అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్ కందా
చోటు మారి చూసిన వైయస్సార్…
ఒక వూరికి నేను, మా ఆవిడ వెళ్లి గెస్ట్‌హౌస్‌లో బస చేసినప్పుడు పక్క గదిలో సినిమా, రంగస్థల నటుడు, 'రక్తకన్నీరు' నాగభూషణం గారు బస చేశారు. ఆయన నాకు అంతకుముందు నుండే తెలుసు, మంచి మిత్రుడు కూడా. పలకరింపులు అయ్యాక ''ఇవాళ సాయంత్రం ఫలానా గ్రౌండ్‌లో నా నాటకం ప్రదర్శన వుంది. మీరు సతీసమేతంగా తప్పకుండా రండి'' అని ఆహ్వానించారు.
'వీలు పడుతుందో లేదో' అని వూగిసలాడుతున్నవాణ్ని ఆయనలా పిలవడంతో సరేనని మా వాళ్లకు చెప్పాను – సాయంత్రం ఆ ఏర్పాట్లు చూడండని. వాళ్లు రివాజు ప్రకారం కాంప్లిమెంటరీ టిక్కెట్లు తెప్పించి ముందువరుస కుర్చీల్లో కూర్చోబెట్టారు.
'రక్తకన్నీరు' నాటకం జోరుగా సాగుతోంది. కథానాయకుడు కుష్టురోగి అయిపోయి, సంఘంలో రకరకాల మనుష్యుల్ని, పోకడలనూ దుమ్మెత్తి పోస్తున్నాడు. ''టిక్కెట్టు కొనకుండా దర్జాగా ముందు వరుసల్లో కూర్చుని బేవార్సుగా నాటకం చూసే ఆఫీసరు ననుకున్నావా..?'' అంటూ వ్యంగ్యబాణాలు విసురుతున్నాడు ఎదుటివాడిపై.
ప్రేక్షకులందరూ చప్పట్లు.
ఇది నాకు అవసరమా? ఆయన రమ్మనమని అడగనేల? నేను ఔనననేల? వచ్చి యీ మాటలు పడనేల?
సంగతేమిటంటే నాటకానికి వచ్చి ఆస్వాదించమని ఆహ్వానించిన స్నేహితుడు నాగభూషణం వేరు. గ్యాలరీ ప్రేక్షకుల వినోదం కోసం ఎవరినైనా ఆటపట్టించే నటుడు నాగభూషణం వేరు. వేదిక దిగగానే ఆయన మామూలు నాగభూషణం అయిపోవచ్చు. కానీ ఆ చోటు మహాత్మ్యం అలాటిది.
2004 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వానికి నేను చేసిన సిఫార్సు నచ్చని వైయస్ రాజశేఖరరెడ్డిగారు పత్రికాముఖంగా నన్ను విమర్శించారు. అప్పుడు నేను ఆయనకు చెప్పాల్సి వచ్చింది –
''మిమ్మల్ని నా స్థానంలో వూహించుకుని మాట్లాడండి కాస్త..'' అని.
xxxxxx
మనం సాధారణంగా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. అవి సరైనవనీ, అవే సరైనవనీ నమ్ముతాం. అంతటితో ఆగం. ఎదుటివాణ్నీ నమ్మమంటాం. నమ్మకపోతే వాదిస్తాం. అయితే ఆ అభిప్రాయం ఏర్పరచుకోవడానికి కారణం మనం వున్న స్థానం అని గుర్తెరగాలి. తామర నీటిలో వున్నంతసేపూ సూర్యుడు దానికి మిత్రుడు. సూర్యుణ్ని చూడగానే చక్కగా వికసిస్తుంది. కానీ తామరను ఎవరైనా నీటిలోంచి తీసి బయట గట్టున పడేశాడనుకోండి. అదే సూర్యుడు శత్రువై దాన్ని ఎండకు మాడ్చి వడిలిపోయేట్టు చేస్తాడు. అందుకే చోటు మారితే పరిస్థితీ, ఉద్దేశమూ మారుతుందని గ్రహించి మనం మసలుకోవాలి !
