వచ్చిపోతుందిలే.. ఇంకా అదే నిర్లక్ష్యం.!

స్వైన్‌ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది ఇప్పటి మాట కాదు. గత డిసెంబర్‌లోనే స్వైన్‌ఫ్లూ విజృంభణ ప్రారంభమయ్యింది. నాలుగైదేళ్ళ క్రితం ప్రపంచాన్ని వణికించిన స్వైన్‌ఫ్లూ.. ఇప్పుడా తాజాగా మరోమారు భారతదేశంపై పంజా విప్పుతోంది. తొలుత…

స్వైన్‌ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది ఇప్పటి మాట కాదు. గత డిసెంబర్‌లోనే స్వైన్‌ఫ్లూ విజృంభణ ప్రారంభమయ్యింది. నాలుగైదేళ్ళ క్రితం ప్రపంచాన్ని వణికించిన స్వైన్‌ఫ్లూ.. ఇప్పుడా తాజాగా మరోమారు భారతదేశంపై పంజా విప్పుతోంది. తొలుత తెలంగాణలోనే ఎక్కువగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

'వచ్చిపోతుందిలే.. అనుకున్నాం..' అని ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, స్వైన్‌ఫ్లూపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు చెప్పిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు.. స్వైన్‌ఫ్లూ పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అప్పటికప్పుడు ఏదో హడావిడి చేసి, ఆ తర్వాత అంతా లైట్‌ తీసుకున్నారు. కేంద్రం తగు రీతిలో స్వైన్‌ఫ్లూ విషయమై స్పందించడంలేదన్నది ఇటీవలి కాలంలో పెరిగిన స్వైన్‌ఫ్లూ కేసుల తీవ్రతను బట్టి అర్థమవుతోంది. 

స్వైన్‌ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ రూపాంతరం చెందుతోందని అమెరికా తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పులు భారత్‌లోనే కన్పిస్తున్నాయన్నది వారి వాదన. అయితే భారత ప్రభుత్వం మాత్రం దీన్ని కొట్టి పారేస్తుంది. తాము ఎప్పటికప్పుడు హెచ్‌1ఎన్‌1 వైరస్‌ విషయంలో అప్రమత్తంగా వున్నామని కేంద్రం తేల్చి చెబుతోంది. కానీ, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య తగ్గడంలేదు సరికదా, రోజురోజుకీ పెరుగుతూనే వున్నాయి. 

స్వైన్‌ఫ్లూ కేసులతోపాటే వ్యాక్సిన్ల అమ్మకాలూ జోరందుకున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్నా స్వైన్‌ఫ్లూని పూర్తిగా నియంత్రించలేం.. అని డాక్టర్లు చెబుతున్నారు. మరోపక్క స్వైన్‌ఫ్లూ పట్ల అవగాహన పెరిగినా, దాని తీవ్రత తగ్గకపోవడం పట్ల సాధారణ ప్రజానీకంలో తీవ్ర భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో పూర్తిగా కలిసిపోయిన స్వైన్‌ఫ్లూ రూపాంతరం చెందితే, తీవ్రత మరింతగా పెంచుకుంటే, దాన్ని నియంత్రించడం అంత తేలికైన విషయం కాదు. 

అమెరికా తదితర దేశాల హెచ్చరికలతో అసలు మన దేశంలో వున్నది హెచ్‌1ఎన్‌1 వైరస్సేనా? లేదంటే ఆ వైరస్సే కొత్తగా రూపాంతరం చెందిందా.? అన్నదానిపై పరిశోధనలు విస్తృతంగా జరగాల్సి వుంది. లేదంటే, భారత్‌ లాంటి దేశాల్లో ఈ తరహా వైరస్‌లు మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశాల్లేకపోలేదు.