‘‘రిపబ్లిక్ దినం నాడు త్రివర్ణపతాకానికి జరిగిన అవమానం చేత భారతదేశం దుఃఖించింది.’’ అన్నారు మోదీగారు యీ సంవత్సరపు తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో. ఎఱ్ఱకోట దగ్గర వేరే జండా ఎగరవేయడం గురించే ఆయన ప్రస్తావించి వుండాలనుకున్నా. అలా ఎగరేసిన దీపూ సిద్దూ కొంతకాలం కనబడకుండా పోయి, చివరకు ఫిబ్రవరి 9న అరెస్టయిన సంగతి తెలిసే వుంటుంది. నిన్న దిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టినపుడు పోలీసులు పెట్టిన కేసుల్లో జండాను అవమానించాడన్న కేసు పెట్టనే లేదు. మరి మోదీ గారు చెప్పినది ఎవరి గురించంటారు? ఇంతకీ అవేళ జాతీయపతాకానికి అవమానం జరిగిందా? లేదా? అసలు మోదీగారి మాతృసంస్థ ఆరెస్సెస్‌కు మన జాతీయపతాకం గురించిన అభిప్రాయాలు ఎలాటివి?
దీపు సిద్దూ జండా ఎగరేయగానే అది ఖలిస్తాన్ జండా అని కొద్ది సేపు హాహాకారాలు వినబడ్డాయి. కాదు అది శిఖ్కుల జండా అయిన నిషాన్ సాహిబ్ మాత్రమే అని తర్వాత తేలింది. అనేకమంది మిలటరీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో అతను నిక్షేపంలా ఓ స్తంభం ఎక్కి ఆ జండా ఎగరేయడం టీవీల్లో చూశాం. అది చూపిస్తూ టైమ్స్ నౌ టీవీ ఛానెల్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నట్లు ‘జాతీయ పతాకానికి అవమానం జరిగిపోతోంది’ అంటూ గగ్గోలు పెట్టేసింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది – ఎలా అవమానం జరుగుతోందా? జాతీయపతాకం జోలికి వెళ్లలేదు, దాన్ని కిందకు దింపలేదు, ఈ జండాను దాని కంటె ఎత్తుగా ఎగరేయటం లేదు కదాని. కానీ సాక్షాత్తూ మోదీగారే అవమానం జరిగిందని తన బాత్‌లో చెప్పేటప్పటికి ఏదో ఒక రూలు ప్రకారం జరిగేవుంటుంది దాని గురించి దీపు సిద్ధూకి శిక్ష పడుతుంది అనుకున్నాను. తీరా చూస్తే అతని మీద పెట్టిన కేసుల్లో ఆ కేసు లేనే లేదు.
అతని మీద పెట్టిన కేసులు అల్లర్లు (రయటింగ్), హత్యాప్రయత్నం, నేరపూరిత కుట్ర (క్రిమినల్ కాన్‌స్పిరసీ), దోపిడీ (డెకాయిటీ), మరణాలకు దారి తీసే పరిస్థితి కల్పించడం (కల్పబుల్ హోమిసైడ్).. యిలాటివి. వీటిల్లో న్యాయపరీక్షకు ఎన్ని నిలుస్తాయో, ఎన్ని నిలవవో తెలియదు. పోలీసులు తమ వద్ద నున్న సిసిటివి ఫుటేజి చూపించి వాదించబోతే సిద్దూ లాయరు దాన్ని తిప్పికొట్టాడు. – ‘అతను తన శాంతియుతమైన ఆందోళనకారుడు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడో దూరంగా ఉన్న హోటల్‌లో వున్నాడు. కావాలంటే అక్కడి ఫుటేజి చూడవచ్చు. అతని సెల్‌ఫోన్ల లొకేషన్ల ద్వారా ఎఱ్ఱకోటకు ఎంత దూరంగా వున్నాడో చెక్ చేసుకోవచ్చు. 2 గంటలకు ఎఱ్ఱకోటకు చేరేసరికే అక్కడ జనం పోగుపడి వున్నారు. ఇతను వాళ్లను ఫలానా చోట పోగుపడమని చెప్పడానికి సాక్ష్యాలేవీ లేవు. వచ్చాక వాళ్లనేమీ రెచ్చగొట్టలేదు. పైగా వాళ్లను శాంతపరచడానికి పోలీసులకు సహకరించాడు. ప్రజలను తృప్తిపరచడానికి జండా ఎగరేశాడు. కానీ పోలీసులు యితనిపై నేరం మోపడానికి మాత్రమే ఫుటేజిని వాడుతున్నారు.’ అన్నాడు. అప్పుడు మేజిస్ట్రేటు ‘మీరు నేరం మోపే ఉద్దేశంలో కాక, వాస్తవాలు వెలికితీసే దృక్పథంతో విచారణ జరపండి.’ అని పోలీసులను ఆదేశించాడు.
