ఎమ్బీయస్‌ : హేతువాదులకు మూడుతోంది

ఫిబ్రవరి 16 న మహారాష్ట్రలో గోవింద్‌ పన్సారే హత్య జరిగిన పది రోజులకే బంగ్లాదేశ్‌లో మరొక హేతువాది చంపబడ్డాడు – ఇస్లామిక్‌ మతవాదుల చేతిలో! అతని పేరు అభిజిత్‌ రాయ్‌. వయసు 42. బంగ్లాదేశ్‌లో…

ఫిబ్రవరి 16 న మహారాష్ట్రలో గోవింద్‌ పన్సారే హత్య జరిగిన పది రోజులకే బంగ్లాదేశ్‌లో మరొక హేతువాది చంపబడ్డాడు – ఇస్లామిక్‌ మతవాదుల చేతిలో! అతని పేరు అభిజిత్‌ రాయ్‌. వయసు 42. బంగ్లాదేశ్‌లో ఢాకా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ కొడుకు. మెకానికల్‌ యింజనీరింగ్‌ పాసయి, లెక్చరర్‌గా పనిచేసి, సింగపూరు వెళ్లి బయోమెడికల్‌ యింజనీరింగులో డాక్టరేటు తీసుకున్నాడు. రెండు అమెరికన్‌ పేటెంట్స్‌ తీసుకున్నాడు. 2000 సం||రంలో అట్లాంటాకు తరలివెళ్లి అక్కడ యింజనీరుగా పని చేస్తున్నాడు. తన ప్రజల్లో మతమౌఢ్యాన్ని నివారించి ఆలోచనను, తర్కాన్ని, శాస్త్రీయ అవగాహనను పెంచాలనే ధ్యేయంతో 'ముక్త మన' (ఫ్రీ థింకింగ్‌) పేరుతో సంస్థ స్థాపించి, ఒక వెబ్‌సైట్‌ నడుపుతూ బెంగాలీలో 8 పుస్తకాలు రాశాడు. మతపరమైన రాజకీయాలను నిరసించాడు. అది బంగ్లాదేశ్‌లోని తీవ్రవాద ముస్లిం పార్టీయైన జమాతే ఇస్లామీ పార్టీకు కోపం తెప్పించింది. ఆ పార్టీ నాయకుడైన అబ్దుల్‌ ఖాదర్‌ మొల్లా బంగ్లాదేశ్‌ యుద్ధసమయంలో పాకిస్తాన్‌కు దోహదపడ్డాడు. అతనిపై విచారణ సమయంలో అతనికి ఉరిశిక్ష విధించాలని, అతని పార్టీని నిషేధించాలనీ షాబాగ్‌ అనే చోట 2013లో ప్రదర్శనలు జరిగాయి. వాటిని అభిజిత్‌, యితర బ్లాగర్లు సమర్థించారు. 

వారిలో అభిజిత్‌ తప్ప అందరూ ముస్లిములే. అభిజిత్‌ భార్య కూడా ముస్లిమే. ఈ సెక్యులరిస్టులందరూ నాస్తికులనీ, ఈ ఇస్లాం వ్యతిరేకులను ఉరితీయాలనీ జమాతే సమర్థకులు ప్రదర్శనలు నిర్వహించి, వారిపై దాడి చేసి చంపేశారు కూడా. చంపేముందు వాళ్లకు రాసిన బెదిరింపు వుత్తరాలను అభిజిత్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది. అది జమాతేకు మరింత కోపాన్ని తెప్పించింది. ప్రభుత్వం జమాతేను చల్లార్చడానికి వీళ్ల బ్లాగులను నిషేధించసాగింది.  కొందరు బ్లాగర్లను అరెస్టు చేసింది, మరి కొందరికి పోలీసు రక్షణ కల్పించింది. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు యీ అరెస్టులను, యీ నిషేధాలనూ విమర్శించాయి. అభిజిత్‌ 'బ్లాగర్లను  బంగ్లాదేశ్‌ మీడియా సంఘవ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తోంద'ని విమర్శించాడు. ఖైదు చేయబడిన బ్లాగర్ల విడుదల కోసం ఢాకా, న్యూయార్క్‌, వాషింగ్టన్‌, లండన్‌, అట్టావాలలో ప్రదర్శనలు నిర్వహించాడు. అంతర్జాతీయంగా అనేకమంది రచయితలు అతనికి అండగా నిలిచారు.

ఇదంతా జమాతేకు మరింత కోపం తెప్పించింది. దాని సానుభూతిపరులు అభిజిత్‌ ఢాకాలో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తూ ట్వీట్‌ చేయసాగారు. వారిలో ఒకడైన ఫరాబీ షఫీయుర్‌ రెహమాన్‌ను యిప్పుడు అరెస్టు చేశారు. ఇన్ని హెచ్చరికలు వినిపిస్తున్నా అభిజిత్‌ ధైర్యంగా ఢాకాలో జరుగుతున్న పుస్తకప్రదర్శనకు భార్యతో సహా వచ్చి తిరిగి వస్తూ రిక్షా ఎక్కాడు. రాత్రి 8.30 సమయంలో యిద్దరు అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచారు. అతని భార్య వేళ్లు కోసేశారు. అతను ఆ రోజే రెండు గంటల తర్వాత ఆసుపత్రిలో చనిపోయాడు. మార్చి 1 న అతని భౌతికకాయానికి వేలాది మంది నివాళి ఘటించారు. అతని హంతకులను పట్టుకోవడానికి అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్‌బిఐ సహాయం చేస్తానంది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సరేనంది.  

మార్చి 6 న నలుగురు సభ్యుల ఎఫ్‌బిఐ టీము వచ్చి హత్యాస్థలం వద్ద సాక్ష్యాలు సేకరిస్తోంది. అభిజిత్‌ తన ''విశ్వాసేర్‌ వైరస్‌'' (మత విశ్వాసాల వైరస్‌) అనే పుస్తకంలో రాశాడు – 'కొంతమందే వైరస్‌ చేత ప్రభావితులవుతారు. తక్కిన వారు కేవలం కారియర్స్‌ (వాహకులు)గా వుంటారు. వారికి గాఢమైన మతద్వేషాలు వుండవు. అయినా అసలైన సమయాల్లో అచేతనంగా వుంటారు. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లలో చాలామంది హిందువులు ముస్లిం ద్వేషమేమీ లేకపోయినా ఏమీ చేయకుండా స్తబ్దంగా వుండిపోయారు. బంగ్లాదేశ్‌లో హిందువులు యిళ్లపై దాడి జరుగుతూంటే చాలామంది శాంతికాముకులైన ముస్లిములు నిస్తేజంగా వుండిపోవడానికి కూడా కారణం యిదే..'' అని. ఫిబ్రవరి 26 రాత్రి 8.30కు అతన్ని, అతని భార్యను నడిరోడ్డులో రిక్షాలోంచి లాగి కత్తులతో పొడిచి చంపుతూ వుంటే రక్షణకు ఎవరూ రాకపోవడం యీ వైరస్‌ ప్రభావమే అనాలి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]