రమణగారు పాతతరం మనిషని తీసిపారేసేవాళ్లు విజయేంద్ర ప్రసాద్‌గారు ఆంధ్రజ్యోతికి యిచ్చిన యింటర్వ్యూ చూడాలి. ''భజరంగీ భాయిజాన్'' సినిమా చూసి సల్మాన్ ఖాన్ తండ్రి, సుప్రసిద్ధ రచయిత సలీం 'మా వాడి రెమ్యూనరేషన్ కంటె కథకుడిగా మీరు ఒక రూపాయి ఎక్కువ పుచ్చుకోవాలి' అన్నారట. అదీ కథకు, కథకుడికి వున్న వేల్యూ. ఆ కథ గురించి రచయితగా విజయేంద్ర ప్రసాద్ చాలా గొప్పగా చెప్పుకున్నారు. బాహుబలి గురించి కూడా అలా చెప్పుకోగలగాలి అని అనుకోవడం అత్యాశా? కథంతా రెండో పార్టులో వుంటుందని బాహుబలి అభిమానులు నొక్కి చెపుతున్నారు. అదే యింటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'బాహుబలి పార్ట్ 2 భారమంతా నెత్తిమీద వున్నట్టుంది' అన్నారు. మొత్తం కథ లాక్ చేయకుండానే బాహుబలి నిర్మాణానికి దిగారా? లాక్ చేసేసిన తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ చేయాలాని దర్శకుడికి నెత్తిమీద భారం వుంటుంది తప్ప, రచయితకు ఏముంటుంది? కాస్త కన్‌ఫ్యూజింగ్ వుంది. 'పాత' అంటే గుర్తుకు వచ్చింది. నేను నా వ్యాసాల్లో పాతాళభైరవి గురించి ప్రస్తావిస్తే యిప్పుడు దాన్ని ఎవరు చూస్తారండి అంటూ కొందరు రాశారు. అది తీసేనాటికే అలాదీన్ అద్భుతదీపం కథ అతి పాతది. దాన్ని ముందు పెట్టుకుని దీన్ని తీశారు. ఆడింది. రాజమకుటంలో విప్లవం ట్రాక్‌ను ఎన్టీయార్ తన 'వేములవాడ భీమకవి'లో వాడుకున్నారు. అయినా నేను ప్రస్తావించిన సినిమాల తర్వాత కూడా చాలా జానపద సినిమాలు వచ్చాయి. సింహాసనం, సింహగర్జన, సింహబలుడు, భైరవద్వీపం.. యిలా బోల్డు. ఆదిత్య 369లో కూడా కొంతభాగం జానపదమే కదా. మగధీరలో చెప్పనే అక్కరలేదు. హాలీవుడ్‌లో యీ మధ్య తీస్తున్న సినిమాలు జానపదం కావా? వాటిలో కథ లేదా? ఇది చారిత్రాత్మకం కాదు, జానపదం, కథను యిష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. పాత కథలు చూడరనేది తప్పు. రామాయణం, భారతం వేల సంవత్సరాల పాతవైనా చూశారు, చూస్తారు. ఎమోషన్స్ క్యారీ అవ్వాలంతే. హాలీవుడ్‌లో టెన్ కమాండ్‌మెంట్స్ కథ ఎంత పాతది? ట్రాయ్ కథ..? కథ నచ్చి కనక్ట్ అయితే ప్రేక్షకుడు ఏదైనా చూస్తాడు. పాత కథే తిప్పితిప్పి మళ్లీ అదే చెప్పినా ఓకే అంటాడు. అసలు కథే అక్కరలేదంటేనే వస్తుంది చిక్కు.
