ఫ్రాయిడ్ చేసిన సైకీ విభాగాల ప్రతిపాదనలో ఇడ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈగో, సూపర్ ఈగోల గురించి… ఇడ్‌ను మనసుతో పోల్చవచ్చు, ఇడ్ అనేది అడవి గుఱ్ఱం లాటిది, ఈగో అనేది దాన్ని నడిపే రౌతు లాటిది. తన కంటె బలమైన గుఱ్ఱాన్ని అదుపులో వుంచడమే అతని పని. వివేకం వంటి సూపర్ ఈగో అనేది ఆదర్శాలు వల్లించేది. ఈగోకు అంతటి ఆదర్శాలేమీ లేవు. వెధవ పని చేయాలనుంటే సమయం, సందర్భం చూసుకుని మరీ చెయ్యాలంటుంది.
‘‘నీ కేమైనా బుద్ధి వుందా? ఆ అమ్మాయిని ముద్దెట్టుకోవాలంటే జనమెవరూ లేని సందులోకి వెళ్లాక పెట్టుకోవాలి కానీ, అందరి ఎదుటా పెట్టుకుంటే ఎలా? చాచి లెంపకాయ కొట్టిందంటే కొట్టదూ మరి?’ అని తిడుతూ వుంటాం. ఆ బుద్ధే ఈగో. సూపర్ ఈగో ఆ అమ్మాయికి యిష్టం లేని పని చేయడానికి వీల్లేదని హితబోధ చేస్తుంది. ఈగో బాహ్యప్రపంచానికి, కోర్కొలు తీర్చాలని అల్లరి చేసే రాలుగాయి ఇడ్‌కు మధ్య రాజీ కుదురుస్తూంటుంది. ‘చీకటి పడనీ’ అని బుజ్జగించి, వాయిదా వేయిస్తుంది.
ఇడ్ కోరే గొంతెమ్మ కోర్కెలను ఈగో, సూపర్ ఈగో అణచివేస్తూ వుంటే అదేం చేస్తుంది? కలల ద్వారా తన కోరికలు తీర్చుకుంటుంది. సంస్కారం కొద్దీ మన ఆలోచనలను నియంత్రించుకుంటాం కానీ ఎక్కడో మనసులో నిక్షిప్తమైన కోర్కెలు కలల ద్వారా బయటపడతాయి. ఒక్కోసారి ఒక వ్యక్తితో శృంగారం సలిపినట్లు కల వచ్చిందనుకోండి. మధ్యలో మెలకువ వచ్చినా, లేక తర్వాత కల గుర్తుకు వచ్చినా సిగ్గుపడతాం, ఆశ్చర్యపడతాం – వారి పట్ల నాకా భావన లేదే! కల అలా ఎలా వచ్చింది? అని.
దాని అర్థం మన అచేతన మనసులో ఆ కోర్కె నిబిడంగా వుందన్నమాట. సంస్కారం కొద్దీ దాన్ని అణచివేశాం. అదను చూసి అది కల ద్వారా కోర్కె తీర్చుకుంది. మరి పగటికలలు? అవి ఈగో (బుద్ధి) సృష్టించేవే! ప్రస్తుత పరిస్థితిని ఆమోదిస్తూనే ఊహల్లో తేలిపోతాం. ఏ విధంగా జరగడానికి ఆస్కారం వుందో చూసుకుంటూ కథ అల్లుకుంటాం . ఇడ్‌కైతే సాధ్యాసాధ్యాల ప్రమేయం లేదు. అనుకున్నది ఎలాగోలా జరగాలంతే!
ఇడ్ లాగే ఈగో కూడా సుఖాల కోసమే అర్రులు చాస్తుంది . బాధను, టెన్షన్‌ను తగ్గించుకుందామని చూస్తుంది. తేడా ఏమిటంటే దానికోసం ఒక ప్రణాళిక వేస్తుంది. బయటి సమాజంతో పేచీ రాకుండా తన కోరిక నెరవేరే ఉపాయం వెతుకుతుంది. అది నెరవేరే సాధనం దొరకనప్పుడు ఇడ్‌ను ఆచరణసాధ్యమైన మార్గం వైపు మళ్లిద్దామని చూస్తుంది.
