ఎమ్బీయస్‌: అమెరికాతో కబుర్లు

''అమెరికాలో కబుర్లు చెప్తారా?'' అనే శీర్షికన సినీరంగానికి సంబంధించని కథా, వ్యాస రచయితలు అమెరికాలో అభిమానులను కలుసుకోవడంలో వున్న కష్టనష్టాలను చర్చించాను. చాలామంది వ్యక్తిగతంగా మెయిల్స్‌ రాశారు – మీరు రాసినది అక్షరాలా నిజమే,…

''అమెరికాలో కబుర్లు చెప్తారా?'' అనే శీర్షికన సినీరంగానికి సంబంధించని కథా, వ్యాస రచయితలు అమెరికాలో అభిమానులను కలుసుకోవడంలో వున్న కష్టనష్టాలను చర్చించాను. చాలామంది వ్యక్తిగతంగా మెయిల్స్‌ రాశారు – మీరు రాసినది అక్షరాలా నిజమే, కానీ ఏం చేయగలం? పరిస్థితులు అలా వున్నాయి. మా బోటి వాళ్లకు సాహిత్యంపై అభిలాష వుంది, వ్యక్తిగత స్థాయిలో మీకు ఆతిథ్యం యివ్వగలం, కానీ టిక్కెట్టు పెట్టి సాహితీసభలు పెట్టమని ఆర్గనైజర్స్‌ని ఒప్పించలేము అంటూ. పెద్ద సంస్థల ఆఫీసు బేరర్స్‌ ఎవరూ నాకు ఏమీ రాయలేదు, చదివారో, యిది వారి దృష్టికి వచ్చిందో లేదో కూడా తెలియదు. వచ్చినా నా సలహా నడిచే వ్యవహారం కాదని వారికీ తెలుసు. ఎందుకంటే ఒక పాఠకుడు కామెంట్‌ రాసినట్లు, యిక్కడే సాహితీసభలకు జనం రారు, అక్కడేం వస్తారు? ఎమ్‌సెట్‌లు, క్యాట్‌లు చదివే హడావుడిలో కథల పుస్తకాలు చదవని అమెరికా యువతకు అక్కడకు వెళ్లాక హఠాత్తుగా సాహిత్యాభిలాష పుట్టుకుని రమ్మనమంటే ఎక్కణ్నుంచి వస్తుంది? రచయితలపై గౌరవం కలగాలంటే ఎలా కలుగుతుంది? సమావేశాలకు వచ్చిన రచయితలను రిసీవ్‌ చేసుకోవడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి కూడా ఎవరూ ముందుకు రారని, అదే సినిమా తారలను రిసీవ్‌ చేసుకోమంటే క్యూలు కడతారనీ కూడా చెప్పారు. మరీ అంత అన్యాయం కాదని, కొందరు అవధానులు చెప్పే పురాణప్రసంగాలకు వెళతారని కొందరు విభేదించారు. పురాణాలను అచ్చగా సాహిత్యం కేటగిరీలో వేయలేం. వాటికి మతపరమైన ఆకర్షణ వుంది కాబట్టి వారిని మామూలు రచయితలుగా లెక్కించలేం. సమావేశాలు సరదాగా గడపడం కోసం వచ్చినవని, భార్యాబిడ్డలు ఎటు తీసుకెళితే అటు వెళ్లాలని, మధ్యలో సాహిత్యం అని కూడా పెడితే ఎలా ఛస్తామని కొందరు వాపోయారు. ''గిరీశం లెక్చర్లు''లో ముళ్లపూడి రాస్తారు – 'సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, పాటలూ, రంగులూ, పొంగులూ.. అన్నీ పెడతామా, యివన్నీ చాలనట్లు కథ కూడా పెడితే మొహం మొత్తిపోతుంది…'' అని. వాస్తవపరిస్థితిని గమనించి, సమావేశాలకు ఓ మూలగానైనా సాహిత్యం రంగు అద్దే ప్రయత్నాలు మానేస్తే నిర్వాహకులకు డబ్బు మిగులుతుంది. వెళ్లే రచయితలకు నిరాశానిస్పృహలు తప్పుతాయి. 

