మొన్న వారం జగన్ ఎక్కడున్నారు..కిందటి వారం.. ఈ వారం..కోస్తాంధ్రలోనే అన్నది సమాధానం.
అవును. ఇప్పుడు జగన్ దృష్టి అంతా కోస్తా అందునా ఉత్తర కోస్తాపైనే వుంది. ఆయన గడచిన వారం పది రోజులుగా ఈ ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వున్నారు.
నిజానికి జగన్ రోడ్డ కొట్టుడు మాదిరిగా తీరు తెన్ను లేకుండా ప్రచారం చేసుకుంటూ పోతున్నారని అనుకునే వారున్నారు. కానీ దాని వెనుక లాజిక్కులు, అవసరాలు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు వున్నాయనే అర్థమవుతోంది.
జగన్ పార్టీ పెట్టిన తరువాత బలమైన దన్నుగా నిలబడిన జిల్లాల్లో ఉభయగోదావరి రెండు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు. అందుకే ఆయన ఊ ..అంటే చాలు పర్యటన ఏదైనా తూర్పు గోదావరిలో చటుక్కున తేలేవారు. విశాఖ, విజయనగరం, జిల్లాల్లోని పలువురు కాంగ్రెస్ వాదులు జగన్ వెంట నిలిచారు. వీరిలో క్షత్రియులు, వెలమలు ఎక్కువగా వున్నారు.
దీంతో ఒక్కసారి చంద్రబాబు వ్యూహం మార్చారు. గడచిన ఇరవై ఏళ్లుగా తాను వెంట వుంచుకున్న వెలమలను కాస్సేపు పక్కన పెట్టి, కాపులను గాలించి, గాలించి, పట్టుకుని పార్టీలోకి లాగడం ప్రారంభించారు. గంటా నుంచి తోట వరకు ఇలా చేరిన వారు చాలా మందే వున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడి లాంటి వెలమలు అలగడం అన్నది వేరే సంగతి.
మొత్తానికి బాబు వ్యూహం ఫలించి, తెలుగుదేశానికి కాస్త కొత్తు ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు దాంతో జగన్ తన ప్రచార వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది. షర్మిల, విజయమ్మలకు మిగిలిన ఏరియాల బాధ్యతలు అప్పగించి, జగన్ తన దృష్టి అంతా కోస్తాపై కేంద్రీకరించారు. అంతే కాదు, ఆయన స్వయంగా గోదావరి జిల్లా నుంచి కూడా పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. బహుశా అందుకోసం అనపర్తి నియోజకవర్గం వేదిక అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. మరోపక్క షర్మిలను విశాఖ నుంచి పోటీకి దింపుతున్నారు. అంటే, కోస్తా వైకాపాకు ఎంత ఊపు కోసం ప్రయత్నిస్తున్నారన్నది స్పష్టమవుతుంది,.
జగన్, ఆయన సోదరి ఇక్కడ నుంచి పోటీ చేయడం అంటూ జరిగితే వైకాపా పరిస్థితి మళ్లీ మెరుగుపడే అవకాశం వుంది. జగన్ రోడ్ షొలు ప్రస్తుతం ఉత్తరాంధ్ర చివరకు చేరుకున్నాయి. శ్రీకాకుళం లోక్ సభ స్థానానికి అభ్యర్థిని (శాంతి)ని కూడా ఆయన జనం మద్యనే ప్రకటించేసారు. టెక్కలికి ప్రకటించిన దువ్వాడ శ్రీను కు అక్కడి జనంలో పాజిటివ్ ఓటు వుంది. అతను గెలుపు గుర్రమని ప్రచారం వుంది. ఇప్పుడు జగన్ స్వయంగా అతగాడనే ఎంపిక చేసారు. విశాఖ షర్మిల అయితే, అనకాపల్లి మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు తనయుడు అమర్ నాథ్ కావచ్చు. అతగాడు కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన తోట విజయలక్ష్మిని రంగంలోకి దింపుతోంది. గడచిన ఎన్నికల్లో ఒక కాపు, ఇద్దరు వెలమ ఇక్కడ పోటీ పడ్డారు. ఈసారి మరి తెలుగుదేశం నుంచి వెలమ అభ్యర్థి రంగంలోకి దిగుతారో, లేక గంటాను ఇక్కడకు పంపిస్తారో చూడాలి. అదే కనుక జరిగితే గట్టి పోటీ వుంటుంది. గెలుపు గుర్రం అనుకున్న గంటా కాస్త ఇబ్బందుల్లో పడతారు.
ఇలా కోస్తాపై కన్నేసి జగన్ ఓ పక్క ప్రచారం చక్కబెడుతూనే, స్థానిక పరిస్థితులను తానే బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఈ పనిని తన సన్నిహితులకు అప్పగించేవారు. కానీ ఈ విషయం లో జగన్ ను నమ్ముకున్న వారంతా కాస్త ఇబ్బందులకే గురిచేసారు. తమ తమ స్వలాభాల కోసం తమకు అవసరమైన పేర్లు సూచించడం వంటి తప్పుడు పనులు చేసారు. దీంతో జగన్ వారిని దూరం పెట్టారు. అలా పెడితే, జగన్ తో సరిపడలేదన్న నెగిటివ్ ప్రచారం తెచ్చారు. వాటి సంగతి ఎలా వున్నా ముందు, గెలుపు గుర్రాలను తానే ఎంపిక చేసుకోవాలన్న పనిని జగన్ స్వయంగా చేపట్టాల్సి వచ్చింది. మరోపక్క తెలుగుదేశం విశాఖ సీటు విషయం ఇంకా డిసైడ్ చేసుకోలేదు. తానే పోటీ చేస్తుందా లేక భాజపాకు వదిలేస్తుందో తేలాల్సివుంది. అదే విధంగా మూడు జిల్లాల్లో చాలా సీట్ల విషయమై తెలుగుదేశం ఇంకా స్పష్టమైన అవగాహనకు రాలేదు. కానీ ఈ లోగానే జగన్ అభ్యర్థులను ఎంపిక చేసి, జనం నడుప ప్రకటించే పనిలో పడ్డారు.
మొత్తం మీద జగన్ తన విజయానికి కీలకమైన ఉత్తర కోస్తాపై కన్నేసి, అవిశ్రాంతంగా ప్రచారం సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇది ఏ మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.