కథ లేకపోయినా టెక్నాలజీ విషయంలో హాలీవుడ్‌తో పోటీ పడి తీశారు కాబట్టి చూసి తీరాలి అనే వాదన నాకు రుచించదు. అసలు పోలిక లెందుకు? మన సత్తా, మార్కెట్ మనవి. వాళ్ల సత్తా, మార్కెట్ వాళ్లవి. ''రోబో'' సినిమా చూసి ''టెర్మినేటర్''లో యింతకంటె బాగుంది అనే వ్యాఖ్యలు వింటే ఒళ్లు మండుతుంది. పక్కింటివాళ్ల పిల్లాడు అందంగా వున్నాడని మనం పిల్లల్ని తక్కువ చేస్తామా? ''రోబో'' మన ప్రోడక్ట్. కథ, ఎమోషన్స్ అవీ బాగా కుదిరాయి. బీ హ్యాపీ. హాలీవుడ్‌తో పోటీ పడడం అంటే నాకు నవ్వొచ్చేస్తుంది. బికె ఆదర్శ్ అనే ఓ దర్శకనిర్మాత, అతని భార్య జయమాల కలిసి ''హరిశ్చంద్ర తారామతి'' అని 1970లో ఓ సినిమా తీశారు. అంతా బి గ్రేడ్ వ్యవహారం. ఆ పై ఏడాది వాళ్లు ''మర్డర్ యిన్ సర్కస్'' అని జయమాలతోనే తీశారు. అయితే యీ సినిమాకు వాళ్లు యిచ్చిన యాడ్స్‌లో 'ఇండియాస్ ఆన్సర్ టు టెన్ కమాండ్‌మెంట్స్' అని యిచ్చారు. పడిపడి నవ్వుకునేవాళ్లం. కథ విషయంలో హరిశ్చంద్రుడి కథ, మోజెస్ కథతో సరితూగవచ్చు. కానీ సినిమా..? ఇలాటి కబుర్లు చూశాక యీ నాడు 'హాలీవుడ్‌తో తులతూగే..' అని ఎవరన్నా ఎందుకొచ్చిన రొష్టు అనిపిస్తుంది. అయినా ''గ్రేవిటీ'' సినిమా ఎంత ఖర్చు పెట్టినా తీసినా నాకు నచ్చలేదు. హాలీవుడ్డే మనకు కొలబద్ద కాదు. మన వాతావరణంలో మనకు తగిన సినిమా తీస్తే చాలు అనుకుంటే చాలు.
నా విమర్శను ఖండిస్తూ కొందరు కొన్ని అంశాలు లేవనెత్తారు. మొదటి భాగం చివర ఓపాటి ముగింపైనా అక్కరలేదని వాదిస్తూ ఒక కథకు రెండు క్లయిమాక్సులు వుంటాయా? అని ఒకాయన అడిగారు. మాయాబజారు సినిమాకు క్లయిమాక్సు వుందా లేదా? పాండవ వనవాసంకు వుందా లేదా? నర్తనశాలకు…? పాండవుల స్వర్గారోహణ క్లయిమాక్సు అనుకుంటే యివన్నీ ఉప క్లయిమాక్సులనుకోవచ్చు. రాజమౌళి మహాభారతం తీస్తారట. ఆయన మొదటి భాగాన్ని బాహుబలి స్టయిల్లో తీస్తే ఎక్కడ ఆపుతాడో వూహించండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. శిష్యులతో సహా భోజనానికి వస్తానని చెప్పి దుర్వాసుడు నదీస్నానానికి వెళ్లాడు. ఇంట్లో అన్నం ఏమీ లేదు. ద్రౌపది గిన్నెలు వెతుకుతోంది – ఎక్కడైనా అన్నం మెతుకు కనబడుతుందా అని. అంతలో 'ముగింపు వచ్చే ఏడాది' అని తెరపై కనబడుతుంది. రాజమౌళి కథ ముందుగా చెప్పేస్తారు అని ప్రతీతి. బాహుబలి, ద బిగినింగ్‌లో 'కథ లేదు టెక్నాలజీయే' అని ముందే చెప్పేస్తే ఆ మేరకు నా బోటివాళ్లం ప్రిపేరు అవుతాం కదా. ఇక అనూష్క వద్ద కట్టెలు ఎక్కణ్నుంచి వచ్చాయన్న దానికి సమాధానంగా ఒకాయన భల్లాల దేవుడి కొడుకు అనూష్కను పొడవడానికి తెచ్చుకుంటూంటాడు అని చెప్పాడు. అంటే అనూష్కను చూడాలి అనుకున్నప్పుడల్లా ఓ ఎండుకొమ్మ సంపాదించి బయలుదేరతాడా? ఊహించుకుంటేనే నవ్వొస్తోంది. ఎవడైనా యువరాజు పక్కనున్న భటుడి చేతిలోని