మరి అమెరికాలో వున్న వందలాది మంది సాహితీ అభిమానులు ఏం చేయాలి? వారు తమ అభిమాన రచయితను కలుసుకోవాలని, మాట్లాడాలని అనుకున్నా సాగదా? తమ అభిరుచి చంపుకోవలసినదేనా? రచయితలపై అభిమానంతో తమ యింట్లో ఆతిథ్యం యిచ్చి వారి ప్రవర్తన వలన యిబ్బంది పడిన ఘట్టాలు చెప్పారు కొందరు. తమ పుస్తకాలు, సిడిలు అమ్మే ఉత్సాహం తప్ప అమెరికా చూసే ఆసక్తి, అక్కడ తమ జీవితాల గురించి తెలుసుకునే ఆసక్తి ఏమాత్రం కనబరచరని కూడా ఫిర్యాదు చేశారు. జిజ్ఞాస వున్న రచయిత తన పాఠకుల నుండి ఎంతో నేర్చుకుంటాడు.  విదేశాలలో వున్న వారి జీవితాల నుంచి నేర్చుకునేందుకు మరింత అవకాశం వుంది. పరాయిగడ్డకు వెళ్లడానికి జంకడం వలన అతనా అవకాశాన్ని కోల్పోతున్నాడు కదా! మరెలా? పాఠకుల్లో ఒకరు స్కైప్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు కదా అని సూచించారు. మరో పాఠకుడు 20-25 మంది కంటె స్కైప్‌లో పట్టరు కదా అని వ్యాఖ్యానించారు. దాన్నుంచే నాకొక ఆలోచన వచ్చింది. 'బాలకృష్ణతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా వస్తోంది అనే వార్త వచ్చింది. అతనెవడు? అతని గురించి చరిత్రలో ఏముంది? ఆ చరిత్రలో వున్న వైరుధ్యాలేమిటి?' అని తెలుసుకోవాలనే ఉత్సుకత అమెరికా వాసులైన 20 మంది తెలుగువారికి వుందనుకోండి. నాబోటి వాడు ఆ పేరుతో సీరీస్‌ మొదలుపెట్టి, సగంలో బాకీ పెట్టే హింస భరించడం కంటె ఎవరైనా హిస్టరీ ప్రొఫెసరు గారితో స్కైప్‌ కాన్ఫరెన్సు పెట్టేసుకుంటే గంటలో విషయం తెలిసిపోతుంది. ఏ శనివారం మధ్యాహ్నమో అమెరికాలో కానీయండి, మరే దేశంలోనైనా కానీయండి, 15, 20 తెలుగు కుటుంబాలు ఒకరి యింట్లో పాట్‌లక్‌ పార్టీ చేసుకోవడానికి చేరినప్పుడు వారిలో ఒక 20 మందికి తమకు నచ్చిన రచయితతో మాట్లాడదామని అనుకుంటే అక్కణ్నుంచి రచయితతో స్కైప్‌ సమావేశం పెట్టుకోవచ్చు. 20 మందికి తక్కువగా వుంటే సభలా వుండదు, అంతకంటె ఎక్కువ వుంటే యింటరాక్షన్‌ కష్టం. ఎవరింట్లో కాన్ఫరెన్సు పెడుతున్నారో ఆయనే ప్రొఫెసరుగారితో ముందుగా మాట్లాడుకుని సాంకేతిక విషయాలు చూసుకుంటే అందరూ వచ్చినపుడు హాయిగా వినేయవచ్చు. అది రచయితకు యిబ్బందికరమైన వేళ కాబట్టి, ఆయన శ్రమకు పారితోషికం అన్నట్టుగా – మాట వరసకు ఓ 50 డాలర్లు యిస్తామని ముందే చెప్పి ఆయన ఖాతాలో ఆన్‌లైన్‌ వేసేయవచ్చు. వక్తకు ముందుగా సబ్జక్ట్‌ తెలిపి ఒక గంటసేపు ఆయనను ఉపన్యాసం యిమ్మనమని చెప్పి, మరో గంట ముఖాముఖీ ప్రశ్నోత్తరాలతో గడపవచ్చు. దీనిలో ఎడ్వాంటేజి ఏమిటంటే – తెలుగు చదవడం రాని తెలుగువాళ్లు కూడా పాలు పంచుకోవచ్చు. అప్పటిదాకా వక్త రచనలు చదవనివాళ్లు ఉపన్యాసంతో యింప్రెస్‌ అయితే చదవనారంభించవచ్చు. నా లండన్‌ సమావేశంలో కొందరు నా వద్దకు వచ్చి 'మేం యిప్పటిదాకా మీ కాలమ్‌ చదవలేదు, సంస్థలో చురుకైన కార్యకర్తలం కాబట్టి సమావేశానికి వచ్చాం, మీ ప్రసంగం విన్నాక యికపై చదువుదామనుకుంటున్నాం' అన్నారు. వారిలో కొందరు చదివినా పాఠకుల సంఖ్య పెరిగినట్లే. నాది చదివినప్పుడు, పక్కవాళ్లదీ చదువుతారు. ఏదో ఒక విధంగా పాఠకులు పెరగడమే కావలసినది.  

