి రోజున జారిపడ్డాడు. ఆడియన్స్ పగలబడి నవ్వారు. ఇక అప్పటినుండీ జారిపడడం కూడా ప్రదర్శనలో భాగంగా చేసుకుని, డాన్సును, కామెడీని కలగలిపాడు. ఆ పై రేడియో స్టేషన్లో ఉద్యోగిగా, తర్వాత క్యాట్‌స్కిల్స్‌లో కమెడియన్ గా చేశాడు.

1939లో బ్రాడ్వేలో అతని ప్రవేశం “ది స్ట్రాహేట్ రివ్యూ”తో జరిగింది. ఇక్కడే అతనికి సిల్వియా ఫైన్‌తో పరిచయమైంది, ప్రణయం, దరిమిలా పరిణయం కూడా జరిగాయి. చివరిదాకా కలిసి ఉన్నారు. ఆమె ప్యారడీ సాంగ్స్ రాయడంలో దిట్ట. 1940లలో బ్రాడ్వేలో, నైట్‌క్లబ్‌లలో, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న అమెరికన్ సైనికుల కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనలలో ఎన్నో షోలు ఇచ్చాడు. అతని తొలి సినిమాలు (రెండు రీళ్ల కామెడీలు) 1937లో రిలీజయినా, గుర్తింపు మాత్రం ఏడేళ్ల తర్వాతనే వచ్చింది. “లేడీ ఇన్ ద డార్క్” అనే షో కోసం “చెయ్‌కోవస్కీ” అనే 39 సెకండ్ల పాటలో 50 మంది రష్యన్ సంగీతకారుల పేర్లు అప్పజెప్పేడు. రష్యన్ పేర్లు ఎలా ఉంటాయో తెలిసిన వారికి ఇది గొప్ప ఫీట్ అని తప్పకుండా అనిపిస్తుంది. ఆ ప్రదర్శన చూసిన శామ్యూల్ గోల్డ్‌విన్ 1,50,000 డాలర్లు పారితోషికంతో సినిమా ఛాన్సు ఆఫర్ చేశాడు.

డానీ తొలి ఫీచర్ సినిమా “అప్ ఇన్ ఆర్మ్స్” (1944) ఓ మ్యూజికల్ కామెడీ. తన ఆరోగ్యం గురించి లేనిపోని భయాలు పెట్టుకుని వర్రీ అయ్యే పాత్ర డేనీది. గోల్డ్‌విన్ నమ్మకం వమ్ముకాలేదు. సినిమా హిట్ అయింది. వెంటనే “వండర్‌మాన్” (1945)లో ద్విపాత్రాభినయం చేయించాడు. తర్వాత వచ్చినవి – హెరాల్డ్ లాయిడ్ “ది మిల్కీవే” (1936) సినిమా రీమేక్ “ద కిడ్ ఫ్రమ్ బ్రూక్లిన్” (1946), “ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ ” (1947) (అదే పేరుతో ప్రఖ్యాత హాస్యరచయిత జేమ్స్ తర్బర్ రాసిన కథ దీనికి ఆధారం), “ఎ సాంగ్ ఈజ్ బోర్న్” (1948).

ఆ తర్వాత విడిగా వచ్చి “ది ఇనస్పెక్టర్ జనరల్” (1949), “ఆన్ ద రివియేరా” (1950) (దీంట్లో కూడా ద్విపాత్రాభినయమే) చేసాడు. మళ్లీ గోల్డ్‌విన్ వద్దకు వచ్చి “హాన్స్ క్రిస్టియన్ అండర్సన్” (1952) చేశాడు. మళ్లీ పారమౌంట్ స్టూడియోకు వచ్చి నార్మన్ పనామా, మెల్విన్ ఫ్రాంక్‌లను పెట్టుకుని స్వంతంగా సినిమా తీసాడు. వాళ్లిద్దరూ రాసి, డైరెక్టు చేసి, నిర్మించిన సినిమాయే డేనీ ఆల్-టైమ్ బెస్ట్ – “నాక్ ఆన్ వుడ్” (1954). ఇది ఓ స్పై థ్రిల్లర్ కమ్ కామెడీ. డేనీ ఓ చేతిలో ఓ బొమ్మ పెట్టుకుని మాట్లాడే వెంట్రిలాక్విస్టు. ఆ బొమ్మ డేనీ ప్రమేయం లేకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కస్టమర్లను అవమానిస్తుంటుంది. ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లాడ బోయేటంతలో ఆ బొమ్మ అతనిపై అసూయతో పెళ్లి చెడగొట్టేస్తుంది. ఆ బొమ్మ ద్వారా కూడా మాట్లాడేది డేనీయే కాబట్టి, అతను ఓ లేడీ సైకియాట్రిస్టుకు చూపించుకోవడం మంచిదని ఒక ఫ్రెండు సలహా ఇస్తాడు. ఆమె సమస్యను నయం చేస్తుంది. ఆ క్రమంలో యిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