బరిసె లాక్కుని పొడుస్తాడు తప్ప యింటి దగ్గర్నుంచి ఎండు కొమ్మలు చేతపట్టుకుని రాడు. ఇదివరకైతే సెట్టింగు వేసేవారు. సెట్ ప్రాపర్టీస్ చూసుకునేవారు. బ్లూ మాట్ టెక్నాలజీ కాబట్టి బాక్‌గ్రౌండ్‌లో చెట్టు పెడదాం అనుకుని షూట్ చేసేసి వుంటారని నా అనుమానం. తర్వాత చెట్టు మర్చిపోయారేమో! తెలియదు. ఇక హీరోయిన్ తన పని హీరోకి అప్పగించడాన్ని సమర్థిస్తూ కొండ ఎక్కి వచ్చాడు కాబట్టి శక్తిమంతుడని నమ్మింది అన్నారు ఒకాయన. శక్తి వుండగానే చాలదు, యుక్తి కూడా వుండాలి, ముఖ్యంగా మోటివేషన్ వుండాలి. భల్లాల దేవుడిపై కసి, దేవసేనపై జాలి వుండాలి. పరదేశికి అవన్నీ వుంటాయన్న నమ్మకం ఏమిటి? గూఢచారియేమో! పైగా అతను నీటికొండ ఎక్కి వచ్చాడన్న నమ్మకం ఏమిటి? సొరంగంలోంచి వచ్చి వుండవచ్చుగా. ఆ సొరంగం కింద నుంచి మూసి వుంది కానీ పై నుంచి తెరిచే వుందిగా. ఆ ప్రాంతపుదే కాబట్టి తెరిచివున్న సంగతి ఆమెకు తెలిసే వుంటుంది. కింద బండరాయి తీయించుకుని సొరంగంలోంచి వచ్చాడేమో అని సందేహించవచ్చు. సినిమాలో లాజిక్ గురించి పెద్దగా వర్రీ కానక్కరలేదు కానీ పాత్ర ఔచిత్యం దెబ్బ తినకూడదు.
విమర్శను ఎదుర్కోవడానికి దాదాపుగా అందరూ ఉపయోగించినది -తెలుగు సెంటిమెంటు. తెలుగువాళ్లు తీశారు కాబట్టి చూడాలిట. తమిళవాళ్లయితే అలా చూస్తారట. మనకు జాతి అభిమానం లేదట. ఇస్లాందేశాల్లో మతమౌఢ్యం వుంది కాబట్టి మనమూ మూఢంగా వుండాలని వాదించినట్లుగా వుంది – తమిళులకున్న షావనిజం మనకూ వుండాలని వాదించడం. కానీ నిజం చెప్పాలంటే తమిళులకు సినిమాల విషయంలో అలాటిది లేదు. తమిళవాళ్లు తీశారు కదాని కొచ్చాడియన్, ఐ, లింగ చూశారా? లేదే! వాళ్ల హిస్టరీ గురించి అయితే చూస్తారు అని కూడా అనుకోవద్దు. ''రాజరాజచోళన్'' అనుకున్నట్టుగా ఆడలేదు. ''కప్పలొట్టియ తమిళన్'' ఆడలేదు. ఎమ్జీయార్ ఆఖరి సినిమా అయిన ''మదురై మేట్టియ సుందరపాండ్యన్'' ఫ్లాపయింది. తెలుగువాళ్లమూ అంతే. కృష్ణదేవరాయలుపై ఎంతో అభిమానం వున్నా కన్నడ కృష్ణదేవరాయలును తెలుగులోకి డబ్ చేస్తే ఆడలేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచేటప్పుడు కూడా కొమురం భీమ్ ఆడలేదు. తెలుగువాళ్లు తీశారు కాబట్టి చూడాలి అనే సెంటిమెంటు యీ సినిమాతోనే ప్రారంభమైందా? తెలుగు పరిశ్రమలో తెలుగువాళ్లే సినిమాలు తీస్తున్నారు లేదా పంపిణీ చేస్తున్నారు. అయినా రిలీజైన సినిమాల్లో 90% సినిమాలను ఫ్లాప్ చేయిస్తున్నాం. టీవీల్లో తెలుగు సీరియల్స్‌ను పట్టించుకోకుండా తమిళ, హిందీ డబ్బింగు సీరియళ్లు చూస్తున్నాం. డబ్బింగులు చూడం, తెలుగులో తీస్తేనే చూస్తాం అని అనటం లేదేం? ఎక్కడికి పోయింది మన తెలుగు అభిమానం? ఈ సినిమాతో పుట్టి యీ సినిమాతోనే అంతమై పోతోందా?
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)