ఈ పరిస్థితుల్లో యీ కేసు ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు కానీ మన ప్రస్తుతాంశం జాతీయపతాకానికి అవమానం కాబట్టి నెట్‌లో దాని గురించి చూడబోయాను. (లింకు కింద యిచ్చాను). మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫయిర్స్ వాళ్లు 2002లో ప్రచురించిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా కనబడింది. దానిలో జాతీయపతాకానికి ఎటువంటి అవమానాలు జరగకూడదో రాశారు. అందరూ చూస్తూండగా కాల్చకూడదు, చింపకూడదు, రూపుమాపకూడదు, కాలితో తొక్కకూడదు, వాచ్యా కానీ లిఖితంగా కానీ దాని స్థాయి తగ్గించకూడదు, వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదు. ఏదైనా వ్యక్తిని గౌరవించడానికంటూ పతాకాన్ని అవనతం చేయకూడదు. ప్రభుత్వం ఆదేశించినప్పుడు తప్ప సగం ఎగరవేయకూడదు. దానితో ఏ వస్తువునూ కప్పకూడదు. ప్రభుత్వం ఆదేశిస్తే తప్ప ఏ వ్యక్తి శవాన్నీ కప్పకూడదు. కాస్ట్యూమ్‌గా లేదా యూనిఫాంగా వాడకూడదు. కుషన్లు, చేరుమాళ్లు వంటి వాటి పైన ముద్రించకూడదు. జాతీయపతాకంపై ఏ అక్షరాలూ వుండకూడదు.
పతాకావిష్కరణకు ముందు దానిలో పూలు చుట్టవచ్చును తప్ప తక్కిన సందర్భాల్లో దానితో ఏదీ చుట్టకూడదు. విగ్రహాలపై దాన్ని కప్పకూడదు, సభా వేదికలపై వాడినప్పుడు బల్లమీద పరవకూడదు, వక్త వెనక్కాల అతని కంటె ఎత్తుగా కుడివైపు అమర్చాలి. కావాలని నేల మీద పడేయడం, నీటిలో పడేయడం చేయకూడదు. తలకిందులుగా ఎగరేయకూడదు. ఆవిష్కరణ సమయంలో పొరపాటు జరిగితే వెంటనే సవరించుకోవాలి. పతాకావిష్కరణ జరిగినప్పుడు దాన్ని గౌరవప్రదమైన స్థానంలో, విడిగా వుండేట్లు చూడాలి. చినిగిపోయినది వాడకూడదు. ఒకే స్తంభం మీద మరొక పతాకంతో కలిపి ఆవిష్కరించకూడదు. జాతీయపతాకం కంటె ఎత్తుగా కానీ సమానమైన ఎత్తులో కానీ మరో జండా ఎగరవేయకూడదు. జండా ఎగరేసిన స్తంభం చివర పతాకం కంటె ఎత్తుగా ఏవైనా గుర్తులు కానీ దండలు కానీ పెట్టకూడదు. జండా పాడైపోయినప్పుడు, లేదా చినిగిపోయినప్పుడు దాన్ని విడిగా తీసుకెళ్లి ఎవరూ చూడకుండా కాల్చేయాలి తప్ప చెత్తబుట్టల్లో పడేయకూడదు.