చిన్నపుడు ఓ కథ చెప్పారు మా మేస్టారు. ఇద్దరు నైట్స్ (బ్రిటిష్ యోధులు) గుఱ్ఱాల మీద వెళుతూ ఒకరికి ఒకరు ఎదురెదురు పడ్డారట. వాళ్ల మధ్య ఓ పతకం వేళ్లాడుతూ వుందట. ఆ ఎఱ్ఱపతకం బాగుంది కదా అన్నాడట ఒకడు. ఎఱుపేమిటి నీ మొహం, పచ్చది కదా అన్నాట్ట రెండోవాడు. మాటామాటా పెరిగి, పోట్లాట దాకా వచ్చింది. యోధులు కదా, యిద్దరూ కత్తులు దూశారు. చివరికి నీరసించి కింద పడ్డారు. అవతలి వైపుకు దొర్లినవాడు తలెత్తి చూస్తే పతకం పచ్చగా కనబడి ఆశ్చర్యపడ్డాడు. ఇవతలినుండి అవతలివైపుకు దొర్లినవాడికీ డిటో ఆశ్చర్యమే. ఎందుకంటే అవతలివైపు నుండి పతకం ఎఱ్ఱగా కనబడింది వాడికి. సంగతేమిటంటే ఆ పతకానికి ఒకవైపు ఎఱుపురంగు, మరోవైపు పచ్చరంగు పూశారు. అది తెలియక యిద్దరూ కొట్టుకుని చచ్చారు.
అందుకనే పెద్దలంటారు – ఏదైనా వాదించబోయే ముందు అవతలి వాడి చోటుకి మారి చూడు అని. ఇంగ్లీషువాడు 'స్టెప్పింగ్ యిన్ టూ ద అదర్స్ షూస్' అన్నాడు.
ముళ్లపూడి వెంకటరమణగారు రాసిన ''ఋణానందలహరి''లో పాములుండే పుట్టను ఓ రోజున చీమలు వచ్చి ఆక్రమించేస్తాయి. ''ఇదేమిటి? చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు..'' అని కదా పద్యం, మీరు మా పుట్టలు ఆక్రమించడమేమిటి?'' అని పాములు లాజిక్ లాగుతాయి.
''కాదు, మీ పుస్తకంలో అచ్చుతప్పు పడింది. పాములు పెట్టిన పుట్టలు చీమల కిరవైనయట్లు..'' అని చీమలు వాదిస్తాయి. దీనితో మీ ఋణానుబంధం తీరిపోయింది అంటూ అప్పులూ, జన్మలూ అంటూ రోజంతా కథ చెప్తాయి. పాములు ఆ వాదనలు కొట్టి పడేస్తూంటాయి.
అంతలో ఓ తమాషా జరుగుతుంది. ఆర్నెల్లు స్నేహం చేస్తే వారు వీరవుతారు అన్న సామెత నిజం చేస్తూ పాములు చీమలుగా, చీమలు పాములుగా మారిపోతాయి ! (చూడండి రమణగారి చమత్కారం) ఇక అప్పణ్నుంచి అప్పటిదాకా చీమలు వినిపించిన వాదనలే ప్రస్తుతం చీమలుగా మారిన పాములు వినిపించడం మొదలెడతాయి. 'పాములు పెట్టిన పుట్టలు చీమలకు..' అంటూ.
xxxxxx
వ్యవసాయశాఖా మంత్రిగా తిమ్మారెడ్డి గారు వుండే రోజుల్లో అబిద్ హుస్సేన్‌గారు వైజాగ్ జిల్లా కలక్టరుగా వున్నారు. సివిల్ సప్లయిస్ సరిగ్గా లేవని ఆయన ఫిర్యాదు. మంత్రిగారు డైరక్టరు ఆఫ్ సివిల్ సప్లయిస్‌గా వున్న గోపాలకృష్ణగార్ని పిలిపించారు. ఆయన తన వాదన వినిపించి, నా తప్పేముందన్నారు. దానికి అబిద్ హుస్సేన్‌గారు మరోటి చెప్పారు. ఎంతసేపు వాదించినా యిద్దరికీ ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఎవరి 'స్టాండ్' వారిదే. తీర్పు చెప్పలేక మధ్యలో మంత్రిగారు యిరకాటంలో పడ్డారు.
అప్పుడాయన ''మీ యిద్దరినీ యీ క్షణమే బదిలీ చేస్తున్నాననుకోండి. ఆయన పోస్టులో మీరూ, మీ పోస్టులో ఆయనా వున్నారనుకోండి. ఇప్పుడు చెప్పండి మీ వాదనలేమిటో..'' అన్నారు. ఇద్దరూ వెంటనే చెప్పారు – 'వాదనలూ అవేనండి. మనుష్యులే మారతాం. ఇప్పటిదాకా అవతలాయన చెప్పిన వాదనే నేనూ చెప్తాను' అని.