డాలస్‌ నివాసి తోటకూర ప్రసాద్‌గారు తానాకు ప్రెసిడెంటు-ఎలక్ట్‌గా వుండగా నాతో ఒక ప్రయోగం చేశారు. నెలనెలా వెన్నెల పేరుపై వాళ్ల యింట్లో అందరూ సమావేశమవుతూండేవారు. ప్రసాద్‌గారు ముందుగానే నాకు సౌకర్యమైన వేళలో ఫోన్‌ చేసి ఓ గంట సేపు మాట్లాడించి రికార్డు చేసి, దాన్ని వాళ్లు వచ్చిన తర్వాత వినిపించేవారు. గుమ్మడిగారి గురించి, పద్మనాభం గారి గురించి నేను మాట్లాడాను. అది వట్టి ఆడియోనే. వీడియో అయితే యింకా లైవ్లీగా వుంటుంది. స్కైప్‌లో పెళ్లిచూపులే జరుగుతున్న యీ కాలంలో ఉపన్యాసం వినడం కష్టమేమీ కాదు. ఒకే అభిరుచి వున్నవాళ్లు 20 మంది చేరడమూ అబ్బురం కాదు. వక్త బోరు కొడితే యింకోసారి మరొకరితో ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివలన వక్తకు కూడా శ్రోతలను మెప్పించడంలో తర్ఫీదు అవుతుంది. శ్రోతలకు అతి స్వల్పమైన ఖర్చుతో – 20 మంది కలిపి 50 డాలర్లు సేకరించడం అతి సులభం – అభిమాన రచయితతో మాట్లాడామన్న తృప్తి వుంటుంది. వక్త మరీ మెప్పించేస్తే, యిలాటి కాన్ఫరెన్సుల్లో మరీ పాప్యులర్‌ అయిపోతే అప్పుడు ఆయనను సమావేశాలకు ప్రత్యక్షంగా రప్పించే విషయం ఆలోచించవచ్చు – కనీసడిమాండు వుంటుందన్న ధీమా ఆర్గనైజర్స్‌కు ఏర్పడుతుంది కాబట్టి! 

రచయిత, అతని అభిమానులు కలుసుకోవడానికి యీ వేదిక అతి సులభమైనది, చవకైనది. ఎవరింట్లో వాళ్లు కూర్చుని ముచ్చటించుకుంటారు. అయితే యిలాటి వాటి వలన రచయితకు అమెరికా గురించి ఎక్స్‌పోజరు రాదు కదా అని వాదించవచ్చు కొందరు. వివిధ ప్రాంతాల ఎక్స్‌పోజరు వుంటే రచయిత రచనలో క్వాలిటీ తప్పకుండా పెరుగుతుంది. కానీ అమెరికాకు వచ్చినవారందరికీ విస్తారంగా ఎక్స్‌పోజరు కలుగుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే వచ్చినవాళ్లు ఎవరింట్లోనో నాలుగ్గోడల మధ్య వుంటారు. 'మా జీవితాలు యిలా వుంటాయండి' అని తన దగ్గరకు వచ్చిన వాళ్లు చెప్పినది వింటారు. 'నా అంతట నేను నల్లవాళ్ల కాలనీకి వెళ్లి వాళ్లు స్థితిగతులు స్టడీ చేస్తానండీ' అంటే ఆతిథ్యం యిచ్చినవాళ్లు ఉలిక్కిపడతారు. 'మీరలాటివి ఏమీ చేయండోయ్‌,  తప్పిపోతే మళ్లీ నాకు చచ్చేచావు. నేను కారులో ఎక్కడ తిప్పితే అక్కడ తిరగండి, కిటికీ అద్దం కిందకి దింపకుండా చెట్లూ, పుట్టలూ చూడండి. వాళ్ల గురించి నేను ఏం చెపితే అదే విని వూరుకోండి.' అంటారు. వాళ్లు  తమ తలిదండ్రులతోనే రిస్కు తీసుకోరు. వాళ్లంతట వాళ్లు ఎవరింటికైనా వెళ్లి వస్తానంటే దారి తప్పిపోతారేమోనని భయపడతారు. ఈ రచయితగారు హిచ్‌హైక్‌ చేస్తానంటే ఒప్పుకుంటారా? అందువలన అమెరికా వెళ్లి అక్కడ తెలుగువాళ్ల యిళ్లల్లో వున్నంత మాత్రాన అమెరికాను కాచివడపోసేశామని అనుకుంటే పొరబాటు. అయితే వేరే దేశం వెళితే ఎంతో కొంత జ్ఞానం పెరుగుతుందన్నమాట మాత్రం వాస్తవం. దాని గురించి మరీ వర్రీ అవకుండా వుంటే మాత్రం యీ స్కైప్‌ ప్రయోగం ఆచరణయోగ్యం. ఎక్కడో అక్కడ ప్రారంభిస్తే మెరుగులు దిద్దుతూ పోవచ్చు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]