ఈ నియమాల ప్రకారం చూస్తే దీపు సిద్దూ శిక్షార్హుడా మీరే చెప్పండి. అవేళ జాతీయపతాకం ఎఱ్ఱకోటపై ఎత్తుగా ఎగురుతోంది. ఇతను కోట బయట దాని కంటె తక్కువ ఎత్తులో వున్న ఒక స్తంభానికి శిఖ్కుల జండా ఎగరేశాడు. జాతీయ పతాకం జోలికి వెళ్లలేదు. దాన్ని ధిక్కరించలేదు. దానిపై ఏమీ విసరలేదు. అవమానం జరిగిందని నానా హడావుడీ చేసిన తర్వాత అధికార యంత్రాంగానికి యీ విషయం గుర్తుకు వచ్చినట్లుంది. అందుకే యిది కేసుల్లో చేర్చలేదు. ఇదే సందర్భంగా జాతీయ పతాకం పట్ల ఆరెస్సెస్ దృష్టికోణం ఎటువంటిది? దాన్ని గౌరవించడానికి అది ఏం చేసింది? అనేది తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుంది.
మన జాతీయపతాకాన్ని రూపొందించింది తెలుగువాడైన పింగళి వెంకయ్యగారని అందరికీ తెలుసు. పైన కాషాయరంగు సాహసానికి, కింద ఆకుపచ్చ వ్యవసాయానికి, మధ్యలో తెలుపు శాంతికి, అశోకచక్రం ధర్మపాలనకు ప్రతీకలుగా చెప్తారు. అంతర్లీనంగా మన దేశపు బహుళత్వాన్ని కూడా యిది ప్రతిబింబిస్తుందని అంటారు. కాషాయం హిందువులకు, శిఖ్కులకు, ఆకుపచ్చ ముస్లిములకు, తెలుపు క్రైస్తవులకు, జైనులకు, బౌద్ధులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇది దేశంలో అన్ని వర్గాలకూ సమ్మతమైంది కానీ భారతదేశమంటే హిందువులే తప్ప వేరెవ్వరిదీ కాదనే ఆరెస్సెస్‌కు యిది నచ్చలేదు. దాని అధినేత గోల్వాల్కర్ ‘‘బంచ్ ఆఫ్ థాట్స్’’ అనే తన గ్రంథంలో యిలా రాశారు – ‘మన నాయకులు మన దేశానికి కొత్త జండాను పట్టుకుని వచ్చారు. అవసరమా? మన పురాతన దేశానికి మనదంటూ జండా లేదా? వేలాది సంవత్సరాలుగా మనకంటూ ఏ చిహ్నమూ లేకుండా నివసించామా? ఇప్పుడీ భావశూన్యత ఎందుకు?’ ఆయన దృష్టిలో శివాజీ భాగ్‌వా అనే కాషాయపతాకమే మన జాతీయపతాకం. నిజానికి హిందూ రాజులందరూ దాన్ని ఉపయోగించిన దాఖలాలు లేవు. మహాభారత వీరుల్లో ఒక్కో వీరుడికి ఒక్కో రకం జండా వుందని భారతం చెప్తుంది. అలాగే చోళులకు, చాళుక్యులకు, కాకతీయులకు వేర్వేరు జండాలున్నాయి. కానీ వీరి దృష్టిలో శివాజీ ఒక్కడే రాజు.
ఆరెస్సెస్ భావవేదిక ఐన ‘‘ఆర్గనైజర్’’ పత్రిక త్రివర్ణపతాకం ప్రతిపాదన వచ్చిన దగ్గర్నుంచి దానికి వ్యతిరేకంగా పెద్ద ప్రచారోద్యమం నడిపింది. చివరకు 1947 ఆగస్టు 14 సంచికలో ‘విధివశాన అధికారంలోకి వచ్చినవారు మన చేతిలో త్రివర్ణపతాకాన్ని పెట్టారు కానీ, దాన్ని హిందువులెన్నటికీ సొంతం చేసుకోరు, గౌరవించరు. మూడు అంకె అనేది దుష్ట సంఖ్య (ఈవిల్). మూడు రంగులున్న జండా మానసికంగా దుష్ప్రభావం కలిగిస్తుంది (ప్రొడ్యూసెస్ ఎ వెరీ బాడ్ సైకలాజికల్ ఎఫెక్ట్), దేశానికి హానికరం (ఇన్‌జూరియస్ టు ఎ కంట్రీ) కూడా.’ అని రాసింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ కార్యకర్తలు దేశపతాకాన్ని అవమానించారన్న వార్తలు రావడంతో ప్రధాని నెహ్రూ 1948 ఫిబ్రవరి 24న ‘కొన్ని చోట్ల ఆరెస్సెస్ సభ్యులు జాతీయపతాకాన్ని అవమానించారన్న వార్తలు వచ్చాయి. అలా చేయడం ద్వారా తమను తాము దేశద్రోహులుగా చూపించుకుంటున్నారని వారు గ్రహించాలి.’ అని ప్రకటించారు.