xxxxxx
2003లో అసెంబ్లీ రద్దు చేసి, వెంటనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ లింగ్డో గారిని కోరింది. కానీ ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తయే వరకూ ఎన్నికలు జరపనని ఆయన నిర్ణయించారు. అంటే సుమారు ఆరేడు నెలలు ముఖ్యమంత్రి ఎవరూ లేకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే వుంటారు. ఇలాటి ఆపద్ధర్మ ప్రభుత్వాలు నడిచినపుడు ప్రభుత్వ నిర్వహణాభారం మొత్తం ప్రభుత్వ యంత్రాంగంపై పడుతుంది. పాలన చేసే హక్కు ప్రజలనుండి పొందిన రాజకీయనాయకులు మంచో చెడో నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. కానీ ప్రభుత్వాధికారులకు అలాటి హక్కు, అధికారం వుండవు కాబట్టి, పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి తటపటాయిస్తారు. జాతీయస్థాయిలో చరణ్‌సింగ్‌గారు రాజీనామా చేశాక 1979లో కొన్ని నెలలపాటు ఆపద్ధర్మ ప్రభుత్వం నడిచి దేశంలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది.
2003లో ఆపద్ధర్మ ప్రభుత్వం నడిచినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తరఫున చీఫ్ సెక్రటరీగా నేను పదవిలో వున్నాను. భగవంతుడి దయవలన, నా సహచరుల సహకారం వలన ఆ ఏడెనిమిది నెలలు ప్రభుత్వ కార్యకలాపాలు ఏ మాత్రం కుంటుపడకుండా, ఏ అభివృద్ధి పథకమూ ఆగిపోకుండా, కేంద్రం నుండి ఏ విమర్శా రాకుండా అన్నీ సవ్యంగా జరిగిపోయాయి.
కానీ అన్నీ యింత సవ్యంగా జరుగుతాయని అప్పుడు తెలియదు కదా, అందుకే లింగ్డోతో నాకున్న స్నేహాన్ని పురస్కరించుకుని వ్యక్తిగతంగా రిక్వెస్టు చేశాను – ''అన్నాళ్లు యింత పెద్ద రాష్ట్రాన్ని నిర్వహించడం తలకు మించిన భారం అవుతుంది. కాస్త పెందరాళే ఎన్నికలు పెట్టేయండి.'' అని. పేకాట పేకాటే, బావగారు బావగారే అన్న తీరులో అతను ''వ్యక్తిగతంగా నీపై జాలి పడుతున్నాను కానీ ఆ సవరణలు అవీ అయ్యేదాకా ఎన్నికల మాట ఎత్తవద్దు'' అని చెప్పేశాడు.
చంద్రబాబుగారు యీ లోగా ప్రభుత్వం పని తీరు అంటూ రోజువారీ రిపోర్టులు టీవీల్లో యిస్తూండేవారు. ఆ ఖర్చు ప్రభుత్వం భరించేది కాబట్టి ప్రభుత్వ సొమ్ముతో బాబు తన యిమేజి పెంచుకొంటున్నారని కాంగ్రెస్ వారి అభ్యంతరం. దానికి చీఫ్ సెక్రటరీగా నేను దోహదపడుతున్నాననీ వాళ్లకు అనుమానం వుందో లేదో కానీ బహిరంగంగా ప్రకటనలు చేసి నన్ను విమర్శించారు. వారిలో మొదటివరుసలో వుండే నాయకుడు – ప్రతిపక్షంలో వున్న వైయస్ రాజశేఖర రెడ్డిగారు.
ఈ లోగా పులిమీద పుట్రలా పార్లమెంటు రద్దు ప్రకటన వచ్చింది. చంద్రబాబుగారికి వచ్చిన ఐడియానే అవతల వాజపేయి గారికీ వచ్చింది. గడువు కంటె ముందే పార్లమెంటు రద్దు చేసి, ఎన్నికలకు వెళదామనుకున్నారు. రాష్ట్ర కాబినెట్ సమావేశమై పార్లమెంటు ఎన్నికలతో బాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని తీర్మానించింది. కాబినెట్ తీర్మానం ఆధారంగా చీఫ్ సెక్రటరీ హోదాలో నేను వెంటనే కేంద్రానికి రాశాను – 'రెండూ ఎన్నికలు కలిపి నిర్వహించమని కోరుతున్నాం' అని.
ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఎంతో వ్యయంతో, శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఎంతోమంది ఉద్యోగులను పోలింగ్ బూత్‌ల నిర్వహణకు వుపయోగించాలి. పోలీసులు, మందీ మార్బలం, శాంతిభద్రతల సమస్యలు, ప్రచారం పరిమితుల్లో వుండేటట్లు చూడడాలు.. ఒకటా రెండా? ఇంతటి శ్రమ ఒకసారి పడడమే కష్టం అనుకుంటే రెండుసార్లు పడమంటే మాటలా? దానికి బదులు రెండూ కలిపి నిర్వహిస్తే…? బూత్‌లో ఓట్లేయడానికి ఒక పెట్టె బదులు రెండు పెట్టెలు పెడతాం అంతే!