ఈగో తార్కికమైనది, సమస్యను పరిష్కరించగల నేర్పు కలది. మనసుకు తట్టగానే ఛట్టున చేసేసే వాడి ఈగో బలహీనమైనదని అనాలి. స్వీయనియంత్రణ కలవారి ఈగో పటిష్టమైనది. ఏ వ్యక్తైనా టెన్షన్లతో సతమతమవుతూంటే సైకియాట్రిస్టు అతని ఈగోను పటిష్టం చేస్తాడు. ఉన్న పరిస్థితుల్లో నేను చేయగలిగినది యింతే. ఇంతకంటె ఏదో పొడిచేయాలని అనుకుని ఊరికే ఆందోళన పడడం అనవసరం అని అతనికి తోచేట్లు చేస్తాడు.
ఇక సూపర్ ఈగో 3-5 సం.ల వయసులో ఏర్పడుతుంది. అది సామాజిక నియమాల ప్రకారం ఇడ్‌ను మలచడానికి చూస్తుంది. ఉదాహరణకి తెలుగునాట అయితే మీ నాన్న సోదరి కూతుర్ని ప్రేమించు కానీ, సోదరుడి కూతుర్ని ప్రేమించకు అని చెప్తుంది. ఉత్తరాదిన అయితే వీళ్లిద్దరినీ ప్రేమించకు అని చెప్తుంది. ఇది తలిదండ్రుల నుంచి, బంధువర్గాల నుంచి అబ్బుతుంది. ఇక ఈగోకు ‘చేయకూడని పనులు చేయగలిగినా చేయవద్దు’ అని చెప్తుంది.
చెప్పడమే కాదు, తప్పు చేసిన పక్షంలో ఈగోలో దోషభావాన్ని (గిల్ట్ కాంప్లెక్స్) కలిగిస్తుంది. దీన్ని సూపర్ ఈగో అంతరాత్మ (కాన్‌సైన్స్) విభాగం అంటారు. ఇది పెట్టే బాధ ఎవరూ భరించలేరు. సమాజంలో అనేక నేరాలు జరగకుండా వున్నాయంటే దానికి కారణం యిది మనలో నిరంతరం పని చేస్తూండడమే. లేకపోతే ఎన్ని కోట్లమంది పోలీసులూ చాలేవారు కారు. దాస్తవస్కీ ‘‘నేరము-శిక్ష’’ చదివితే అంతరాత్మ పెట్టే క్షోభ ఎలా వుంటుందో అర్థమవుతుంది.
సూపర్ ఈగోలోని రెండో విభాగం ఐడియల్ సెల్ఫ్ (లేదా ఈగో-ఐడియల్). ‘నేను యిలా వుండాలి’ అని మనకు మనమే ఊహించుకునే ఆదర్శమూర్తి. ‘వాడు తిట్టాడు కదాని నేనూ అలాగే తిడితే యిక వాడికీ, నాకూ తేడా ఏముంది?’ అనుకుంటాం చూడండి. అదే! నేను గొప్పవాణ్ని, మంచివాణ్ని, యింకోడి కాసుకి కక్కుర్తి పడనివాణ్ని అని వాడిని వాడు సంభావించుకోవడం చేతనే ఆటోవాడు జారిపడిపోయిన పర్సు తీసుకువచ్చి యిచ్చేస్తున్నాడు. ఏమో చూడలేదండీ అంటే ఏమైనా అనగలమా?
దేవుడు చూస్తున్నాడు, పాపం చేస్తే నరకశిక్ష వేస్తాడు అనే భయం చేత యిచ్చాడు అనుకుంటే మరి దైవభావన లేనివాడు కూడా తెచ్చి యిస్తున్నాడు కదా! తను అనుకున్నట్టు ప్రవర్తించలేని సందర్భాల్లో సూపర్ ఈగో ఆ వ్యక్తిలో అంతరాత్మ ద్వారా గిల్ట్ కాంప్లెక్స్‌ను పెట్టి హింసించేస్తుంది. ‘ఛ, అలా చేశానేమిటి?’ అనే బాధ తినేసి మనిషి జబ్బు పడతాడు. అప్పుడు సైకియాట్రిస్టు ‘ప్రమాదో ధీమతామపి’ అని నచ్చచెప్పి అతన్ని ఊరడించాల్సి వస్తుంది.