ఈ లోపుగా ఓ మారుణాయుధం తయారుచేసే ప్లాను కాగితాలను కొందరు క్రిమినల్స్ ఆ బొమ్మలో దాస్తారు. ఇక ఆ ముఠా వాళ్లు డేనీ వెంట పడతారు. ఇక డేనీ వారి నుంచి, పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ మారు పేర్లు పెట్టుకుని, రకరకాల మారువేషాలు వేసి డాన్సులు అవీ చేస్తాడు. ఇలా సాగే కథలో డేనీ విపరీతంగా పేరు తెచ్చుకున్నాడు. బింగ్ క్రాస్బీతో కలిసి నటించిన “వైట్ క్రిస్మస్” (1954), “ద కోర్ట్ జెస్టర్” (1956) అనే పారడీ కూడా డేనీ హిట్ సినిమాలే. ‘‘నాక్ ఆన్ ద వుడ్’’ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. కిశోర్‌కుమార్‌ను ముగ్ధుణ్ని చేసిందీ సినిమా! అందుకే లాగుంది, దాన్ని హిందీలో తీస్తే తను వేస్తానన్నాడు.

విదేశీ కథలను భారతీయ సినిమాలగా తర్జుమా చేయడంలో ఘనుడైన ఐఎస్‌ జోహర్‌ (నటుడు, దర్శకుడు కూడా) కథ రాయగా, నరేంద్ర సూరి దర్శకత్వంలో షకీలా హీరోయిన్‌గా ‘‘బేగునాహ్’ (నిరపరాధి అని అర్థం) పేర సినిమా నిర్మించడానికి అనూప్‌చంద్‌ షా, మహీపత్‌రాయ్‌ షా ముందుకు వచ్చారు. శంకర్‌`జైకిషన్‌ సంగీతం, జైకిషన్‌ ఓ దృశ్యంలో కనబడి ముకేశ్‌ గొంతుతో ‘‘ఎయ్‌ ప్యాసే దిల్‌ బేజుబాన్‌’’ అనే ఓ పాట పాడతాడు కూడా. 1957 మార్చిలో యీ సినిమా విడుదలైతే వీళ్ల కర్మం కొద్దీ డేనీ అప్పుడు బొంబాయి వచ్చి ఉన్నాడు. ఎవరు చెప్పారో ఏమో వెళ్లి హిందీ సినిమా చూశాడు. వెంటనే తన సినిమా నిర్మాతలైన పారమౌంట్‌ పిక్చర్స్‌ వారికి తెలియపరిచాడు. భారత ప్రభుత్వం ఆ ఏడాదే చేసిన కాపీరైట్‌ చట్టప్రకారమే వాళ్లు కేసు పడేశారు. అంతే, కోర్టు సినిమాను ఆపేయాలని ఇంజంక్షన్‌ యిచ్చింది. పదిరోజుల ప్రదర్శన తర్వాత అన్ని సినిమా హాళ్లలోను ప్రదర్శన నిలిపివేశారు.

కేసు నడిచింది. హిందీ సినిమా ప్రింట్లు నెగటివ్‌లతో సహా తగలబెట్టాలని జజ్‌ తీర్పు యిచ్చాడు. తగలబెట్టారు కూడా. ఆ కారణంగా ఆ సినిమా ప్రింట్లు యిప్పుడు ఎక్కడా దొరకవు. పాటలు మాత్రం మిగిలాయి. ఈ దురదృష్టానికి కొనసాగింపు కూడా ఉంది. కొన్ని ప్రింట్లు హైదరాబాదు సర్క్యూట్‌లో ఎక్కడెక్కడో మిగిలిపోయి, రెండేళ్ల దాకా చలామణీలో ఉండిపోయాయి. ఆ విషయం కోర్టు దృష్టికి రావడంతో వాళ్లు జరిమానాలు కూడా విధించారు. దానితో నిర్మాతలు దిబ్బయిపోయారు. నిరపరాధి పేరుతో సినిమా తీసినా కాపీ చేసిన అపరాధానికి పెద్ద మూల్యమే చెల్లించారు. తర్వాత కాళిదాస్ దర్శకత్వంలో కిశోర్ హీరోగా వేసిన “హాఫ్ టికెట్” (1962) సినిమాలో యీ వెంటాడడం, మారువేషాలు వేయడం థీమ్ వాడుకున్నారు.