ఆనాటి రాజకీయపరిస్థితుల వలన కాబోలు ఈ ఆలోచన ప్రతిపక్షం వారికి నచ్చలేదు. రెండు ఎన్నికలను కలిపి నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రికమెండ్ చేయడం చాలా తప్పని వైయస్ పత్రికా ప్రకటన యిచ్చారు. అది చూడగానే నేను ఆయనకు ఫోన్ చేశాను.
''అవునండీ, యివన్నీ రాజకీయ నిర్ణయాలు, మీకేం సంబంధం?'' అన్నారాయన గట్టిగా.
''ఇది కాబినెట్ నిర్ణయం. చీఫ్ సెక్రటరీగా నేను దానిని సమర్థించాను. ఎందుకు సమర్థించానంటారా, మీరు నా చోటులోకి వచ్చి చూడండి. రెండూ ఒకేసారి నిర్వహించడంలో వుండే సౌలభ్యాన్ని నేనెందుకు వదులుకోవాలి. దాన్ని అడ్డుకోవడానికి తగిన రాజకీయ కారణాలు మీకుండవచ్చు. నాకు సంబంధించినంత వరకు అనవసర వ్యయం, శ్రమ తగ్గించడం… మీరు చీఫ్ సెక్రటరీగా వున్నా యిదే నిర్ణయం తీసుకుంటారు.'' అన్నాను.
xxxxxx
ఎన్నికలు జరిగాయి. వైయస్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వం మారినప్పుడు చీఫ్ సెక్రటరీ మారడం యీ రోజుల్లో ఆమోదయోగ్యమైన రివాజుగా మారింది కాబట్టి ఆయనకు ఆ సౌలభ్యం కలిగించడం కోసం నేనే వెళ్లి ఆఫర్ చేశాను – ''నేను యీ పోస్టుకి కావాలనుకుని రాలేదు. రమ్మన్నారు. వచ్చాను. ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొనసాగడానికి అభ్యంతరం లేదు. వెళ్లిపోవడానికీ …లేదు. మీరేమనుకుంటున్నారో చెప్తే చాలు…'' అని.
''రెండు రోజుల్లో ఏ విషయం ఆలోచించుకుని చెప్తాను.'' అన్నారాయన.
రెండు రోజుల తర్వాత పిలిచి, ''ఐ హేవ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ'' (కొనసాగమని మిమ్మల్ని కోరడానికి నిశ్చయించుకున్నాను) అన్నారు.
సరేనన్నాను.
ఇంకో తమాషా ఏమిటంటే ''ఓటర్ల లిస్టు సవరణలు మీరు ఖచ్చితంగా చేయించారు కాబట్టే మేం ఎన్నికలలో గెలవగలిగాం'' అన్నారు కాంగ్రెస్‌వారు. నవ్వుకున్నాను. నేను నిమిత్తమాత్రుణ్ని. చిత్తశుద్ధితో చేయించడమే తప్ప ఫలితాలు ఎలా వుంటాయో వాటితో మాకు ప్రమేయం వుండదు.
కొసమెరుపు – వైయస్ అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రతిపాదనల ఎస్టిమేట్స్, ప్రొజక్షన్స్ చూసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే కమిటీ వేశారు. దాని నాయకత్వం చీఫ్ సెక్రటరీకి అప్పగించారు. నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకుంటుంది.
అప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన టిడిపి నాయకులు ఆ కమిటీ నిర్ణయాలలో చీఫ్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. ఆ నాయకులు వేరెవరో కాదు, కడియం శ్రీహరి, మైసూరా రెడ్డి వంటి నా స్నేహితులే!
రాజశేఖరరెడ్డి గారి వద్దకు వెళ్లి ''సీజర్స్ వైఫ్ షుడ్ బి ఎబవ్ సస్పిషన్ (రాజుగారి భార్య అనుమానాలకు అతీతంగా వుండాలి) నేను లీవ్‌లో వెళ్లిపోతా'' అని రాసి యిచ్చాను.
అది చదివి పక్కన పడేస్తూ ''మీకేం సంబంధం? నిర్ణయం నాదే కదాౖ! మీరు ఊరుకోండి'' అన్నారు వైయస్.
''మొన్నటిదాకా టిడిపికి పక్షపాతం చూపించానని కాంగ్రెస్‌వారు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు వలపక్షం చూపిస్తున్నానని టిడిపివారు నిందలేస్తున్నారు!'' అన్నాను కారణం వివరిస్తూ.
''మీరే చెప్పారుగా! చోటు మారి చూడమని..'' అని వైయస్ గట్టిగా నవ్వేశారు.
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version