బంగ్లాపై కివీస్‌ బంపర్‌ విక్టరీ

వరల్డ్‌కప్‌లో భాగంగా లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌నూ న్యూజిలాండ్‌ విజయంతోనే ముగించింది. పసికూన బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌కి షాకిచ్చేలా కన్పించినా, న్యూజిలాండ్‌ ఆటగాళ్ళు జట్టును విజయపథాన నడిపించారు. తొలుత బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత…

వరల్డ్‌కప్‌లో భాగంగా లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌నూ న్యూజిలాండ్‌ విజయంతోనే ముగించింది. పసికూన బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌కి షాకిచ్చేలా కన్పించినా, న్యూజిలాండ్‌ ఆటగాళ్ళు జట్టును విజయపథాన నడిపించారు. తొలుత బ్యాటింగ్‌కి దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా సెంచరీతో బంగ్లాదేశ్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. 

ఇక, 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆరంభంలో తడబడ్డారు. 33 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయినా, ఆ తర్వాత కివీస్‌ ఇన్నింగ్స్‌ గాడిన పడింది. ఓపెనర్‌ గుప్టిల్‌ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. బంగ్లా ఆటగాళ్ళలో ఆశలు చిగురించాయి. అయితే అండర్సన్‌ స్కోర్‌ బోర్డ్‌ని పరుగులు పెట్టించాడు. లక్ష్యానికి జట్టుని దగ్గరగా నడిపించాడు. వెట్టోరీ, సౌథీ జట్టు విజయానికి కావాల్సిన చివరి పరుగుల్ని సాధించిపెట్టారు. 

తన ఇన్నింగ్స్‌లో బంగ్లా 7 వికెట్లు కోల్పోతే, న్యూజిలాండ్‌ కూడా ఏడే వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ విజయంతో కివీస్‌ వరల్డ్‌ కప్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌ పూర్తి చేసింది. మొత్తం ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్‌ విజయాలు నమోదు చేయడం విశేషమే మరి.!