ఈ రోజు మోదీ ప్రభుత్వం ఆకాశానికి ఎత్తివేస్తున్న ఆనాటి హోం మంత్రి సర్దార్ పటేల్ గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌ను నిషేధించారు. తర్వాత ఆరెస్సెస్ అధినేత గోల్వాల్కర్ హామీ యివ్వడంతో 1949 జులైలో నిషేధం ఎత్తివేశారు. ఎత్తివేస్తూ ‘మీరు జాతీయపతాకాన్ని గౌరవించి తీరాలి’ అని చెప్పారట. దాంతో 1950 జనవరి 26న నాగ్‌పూర్‌లో మహల్ ప్రాంతంలోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయపతాకాన్ని తొలిసారిగా ఎగరవేశారు. అదే ఏడాది డిసెంబరులో పటేల్ మరణించడంతో ఆ హామీని ఉల్లంఘించి ఆ పై ఎగరవేయడం మానేశారు. దీన్ని జాతీయపతాకానికి అవమానంగా భావించిన బాబా మెంఢే, రమేశ్ కలాంబే, దిలీప్ చట్టానీ అనే ముగ్గురు యువకులు 2001 జనవరి 26న తమను తాము ‘రాష్ట్రప్రేమీ యువ దళ్’ సభ్యులుగా చెప్పుకుంటూ కొందరితో కలిసి రెషిమ్‌బాగ్‌లో వుండే ఆరెస్సెస్ స్మృతిభవన్‌లోకి చొరబడి జండాను ఆవిష్కరించారు. దీనికోసం అంటే లోపలకి రానివ్వరని, ‘ఆరెస్సెస్ సంస్థాపకుడైన హెగ్‌డేవార్‌కు నివాళి అర్పిస్తామ’ని చెప్తూ లోపలకి వచ్చి ఆ పని చేశారు. దేశభక్తిపూరిత నినాదాలు యిచ్చారు.
వారిని నిరోధించడానికి ప్రయత్నించి విఫలమైన ఆరెస్సెస్ వాళ్లపై కేసు పెట్టింది. కేసు నెంబరు 176, నాగపూర్ 2001 అని గూగుల్‌లో కొడితే యిదంతా వస్తుంది. వాళ్లను అరెస్టు చేశారు. 12 ఏళ్ల పాటు ఆ యువకులు నాగపూర్ సెషన్స్ కోర్టు చుట్టూ తిరిగారు. చివరకు 2013లో తగినన్ని ఆధారాలు లేవంటూ లోహియా అనే జజ్ కేసు కొట్టేశారు. చివరకు 2014 ఆగస్టు 15న, అంటే మోదీ ప్రధాని అయిన సంవత్సరం, ఆరెస్సెస్ తన ప్రధాన కార్యాలయంలోను, స్మృతిభవన్‌లోను జాతీయపతాకాన్ని అధికారికంగా ఎగరవేసింది. ఇక అప్పట్నుంచి జాతీయపతాక గౌరవమర్యాదల గురించి మాట్లాడే హక్కు తెచ్చుకున్నట్లుంది. ఈ సంఘటనపై వివరాలు తెలుసుకుందామంటే యీ లింక్సు చూడండి. ముందుగా ఫ్లాగ్ కోడ్ లింక్. https://www.mha.gov.in/sites/default/files/flagcodeofindia_070214.pdf
https://www.nagpurtoday.in/when-rss-opposed-flag-hoisting-in-nagpur-sent-3-men-to-jail/03031007
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)
[email protected]