కరోనా కంట్రోల్ కోసమంటూ లాక్ డౌన్ పాటించడం, ఎవరికి వారు ఇళ్లకు పరిమితం కావడం ఓకే కానీ, ఇదే సమయంలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తూ ఉండటం గమనించాల్సిన అంశం. ఆర్థిక సంక్షోభం అనే పెద్ద పదాన్ని అర్థం చేసుకోవడానికి ఏ అర్థశాస్త్రమో చదివి ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వార్తలను గమనించినా అదేమిటో అర్థం అవుతుంది. ఉదాహరణకు బెంగళూరు సిటీ రవాణా సంస్థ చేసిన ప్రకటన. వచ్చే నెల ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలను ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా లేదని ఆ సంస్థ ప్రకటించింది! అది ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ, సొంత కార్పొరేషన్. బస్సులు తిరిగితే దానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో ఎక్కువ మొత్తం డీజిల్ కు, అదే స్థాయి మొత్తం ఉద్యోగుల జీతాలకు వెచ్చిస్తుంది. దానికి లాభాలు పెద్దగా ఏమీ ఉండవు. ఏదో నామమాత్రంగా ఉంటాయి. నష్టాలు ఉన్నా పెద్దగా ఆశ్చర్యం లేదు.
కట్ చేస్తే.. దాదాపు నెల రోజుల నుంచి సిటీ బస్సులు తిరగడం లేదు. ఒక్క రూపాయి కూడా ఆ ఆర్టీసీ ఖాతాలోకి జమ కావడం లేదు. డీజిల్ ఖర్చు ఎలాగూ లేకపోవచ్చు. మరి ఉద్యోగుల జీతాల కథ ఏంటి? ఇదీ పరిస్థితి. ఈ పరిస్థితి ఏ బెంగళూరు నగర రవాణా కార్పొరేషన్ ది మాత్రమే కాదు, దేశంలోని ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆర్టీసీ ల పరిస్థితీ ఇంతే!
ఒక్క ఆర్టీసీనే కాదు.. పెట్రోల్ అమ్మకం లేదు, మద్యం అమ్మకం లేదు, ఉత్పత్తి లేదు, రిజిస్ట్రేషన్లు లేవు.. ఒక నెలకు పైనే ఇలా గడిచిపోయింది! ఈ అంశాల మీదనే రోజువారీగా ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. నెల రోజులుగా అలాంటిదేమీ లేకపోవడంతో.. ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోయాయి. గత నెలలో సగం సగం జీతాలను ఎలాగోలా చెల్లించారు. మళ్లీ నెల వచ్చేస్తోంది! ఎంతో కొంత టర్నోవర్ కూడా లేని సంస్థలు బోలెడన్ని. వాటి కరెంట్ ఖాతాలు జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో లాక్ డౌన్ తో దిక్కుతోచని స్థితి ప్రధానంగా ప్రభుత్వాలది, ప్రభుత్వ రంగ సంస్థలదే అవుతూ ఉంది.
మరి ఇప్పుడు ఎవరిని నిందించేది? ప‌్రభుత్వాలనా, ప్రజలనా, కనపడని కరోనానా, దాన్ని పుట్టించిన చైనానా? ఎవరిని నిందించీ ప్రయోజనం అయితే లేదు. ఇప్పుడు కచ్చితంగా ఏం చేయాలనే క్లారిటీ ప్రభుత్వాలకూ కనిపించడం లేదు. సింపుల్ గా చెప్పగలిగిన అంశం.. చైనాలో కరోనా వ్యాప్తి గురించి ఇండియాలో వార్తలు వచ్చినప్పుడే, ఇండియా తన అంతర్జాతీయ సరిహద్దులను మూసేసి, విమానాలను ఆపేయాల్సిందనేది. అయితే ఆ పని అప్పట్లో జరగలేదు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న పరిస్థితి. మరోవైపు ధైర్యంగా, ధీటుగా కరోనాను ఎదుర్కొనడానికీ దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవని ప్రభుత్వాలే చెబుతున్నాయి. దేశంలో వైద్యరంగం దుస్థితిని చాటుతూ ఉంది ఈ పరిస్థితి. దశాబ్దాల పాటు పురోగమిస్తూ ఉన్నామని చెప్పుకున్నా..దేశంలో సరైన ప్రభుత్వాసుపత్రులను తయారు చేసుకోలేకపోయినందుకు పాలకులు సిగ్గుపడాలి. ఒక ప్రభుత్వాన్ని, ఒక పార్టీని మరొకరు నిందించడం కాదు, ఈ పరిస్థితికి అందరూ కారకులే