ఆఫీసుల్లో ప్రేమ, కాలేజీల్లో ప్రేమ, వాటికి వెళ్లే దారుల్లో ప్రేమ.. ఇక ప్రేమలో ఉన్న వాళ్లు కలిసేది, మల్టీప్లెక్సుల్లో, కాఫీ డేల్లో, పార్కుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో! ఈ ప్రేమ కాండల గురించి ఎవరికీ కొత్తగా వివరించనక్కర్లేదు, ఏమీ చెప్పనక్కర్లేదు! అయితే ఇప్పుడు అన్నీ క్లోజ్ అయ్యాయి.. అదే అసలు కథ. దాదాపు నెల కావొస్తోంది లాక్ డౌన్ మొదలై!
ఎన్నడూ ఎరగని అనుభవం ఇది! వేర్వేరు నగరాల్లో పని చేసే ప్రేమికులు కూడా ఏదో ఒక వంక పెట్టుకుని వారాంతాల్లోనో, రెండు వారాలకు ఒకసారో కలిసేందుకు అవకాశాలను చూసుకునే వాళ్లు. అయితే ఇప్పుడు ప్రేమికులకు అన్ని ద్వారాలూ మూసుకుపోయాయి. ఎవరి ఇంట్లో వాళ్లు, ఎవరి హాస్టల్ లో వాళ్లు! హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదువుకునే-ఉద్యోగాలు చేసే యువత చాలా వరకూ లాక్ డౌన్ కు ముందే ఇళ్లకు చేరుకుంది. కొందరు ఆయా నగరాల్లోనే హాస్టల్స్ లో ఉన్నా… బయటకు కదలడం మాత్రం తేలిక కాదు.
ఒకవైపు లాక్ డౌన్ నేపథ్యంలో పెళ్లి అయిన వాళ్లు ఒక రకమైన అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. పగలంతా, భార్యాభర్త ఇళ్లలోనే. ఇన్నేళ్లూ అలాగే ఉండిన వారి పరిస్థితి ఓకే, అయితే ఇన్నాళ్లూ ఉదయం లేస్తే ఆఫీసులకు పరగులెత్తి, ఇంటి కన్నా ఆఫీసులోనే ఎక్కువ సమయం గడిపిన వారు, ఇప్పుడు పగలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. దీని వల్లా ఒక్కోచోట ఒక్కో పరిస్థితి తలెత్తుతూ ఉంది. కొందరు ఈ సమయాన్ని ఆస్వాధిస్తూ ఉండవచ్చు, మరి కొందరు బోర్ గా ఫీలవుతూ ఉండవచ్చు. అదంతా పెళ్లైన వారి కథ.
పెళ్లి కాకుండా ఇంకా ప్రేమ దశలో ఉన్న వారు మాత్రం ఇప్పుడు ఎడబాటును ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రేమలో పడిపోయి సినిమాలు, షికార్లకు వెళ్లే వాళ్లు, ఏ కాఫీ డేలోనో కూర్చుని సాయంత్రాలను గడిపే వాళ్లు, పార్కుల్లో కలిసే వాళ్లూ.. వీళ్లందరికీ ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయాయి. ఒకర్నొకరు డైరెక్టుగా చూసుకుని నెల రోజులు గడిపేస్తున్న వాళ్లూ చాలా మందే ఉండవచ్చు.
అయితే ఇది ఫేస్ బుక్, వాట్సాప్ ల యుగం. వీడియో చాటింగులు ఈజీనే కాబట్టి కాస్త ఎడబాటు, విరహ వేదన తీరుతున్నట్టే. అయితే వీళ్లలోనూ చాలా మంది ఇళ్లలో ఉంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ కూడా లాక్ డౌనే, కాబట్టి.. అక్కడ కూడా యధేచ్ఛగా ప్రేయసీ-ప్రియులు మాటలు కలిపేందుకు అవకాశాలు అంతంతమాత్రమేలాగున్నాయి!