ఎమ్బీయస్‌ : హమ్‌ ‘ఆప్‌’ కే హై కౌన్‌?

యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ యిప్పుడు ఆ ప్రశ్న అడుగుతున్నారు. మార్చి 4 నాటి సమావేశంలో వారిద్దరినీ పిఎసి (పొలిటికల్‌ ఎఫయిర్స్‌ కమిటీ) నుంచి తీసేశారు. కానీ పార్టీలోనే వుంచారు. యోగేంద్ర-ప్రశాంత్‌ ద్వయం యిది…

యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ యిప్పుడు ఆ ప్రశ్న అడుగుతున్నారు. మార్చి 4 నాటి సమావేశంలో వారిద్దరినీ పిఎసి (పొలిటికల్‌ ఎఫయిర్స్‌ కమిటీ) నుంచి తీసేశారు. కానీ పార్టీలోనే వుంచారు. యోగేంద్ర-ప్రశాంత్‌ ద్వయం యిది వూహించలేదు. కొత్త పిఎసి నియమించండి, మేం పోటీ చేయం అనే ఒక ప్రతిపాదన, పాత కమిటీనే కొనసాగించండి, మేం సమావేశాలకు దూరంగా వుంటాం అనే మరో ప్రతిపాదన చేశారు. రెండూ ఒప్పుకోం, మీరు బయటకు నడవాల్సిందే అంటూ మనీశ్‌ శిశోదియా తీర్మానం ప్రవేశపెట్టాడు. 11 మంది సరేనన్నారు, 8 మంది వద్దన్నారు. మెజారిటీ మాట నెగ్గింది. 'మేం యిప్పుడు వాలంటీర్లమే' అన్నాడు యోగేంద్ర. తటస్థంగా వుండి ఎటూ ఓటేయని మాయాంక్‌ గాంధీ యివన్నీ బయటపెట్టారు.

అన్ని ప్రాంతీయపార్టీల్లాగానే ఆప్‌లో కూడా ఏకవ్యక్తి పాలన సాగుతున్నట్లు యీ చర్యల వలన అర్థమవుతోంది. మంచికో, చెడుకో ఆప్‌ అనగానే అరవిందే అందరికీ గుర్తుకు వస్తున్నాడు. తాము పార్టీ స్థాపించినది అందుకు కాదని, అంతర్గత ప్రజాస్వామ్యం వుండి తీరాలని యోగేంద్ర, ప్రశాంతి భూషణ్‌ వంటి నాయకులు వాదిస్తున్నారు. దాని గురించి పట్టుబట్టినందుకే తమను వేధిస్తున్నారని వారి వాదన. ఎవరి ప్రణాళికలు వాళ్ల కున్నాయి. అరవింద్‌కు ఢిల్లీయే ముఖ్యం – తనకు అక్కడ పట్టు వుంది కాబట్టి. మరి హరియాణాలో బేస్‌ నిర్మించుకున్నాడు కాబట్టి అక్కడ పార్టీ పోటీ చేయాలని, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు చేయాలనీ యోగేంద్రకు ఆశ. హరియాణా ఒక్కటీ అంటే బాగుండదు కనుక, దేశమంతా పోటీ చేయాలని ప్రతిపాదన చేశాడు. అది చీదేయడంతో అందరూ యోగేంద్రను తప్పుపట్టారు. 'అది నా ఒక్కడి నిర్ణయమే కాదు, అరవింద్‌ కూడా ఒప్పుకున్నాడు' అంటాడు యోగేంద్ర యిప్పుడు. పార్లమెంటు ఎన్నికలలో ఆప్‌ ఘోరంగా ఓడిపోగానే శాంతి భూషణ్‌ 'అరవింద్‌ ప్రచారానికి పనికి వస్తాడు కానీ ఆర్గనైజేషన్‌ వ్యవహారాల్లో వీక్‌. పార్టీని దేశమంతా విస్తరింపచేయగల శక్తియుక్తులు అతనికి లేవు. ఆప్‌ కన్వీనర్‌గా యోగేంద్ర వుండాలి' అని బహిరంగంగా వ్యాఖ్యానించాడు. ఆప్‌లో అంతర్గత చర్చలు జరగటం లేదని కూడా ప్రకటించాడు. 'ఇది బహిరంగంగా చెప్పవలసిన అవసరం ఏముంది?' అని ఆప్‌ కార్యకర్తలు, అరవింద్‌ సన్నిహితులు మండిపడ్డారు. శాంతి భూషణ్‌ కుమారుడు, మరో ఆప్‌ లీడరు అయిన ప్రశాంత్‌ వాటిని ఖండించలేదు. 

