ఈ అనుభవం కొత్తగా వుంది – నాగార్జున

కౌన్ బనేగా కరోర్ పతి..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇమేజ్ తో షో..షో పాపులారిటీతో అమితాబ్ రేంజ్ రెండూ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఆ తరువాత దాన్ని షారూఖ్ చేసినా, అంత స్థాయి రాలేదనే…

కౌన్ బనేగా కరోర్ పతి..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇమేజ్ తో షో..షో పాపులారిటీతో అమితాబ్ రేంజ్ రెండూ ఎక్కడికో వెళ్లిపోయాయి. ఆ తరువాత దాన్ని షారూఖ్ చేసినా, అంత స్థాయి రాలేదనే చెప్పాలి. ఆపై ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయత్నించారు. పెద్దగా సంచలనాలు ఏవీ నమోదు కాలేదు. ఇప్పుడు తొలిసారి తెలుగులోకి వచ్చింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోకి చేరిపోయింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో  టాలీవుడ్ ప్రముఖ నటుడు ఓ షో ని హోస్ట్ చేయడం ఇదే తొలిసారి. నిజానికి ఈ షో తెలుగులో ప్రసారమవుతున్న మాటే కానీ, సెట్ ప్రాపర్టీ దగ్గర నుంచి అన్ని విషయాలను చాలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించడం విశేషం. కౌన్ బనేగా..కార్యక్రమాన్ని తయారుచేసిన సంస్థలు, వ్యక్తులు చాలా వరకు ఈ కోటీశ్వరుడు కార్యక్రమానికి పని చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు..హీరో నాగార్జున తొలిసారి టీవీ తెరపైకి వచ్చి, ఈ కార్యక్రమాన్ని అందించడం మరో ఎత్తు. 

నాగార్జున ఇన్నోవేటివ్ అయిడియాలకు ముందుంటారు. సినిమాల్లోనూ ప్రయోగాలే, వ్యాపార రంగంలోనూ ప్రయోగాలే. టీవీ మాధ్యమ భవితను గుర్తించి, ఆయన ముందుగా ఛానెల్ స్వంతదారుగా మారారు. ఛానెల్ కన్నా ముందే టీవీ ఎపిసోడ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఏకంగా బుల్లి తెరపైకి వచ్చిన తొలి పెద్దహీరోగా మారారు. కోటీశ్వరుడు షో ప్రారంభమై, ప్రేక్షకుల ఆదరణ, టీఆర్పీ రేటింగ్ లు అందుకున్న నేపథ్యంలో నాగార్జునతో 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వూ ఇది.

తొలిసారి బుల్లి తెరపై..అదీ ఓ పెద్ద షో తో..ఎలా వుందీ అనుభవం?.

ఇప్పుడిప్పుడే తెలుస్తోంది..అంతా కొత్తగా వుంది. అంటే షో చేయడం అని కాదు. టీవీ ప్రేక్షకులు వారి అభిమానం ఒక పక్క. ఈ షోకి వచ్చేవారు..వారి జీవితాలు..అనుభవాలు..అంతా..

అమితాబ్ లాంటి స్టాల్ వార్డ్ చేసిన షో..చేయాల్సి వచ్చినపుడు,,ఇప్పుడు చేస్తున్న తరువాత..మీ ఫీలింగ్స్?

చేయాలని అనుకున్నపుడు ఎలా అని ఆలోచించాను. చాలా సలహాలు వచ్చాయి. ఇలా చేయాలి..అలా చేయాలి అని..పేర్లు ఇలా మార్చాలి..అలా మార్చాలి అని. ఉదాహరణకు ఆయన కంప్యూటర్ జీ అన్నారు. జనానికి నచ్చింది అది. అందుకే ఎందుకు మార్చడం. కంప్యూటర్ గారూ అంటున్నాం. అలాగే చాలా పదాలు ఆ షో లో కాయిన్ చేసినవి బాగా పాపులర్ అయ్యాయి, వాటిని అలాగే వుంచేయాలనుకున్నాం.

