మనీష్ బరాడియాకు 46 ఏళ్లు. రాజస్థాన్ వాడు. ఫైన్ ఆర్ట్‌స్ చదవడానికి 1990లో అహ్మదాబాద్‌కు వచ్చాడు. చదువు పూర్తయ్యాక యాడ్ ఏజన్సీలలో చేరి షార్ట్ ఫిల్మ్‌స్ తీద్దామని బొంబాయి వెళ్లాడు. ప్రోత్సాహం పెద్దగా లేదు. ఏడాది తర్వాత మళ్లీ అహ్మదాబాదుకి తిరిగి వచ్చేసి తన 23 వ యేట మూవింగ్ పిక్సెల్స్ కంపెనీ (ఎంపీసి) అనే కంపెనీని అద్దె గదిలో ప్రారంభించాడు. స్థానిక కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లకు చిన్న చిన్న యాడ్ ఫిలింస్ తీస్తూండేవాడు. ఏడాది తిరిగేసరికి ఐదుగుర్ని తన టీములో చేర్చుకున్నాడు. శైలభద్ర షా అనే అతన్ని భాగస్వామిగా చేర్చుకున్నాడు. కొన్నాళ్లు పని చేశాక ఇస్రో సంస్థ యితని ప్రతిభను గుర్తించింది. పిఎస్‌ఎల్‌వి లాంచ్ ప్రాజెక్టులో యానిమేషన్ పని అప్పగించారు. అప్పటినుండి మంచి గుర్తింపు వచ్చింది. అతని ఆఫీసు అహ్మదాబాద్‌లోని పాతబస్తీలో వుండేది. గోధ్రా అల్లర్ల తర్వాత వ్యాపారం మందగించింది. ఆ దశలో ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నుండి పిలుపు రావడంతో అతని దశ తిరిగింది.
2001లో వచ్చిన భూకంపం తర్వాత గుజరాత్ అతలాకుతలమైంది. ప్రభుత్వ అసమర్థతను అందరూ ఎత్తి చూపారు. మోదీ ముఖ్యమంత్రిగా వచ్చాక భూకంప బాధితులకై యిళ్లు కట్టించి పునరావాస చర్యలు బాగా పూర్తి చేశాడు. గోధ్రా అల్లర్ల లో పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలంటే భూకంప బాధితుల పునరావాసాన్ని హైలైట్ చేయాలని మోదీ నిశ్చయించుకున్నాడు. ఇతన్ని పిలిచి ''చునౌతీ'' (సవాలు) అనే 15 ని||ల సినిమా తీయమన్నాడు. రాత్రి 8 గంటలకు పిలిచి తనకేం కావాలో స్పష్టంగా చెప్పడానికి మూడున్నర గంటలు తీసుకున్నాడు. చుట్టూ ఎనిమిది మంది అధికారులున్నారు. మోదీకి ఏం కావాలో మనీష్‌కు పూర్తిగా అర్థమై పోయింది. ఇద్దరి మధ్య వేవ్‌లెంగ్త్ కుదిరింది. ఆ యాడ్ ఫిల్మ్ హిట్ కావడంతో యీ 13 ఏళ్లలో అతను మోదీకై 250 ఆడియో విజువల్స్, ప్రెజంటేషన్స్ చేశాడు. వైబ్రంట్ గుజరాత్, జ్యోతిగ్రామ్.. యిలా ఎన్నిటికో అతనే రూపకల్పన చేశాడు. 2007లో మోదీ మాస్క్ రూపకల్పన చేసినది 30 మంది సభ్యులున్న అతని టీమే. అది ఎంత హిట్టయిందో అందరికీ తెలుసు. ఇప్పుడతని ఆఫీసు అహ్మదాబాద్‌లోని ఖరీదైన ప్రాంతం వస్త్రపూర్‌లో వుంది.
మోదీ మనసు తెలుసుకోవడంలోనే కాదు, ఏదైనా అధ్యయనం చేయడంలో కూడా అతను దిట్ట. మోదీ ఏ దేశం వెళ్లినా ఒక 10 ని||ల షార్ట్ ఫిల్మ్ తయారుచేసి యిస్తాడు. గుజరాత్‌లో వున్న సౌకర్యాల గురించి చెప్పడంతో బాటు ఆ దేశానికి, గుజరాత్‌కు గల సామ్యం కూడా ఎత్తిచూపించడం జరుగుతుంది. 2007లో ఇజ్రాయేలుకి మోదీ వెళ్లినపుడు 'మీ దేశంలాగానే మా రాష్ట్రంలో కూడా నీటికి కరువుంది. ప్రతి చుక్కనూ రక్షించుకుంటాం.' అనే థీమ్‌తో ఫిల్మ్ చేసిపెట్టాడు. అలాగే జపాన్, చైనాలకు వెళ్లినపుడు కూడా కస్టమైజ్‌డ్‌గా తయారుచేసి యిచ్చాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 'గుజరాత్ పట్ల కేంద్రం వివక్షత' అనే థీమ్‌పై సినిమా చేయమని మోదీ ఆదేశించాడు. ఇతను 9 కాన్సెప్టులు చెపితే మోదీ తిరస్కరించాడు. చివరకు పదవది ఆమోదించాడు. దాని పేరు ''థప్పడ్'' (చెంపదెబ్బ) సీరీస్. ఒక్కోసారి ఒక్కో అంశంలో కేంద్రం గుజరాత్ పట్ల సవతితల్లి ప్రేమ కనబరించిందని ఎస్టాబ్లిష్ చేస్తారు. చివరి షాటులో ఒక గుజరాతీ వ్యక్తిని ఎవరో చెంపపై కొట్టినట్లు చూపిస్తారు. ''ఇది కేంద్రం గుజరాత్‌కు కొట్టిన చెంపదెబ్బ'' అని చివరిలో వ్యాఖ్య వస్తుంది. ఇదీ బాగా హిట్ అయింది.
ఈ సారి మోదీ ప్రచారానికి ఉపయోగించిన యాడ్ ఫిల్మ్‌స్ గురించి వేరే చెప్పనక్కరలేదు. అవన్నీ యితను, యితని టీము రూపొందించినవే. మోదీ యితన్ని ప్రోత్సహించడమే కాక, తనకు ఆత్మీయులైన కార్పోరేట్లకు పరిచయం చేశాడు. ఆ విధంగా యిప్పుడు అతని క్లయింట్లలో – రిలయన్సు (విమల్), అడానీ, రస్‌నా, టొరెంట్, రత్నమణి స్టీల్, ఇంటాస్ బయోటెక్నాలజీ, హిపోలిన్ వంటి పెద్ద సంస్థలతో బాటు అనేక రాష్ట్ర సంస్థలు కూడా వున్నాయి. బిజెపి అధికారంలో వున్నపుడు రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా పని చేశాడు. ఇప్పుడు కేంద్ర సంస్థలు కూడా బిజినెస్ యిస్తాయని సులభంగా వూహించవచ్చు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)