మన జీవితాలను రాజకీయనాయకులు శాసిస్తే, వారిని శాసించేవారే జ్యోతిష్కులు. నిజంగా జరిగిన సంఘటనలతో ఎన్.ఆర్. కృష్ణన్ అనే ఒక ఐయేయస్ అధికారి యిటీవల ఒక వ్యాసం రాశారు. 1985 ప్రాంతంలో ఒకానొక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మళ్లీ ఎన్నికయ్యారు. ఆయన పార్టీ అఖండ విజయం సాధించింది. జ్యోతిష్కులను సంప్రదించి రాజ్‌భవన్ లాన్స్‌లో ప్రమాణస్వీకారానికి ఉదయం 10 గంటల ముహూర్తం నిర్ణయించాడు. సరిగ్గా ముందురోజున జ్యోతిష్కుడు వచ్చి ''మీరు 10 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తే మీ ప్రభుత్వం ఎక్కువకాలం వుండదు. ఒక్క రెండు నిమిషాలు ఆలస్యంగా చేయాలి.'' అని చెప్పాడు. ముఖ్యమంత్రి తన సెక్రటరీకి యీ విషయం చెప్పి ఎలాగోలా గవర్నరుగారు కాస్త ఆలస్యంగా వచ్చేట్టు చేయమన్నాడు. కానీ ఆయనతో అలా చెపితే ఏం బాగుంటుంది? ఆయన వచ్చాక ఆగమనడం కూడా మర్యాద కాదు. సెక్రటరీ రాత్రంతా ఆలోచించి ఒక ప్లాను వేశాడు.
దాని ప్రకారం పొద్దున్నే గవర్నరు ఆఫీసుకి ఫోన్ చేసి ''కొందరు సీనియర్ సిటిజన్లు గవర్నరుగారిని కలవాలనుకుంటున్నారు. ఆయన తన బంగళానుండి లాన్స్‌లో ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు వచ్చేలోపున వాళ్లు నమస్కరించి వెళ్లిపోతారు.'' అన్నాడు. గవర్నరు సిబ్బంది సరే అన్నారు. సెక్రటరీ 70 ఏళ్లు పైబడిన వారిని కొందరు పోగేసి గవర్నరు గుమ్మం దగ్గర నిలబెట్టాడు. సరిగ్గా 9.55కి గవర్నరు తన బంగళానుండి బయటకు రాగానే వీళ్లంతా నమస్కారాలు పెట్టారు. అంత వయోవృద్ధులు తనను చూడడానికి వచ్చినపుడు గవర్నరు విదిలించుకుని వెళ్లిపోలేడు కదా. దగ్గరకు వచ్చి పలకరించారు. వాళ్లు ఒకరి తర్వాత వంగి వంగి దణ్ణాలు పెట్టి అవసరమైనంత ఆలస్యం చేశారు.
ఎట్టకేలకు జ్యోతిష్కుడు చెప్పిన 10.02 కే ప్రమాణస్వీకారం జరిగింది. ముఖ్యమంత్రి సెక్రటరీని అభినందించి, వెంటనే ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కాడు – మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలో అధిష్టానాన్ని సంప్రదించడానికి! మర్నాడు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుండి సెక్రటరీకి టెలిప్రింటరులో మెసేజ్ వచ్చింది. 24 గంటలు గడవకుండానే ముఖ్యమంత్రి పదవి వూడిందని. రాష్ట్రవిభజనోద్యమం కారణంగా శాంతిభద్రతలు కరువైన ఒక రాష్ట్రానికి ఆయనను గవర్నరుగా వేశారు.
-ఎమ్బీయస్ ప్రసాద్