ఈ అంతరాత్మ, అంతరంగా నిలబెట్టుకున్న ఆదర్శ పురుషుడు కెమికల్స్‌తో, హార్మోన్లతో తయారు కావు. పెరిగిన వాతావరణం మనలో వాటిని ప్రవేశపెడుతుంది. దాన్నే మనం సంస్కారం అంటాం. కుటుంబం బట్టి కొందరికి ఎక్కువగా వుంటుంది, మరి కొందరు ఎదుగుతున్న కొద్దీ అలవర్చుకుంటారు. చిన్నప్పటినుంచి సంస్కారయుతంగా వుంటే మన హిందువులు ‘పూర్వజన్మ సంస్కారం’ అని ముచ్చటపడతారు. అయితే పూర్వజన్మలో దీన్ని సంస్కారంగా పాటించారో లేదో తెలియదు. కొన్నేళ్ల క్రితం బలపరీక్షలో నెగ్గి కన్య హస్తాన్ని చేపట్టడం ధర్మం, సంస్కారం. ఈనాడు బలపరీక్షలు లేవు, అమ్మాయి మనసు తెలుసుకుని చేపట్టడం సంస్కారం.
ఇక ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మరో సిద్ధాంతం మనిషిలోని ఇడ్‌లో వుండే ‘‘లిబిడో’’, శృంగారప్రేరణలకు కేంద్రం. సైకిక్ ఎనర్జీకి కూడా అంటాడు ఫ్రాయిడ్. మనిషి మనుగడకు, ఎదుగుదలకు, సమాజంలో పోటీ పడడానికి, అసూయావైషమ్యాలకు, దంపతుల మధ్య, తోడబుట్టినవారి మధ్య, తలిదండ్రులు-పిల్లల మధ్య రకరకాలైన గొడవలు రావడానికి యిదే కారణమంటాడు. ఈ భావన ప్రస్ఫుటంగా మనకు తెలియదు కానీ మన ఆలోచనలను అది ఆ దిశగా ప్రేరేపిస్తుందంటాడు.
ఇది చాలా విస్తృతమైన సబ్జక్టు. లిబిడో సైకో సెక్సువల్ డెవలప్‌మెంట్స్, ఫిక్సేషన్స్ యిలా చాలా విభాగాలుగా వుంటుంది. అవన్నీ చెపితే పూర్తిగా ఎకడమిక్ పాఠం అయిపోతుంది. ఆసక్తి వున్నవాళ్లు పుస్తకాలే చదువుకోవచ్చు. అయితే మన సమాజంలో సాధారణంగా ఎదురయ్యే మూడు రకాల కాంప్లెక్సు గురించి మాత్రం విపులంగా చెపుతాను.
టీనేజి అబ్బాయి తండ్రంటే మండిపడుతూంటాడు, టీనేజి అమ్మాయి తల్లితో పోట్లాడుతూంటుంది. భార్యాభర్త కలహాలలో ప్రధాన పాత్ర వహించేది, మగవాడు తన తల్లితో భార్యను పోల్చి కించపరచడం, ఆడది తన తండ్రితో భర్తను పోల్చి హీనంగా చూడడం. కడుపున పుట్టినవాళ్లను కూడా తలిదండ్రులు ద్వేషభావంతో చూడడం. వీటిని ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్, మెడియా కాంప్లెక్స్ అని పిలుస్తారు. మొదటిది ఫ్రాయిడ్ ప్రతిపాదించగా, రెండోది, మూడోది అతని శిష్యుడు జంగ్ ప్రతిపాదించాడు.
వీటికి యీ పేర్లు ఎందుకు వచ్చాయో తెలిస్తే ఆ కాంప్లెక్సును అర్థం చేసుకోవడం సులభమౌతుంది. దానికి సంబంధిత గ్రీకుపురాణ గాథలు తెలుసుకోవాలి. శల్యసారథ్యం అనే వర్ణనను అర్థం చేసుకోవాలంటే శల్యుడి గురించి, ధర్మరాజుతో గల బంధుత్వం గురించి, అతని బలహీనత గురించి, అతను ధర్మరాజు కిచ్చిన మాట గురించి, కర్ణుడిని అవస్థలపాలు చేసిన వైనం గురించి పురాణగాథ తెలుసుకోవాలి. అప్పుడు ఎవరైనా మరీ నిరుత్సాహపరుస్తూ వుంటే శల్యసారథ్యమో కాదో అర్థమవుతుంది.
అలాగే ఈడిపస్, ఎలక్ట్రా, మెడియా గురించి తెలుసుకుని వాటిని ఎలా అన్వయించుకున్నారో తెలుసుకుందాం.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2020)
[email protected]