పెద్దా, చిన్నా భూషణ్‌లు, యోగేంద్ర కలిసి అరవింద్‌ స్థానంలో యోగేంద్రను తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని అందరికీ అనుమానాలు వచ్చాయి. పార్టీ సమావేశం ఏదైనా పెడితే వీళ్లు తన వైఫల్యాలపై నిలదీస్తారన్న భయంతో అరవింద్‌ కూడా మూణ్నెళ్లకోసారి జరపవలసిన సమావేశాలు జరపడం మానేశాడు. 2014 జులై తర్వాత మళ్లీ 2015 ఫిబ్రవరిలోనే, అంటే ఎన్నికలలో గెలిచాకనే మీటింగు పెట్టాడు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేద్దామని యోగేంద్ర చేసిన సూచనను కూడా పెడచెవిన పెట్టాడు. ఆప్‌ ఢిల్లీలో ఓడి, హరియాణాలో నెగ్గితే ఆ ఘనతంతా యోగేంద్రకే పోయి, తన సారథ్యానికి ఎసరు వస్తుందన్నే భీతితో అరవింద్‌ ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించేవరకూ యింకెక్కడా ప్రయత్నం సైతం చేయకూడదనుకున్నాడు. ఢిల్లీ ఎన్నికలలో అరవింద్‌కు విజయం సిద్ధించకుండా భూషణ్‌లిద్దరూ ప్రయత్నించారు. పెద్దాయన శాంతి భూషణ్‌ అరవింద్‌ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించాడు. ఆప్‌ నాయకబృందం వెళ్లి బతిమాలినా వినలేదు. ఆయన ధోరణి చూశాక, చిన్నాయన ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర టిక్కెట్ల పంపిణీకి అడ్డు తగులుతారని వీళ్లకు అనుమానం వచ్చింది. అందుకని వాళ్లు సభ్యులుగా వున్న పిఎసిని తప్పించి ఢిల్లీ యూనిట్‌ ఏర్పరచి దాని ద్వారా టిక్కెట్ల పంపిణీ చేపట్టారు. అప్పుడు ప్రశాంత్‌ 19 మంది అభ్యర్థుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. 

ఆప్‌ ఆంబుడ్స్‌మన్‌ దీనిపై విచారించి 12 మందిని ఓకే చేశాడు. ప్రచారం జరుగుతూండగా శాంతి భూషణ్‌ బిజెపి అభ్యర్థి కిరణ్‌ బేదీని ఆకాశానికి ఎత్తేశాడు. ప్రశాంత్‌ ప్రచారంలో పాల్గొనన్నాడు. యోగేంద్ర ప్రచారం చేశాడు కానీ అరవింద్‌తో కలిసి చేయలేదు. ఇద్దరూ మాట్లాడుకుని నాలుగు నెలలయిందట. ఢిల్లీ అభ్యర్థుల సెలక్షన్‌ గురించి ఫిర్యాదు చేయడానికి మాత్రమే యోగేంద్ర అరవింద్‌ యింటికి వెళ్లాడు. ఎన్నికల ప్రచార సమయంలో 'ఆప్‌'లో వింగ్‌ అంటూ 'అవామ్‌' ఒకటి బయలుదేరి ఆప్‌ తీసుకున్న విరాళాల గురించి వివాదం రేపింది. అదంతా యోగేంద్ర తెలివితేటలే అని అరవింద్‌ అనుయాయుల నమ్మకం. ఢిల్లీ ఎన్నికలలో నెగ్గకపోతే అరవింద్‌ రాజకీయజీవితం సమాప్తం అని అందరూ అనుకున్నారు కాబట్టి అతని అనుచరులు అంతర్గతంగా సర్వే చేయించారు. ఆప్‌కు కొద్దిపాటి మెజారిటీ వస్తుందని తేలింది. వీళ్లిలా బిక్కుబిక్కుమంటూ వుండగానే ముంబయి నుంచి మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌ ఒకాయన వచ్చి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని చెప్పాడు. యోగేంద్ర వంటి సెఫాలజిస్టు తమ పార్టీలో వుండి కూడా ఆప్‌ యిలా గందరగోళ పడిందంటే కారణం – అతనిపై అపనమ్మకమే.

ఢిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత అరవింద్‌కు ఆత్మవిశ్వాసం పెరిగింది. యోగేంద్ర, ప్రశాంత్‌ పిఏసి సభ్యులుగా వుంటే తను పార్టీ కన్వీనరుగా వుండనని సన్నిహితులతో చెప్పి, మార్చి 4న ఒక సమావేశం ఏర్పరచి, తను గైరుహాజరయ్యాడు. మర్నాడే 10 రోజుల ప్రకృతి చికిత్సకై బెంగుళూరు వెళ్లాడు.  ప్రశాంత్‌ తనకు పంపిన రెండు ఎస్సెమ్మెస్‌లకు జవాబివ్వలేదు. తను లేకుండానే తన అనుచరులు వీళ్ల భరతం పట్టాలని, తనకు చెడ్డపేరు రాకూడదని అతని ఉద్దేశం. ఆ సమావేశం కన్వీనరు పదవికి అరవింద్‌ చేసిన రాజీనామా తిరస్కరించి, యోగేంద్ర, ప్రశాంత్‌లను పిఎసి పదవుల నుంచి తప్పించివేసింది. అయితే అప్పుడు పడిన ఓట్లు చూస్తే అరవింద్‌ గ్రూపుకి 11 ఓట్లు వస్తే యోగేంద్ర గ్రూపుకు 8 వచ్చాయి. మెజారిటీ స్వల్పంగానే వుంది. ఈ పరిస్థితుల్లో యోగేంద్ర, ప్రశాంత్‌ తిరగబడ్డారు. 

వారికి సన్నిహితంగా వుండే ముంబయికి చెందిన అంజలి దమానియా గతంలో అరవింద్‌ ప్రభుత్వం ఏర్పరచినప్పుడు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించాడని, బేరసారాలు ఆడాడని ఆరోపిస్తూ పార్టీలోంచి తప్పుకుంది. ''ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీని చీల్చి విడిగా పార్టీ ఏర్పరచుకుని మన ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకు సహకరించేట్లా చేయండి.'' అని అరవింద్‌ తనతో టెలిఫోన్‌లో మాట్లాడాడంటూ రాజేశ్‌ గర్గ్‌ ఆరోపించి ఆ సంభాషణను ఒక టీవీ ఛానెల్‌ ద్వారా విడుదల చేశాడు. దానికి అనుబంధంగా యోగేంద్ర, ప్రశాంత్‌ తాము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డామన్న ఆరోపణలు ఖండించారు.  పార్లమెంటు ఎన్నికల తర్వాత అరవింద్‌ కాంగ్రెసు మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నాడని, తాము ప్రతిఘటించామని, అప్పణ్నుంచే తమ మధ్య విభేదాలు వచ్చాయని చెప్పారు. వీరిద్దరితో బాటు శాంతి భూషణ్‌ను కూడా పార్టీలోంచి తీసేయాలని కపిల్‌ మిశ్రా అనే ఎమ్మెల్యే సంతకాల సేకరణ మొదలుపెట్టాడు. త్వరలో జరగబోయే పార్టీ జాతీయ మండలిలో వారిపై వేటు పడవచ్చని అనుకుంటున్నారు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]