తర్వాతి రోజుల్లో డేనీ కెరియర్లో ఆటుపోట్లు రావడం మొదలుపెట్టాయి. “మెర్రీ ఆండ్రూ”, “మీ అండ్ ద కల్నల్”, “ద ఫైవ్ పెన్నీస్”, “ఆన్ ది డబుల్” సినిమాలలో వేసిన తర్వాత 1963 నుండీ టీవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. చివరిదాకా యునిసెఫ్ కార్యక్రమాలకో, మరో దానికో బెనిఫిట్ షోలు ఇస్తూనే ఉండి తన కళను సార్థకం చేసుకున్న ధన్యజీవి డేనీ కేయే! డేనీ హీరో, గాయకుడు, డాన్సర్, కమెడియన్ ఐన ఆల్‌రౌండ్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. మంచి వంటగాడు, బేస్‌బాల్ టీమ్ ఓనర్. ఏరోప్లేన్ పైలట్. (బోయింగ్ 747 కూడా నడపగలడు).

వీటన్నిటినీ మించి అతడు సమాజం పట్ల బాధ్యత ఫీలయ్యే మహామనిషి. 1954లో కెరియర్ ఉచ్చదశలో ఉండగానే యునైటెడ్ నేషన్స్ వారితో చేతులు కలిపాడు. యునిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ వారు చిన్న పిల్లలకై ఏర్పరిచిన ఫండ్) కై నిధులు సేకరించాడు. ప్రదర్శనలు ఇచ్చాడు. యునిసెఫ్ వారు తీసిన లఘుచిత్రం “ద పైడ్ పైపర్”లో ఉచితంగా నటించాడు. తనను ఆదరించిన బాల ప్రేక్షకుల కోసమే ఇవన్నీ చేసాడనుకున్నా, సంగీతంపై, సంగీతకారులపై అభిమానంతో ‘సింఫనీ మ్యూజిషియన్స్ పెన్షన్ ఫండ్’ కోసం ప్రదర్శనలు ఇచ్చి పది మిలియన్ల డాలర్ల నిధులు సంపాదించి ఇచ్చాడు. అతను మొత్తం నటించినవి 17 చిత్రాలు. వాటిలో ప్రఖ్యాతమైనవి – అప్ ఇన్ ఆర్మ్స్ (1944), ద కిడ్ ఫ్రమ్ బ్రూక్లిన్ (1946). ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ (1947), ఎ సాంగ్ ఈజ్ బోర్న్ (1948), ద ఇన్స్‌పెక్టర్ జనరల్ (1949), హాన్స్ క్రిస్టియన్ యాండర్సన్ (1952), నాక్ ఆన్ వుడ్ (1954), ద కోర్ట్ జెస్టర్ (1956), 1963 నుండి నాలుగు సంవత్సరాల పాటు “ది డేనీ కేయే షో’ అనే టీవీ షో. (దీనికి ఫస్టు సీజన్‌లోనే ఎమ్మీ అవార్డు వచ్చింది), చివరి రోజుల్లో స్కోకీ (1981) అనే టీవి సినిమాలో కాన్సంట్రేషన్ క్యాంప్ నుంచి బయటపడిన వ్యక్తి పాత్ర వేశాడు.

1983లో డేనీకి బైపాస్ సర్జరీ జరిగింది. ఆ సందర్భంగా జరిగిన రక్తమార్పిడి కారణంగా హెపటైటిస్ సి సోకింది. దాని కారణంగా 1987 మార్చిలో 76వ ఏట మరణించాడు. కిశోర్ కుమార్ యింట్లో గోడకు ముగ్గురి ఫోటోలుంటాయట. సైగల్‌ది, రవీంద్రనాథ్ టాగోర్‌ది, డేనీ కేయేది. ‘‘అపూర్వ సింగీతం’’ పేర సింగితం శ్రీనివాస రావు గారిని 4 రోజుల పాటు సన్మానిస్తూ కమల్ హాసన్ 2024లో నిర్వహించిన కార్యక్రమం యూట్యూబులో లభిస్తోంది. దానిలో కమల హాసన్ కూడా డేనీ కేయేను ప్రస్తుతిస్తూ మాట్లాడాడు. అంటే కిశోర్ తర్వాతి తరం నటుల్లో కూడా డేనీచే ప్రభావితమైన నటు లున్నారన్నమాట! (- ఫోటోలు – పైన బింగ్ క్రాస్బీ, డేనీ కేయే ‘‘వైట్ క్రిస్‌మస్’’లో, ‘‘న్యూ ఢిల్లీ’’లో కిశోర్ కుమార్, క్రింద – 1952లో రాజ్ కపూర్, నర్గీస్ హాలీవుడ్ వెళ్లినపుడు డేనీతో, ‘‘హాఫ్ టికెట్’’లో ఆడ వేషంలో కిశోర్, ప్రాణ్‌ని ఆటపట్టిస్తూ..)

– ఎమ్బీయస్ ప్రసాద్

5 Replies to “ఎమ్బీయస్‍: కిశోర్‌కుమార్ లైఫ్‌నే మార్చేసిన డేనీ కేయే”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.