గెలిచిన ఇంగ్లాండ్‌.. దిగాలుగా ఇంటికి.!

2015 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. ఇంగ్లాండ్‌ ఇంటికెళ్ళడం ఆల్రెడీ ఫిక్సయిపోయినా, ఆఖరి మ్యాచ్‌ని ఈ రోజు ఆడేసిన ఇంగ్లాండ్‌, చివరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి.. ఇంటిదారి పట్టింది. సిడ్నీలో జరిగిన…

2015 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఇంగ్లాండ్‌ కథ ముగిసింది. ఇంగ్లాండ్‌ ఇంటికెళ్ళడం ఆల్రెడీ ఫిక్సయిపోయినా, ఆఖరి మ్యాచ్‌ని ఈ రోజు ఆడేసిన ఇంగ్లాండ్‌, చివరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి.. ఇంటిదారి పట్టింది. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ గెలిచింది. మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించడంతో 25 ఓవర్లకు ఇంగ్లాండ్‌ లక్ష్యాన్ని 101 పరుగులగా నిర్దేశించారు. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లాండ్‌. 

తొలుత వెస్టిండీస్‌పై భారీ విజయంతో వార్మప్‌ మ్యాచ్‌లో హల్‌చల్‌ చేసిన ఇంగ్లాండ్‌, టోర్నీ తొలి మ్యాచ్‌ని ఆస్ట్రేలియాకి సమర్పించేసుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ చేతిలోనూ ఇంగ్లాండ్‌కి పరాజయమే ఎదురయ్యింది. స్కాట్‌లాండ్‌పై మాత్రం ఇంగ్లాండ్‌ ఘనవిజయం సాధించగలిగింది. మళ్ళీ శ్రీలంక చేతిలో పరాజయం పాలయ్యింది ఇంగ్లాండ్‌. 

ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌కి అతి పెద్ద షాక్‌ ఇచ్చింది మాత్రం బంగ్లాదేశ్‌. పసికూన అని ఇంగ్లాండ్‌ లైట్‌ తీసుకోవడమే పెద్ద తప్పిదం. అదే పసికూన, ఇంగ్లాండ్‌ని బోల్తా కొట్టించింది. ఇంగ్లాండ్‌పై గెలుపుతో బంగ్లాదేశ్‌ క్వార్టర్స్‌లోకి అడుగు పెడితే, బంగ్లా చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. టైటిల్‌ ఫేవరెట్‌ అని అనలేంగానీ, కాస్త అంచనాలున్న జట్టుగానే ఇంగ్లాండ్‌ ఈసారి వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల బరిలోకి దిగింది. అయితే సమిష్టిగా రాణించడంలో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ళు విఫలమయ్యారు. 

క్రికెట్‌ పుట్టిందే ఇంగ్లాండ్‌లో అని అంటుంటాం. కానీ దురదృష్టవశాత్తూ వరల్డ్‌ కప్‌ పోరులో ప్రతిసారీ ఇంగ్లాండ్‌కి నిరాశే ఎదురవుతోంది.