ఇక షో ప్రారంభమయ్యాక ఫీడ్ బ్యాక్ రెగ్యులర్ గా తీసుకుంటున్నాం. మీరు గమనించే వుంటారు. తొలి ఎపిసోడ్ లో పరిచయాలు వున్నాయి. తరువాత తీసేసాం. జనానికి ఎలా వుంటే నచ్చుతుందన్నదే ఆలోచన

అవి సరే..మరి మీ సంగతి.?

షో చేయాలని అనుకున్నపుడే..నేను అనుకున్నాను. నేను నాలాగే వుండాలని. ఎందుకంటే అమితాబ్ లా ఎవరూ చేయలేరు. ఆయనను ముందు చూస్తేనే జనం మాట సగం ఆగిపోతుంది. నిలువెత్తు మనిషి ఆయన. అందువల్ల ముందుగానే షోకి ఓ సీరియస్ నెస్ అనుకోకుండానే వచ్చేస్తుంది. 

మీరు కూడా ఓ స్టార్..జనం మీ దగ్గరకు రావడానికి, ఫ్రీగా వుండడానికి కాస్త జంకుతారు..మీరు కూడా ఇన్నాళ్లు జనానికి కాస్త దూరంగానే వున్నారు. ఇప్పుడు వాళ్లను దగ్గరకు తీసుకోవడానికి కాస్త అలవాటు పడాలేమో?

నిజమే. అందుకేగా, ముందుగానే వాళ్లని ప్రిపేర్ చేస్తున్నా..ఫ్రీగా వుండండి..సరదాగా వుండండి అని. చాలా మంది షో అయిన తరవాత దగ్గరకు వచ్చి అంటున్నారు. ఇలా వుంటారనుకోలేదు. రిజర్వ్ గా వుంటారేమో? మాట్లాడరేమో అనుకున్నాం అని. 

ఇదే ఇప్పుడు మీ షోకి అట్రాక్షన్ గా మారుతున్నట్లుంది,.

అవును. ఈ షోకి ప్రత్యెకత ఇదే. నేను వాళ్లతో కలిసిపోవాలి. వాళ్లు నాతో సరదాగా మాట్లాడాలి.

కానీ దీనివల్ల క్విజ్ సీరియస్ నెస్ సంగతి?

కాస్త వుంటుంది. మా వాళ్లు అంటున్నారు. మీ ముఖంలో కరెక్టా..రాంగా అన్నది తెలిసిపోయేలా వుంది. వాళ్లు మీ కళ్లలోకి చూస్తున్నారు. మీ ఫీలింగ్స్ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని. కానీ నేను ఫర్లేదు అంటున్నాను. నేనేమీ వాళ్లను భయపెట్టి ఓడించడానికి ఇక్కడ కూర్చోలేదు. గెలిపించడానికి కూర్చున్నా. 

గెలిపించడం అంటే గుర్తొచ్చింది. చాలా తేలికపాటి ప్రశ్నలు అడుగుతున్నారన్న కామెంట్ వుంది.

మొదటి అయిదు ప్రశ్నలు చాలా చాలా తేలిగ్గా అడగాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. వచ్చినవాళ్లు ఎంతో కొంత మొత్తం తీసుకెళ్లాలి. వట్టి చెతులతో పంపకూడదు. అదే ఈ షో ప్రధాన ఉద్దేశం.

వచ్చిన వాళ్లను చూస్తే మీకు ఈ షో మీద ఇప్పటికే ఓ అవగాహన వచ్చి వుండాలి.

వచ్చిన వాళ్లలో, వచ్చేవాళ్లలో చాలా మంది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్లు. ఓ స్టేజీకి అంటే మూడు లక్షల పాతిక వేలో, ఆరున్నర లక్షలకో వచ్చాక, ఓ రకమైన భయం కనిపిస్తోంది. ధైర్యం చేసి ముందుకెళ్తే, ఈ డబ్బులు కూడా పోతాయేమో..ముందువెనుకాడుతున్నారు. అందుకే నేను వాళ్లను ఆడండి..ఫరవాలేదు అని చెబుతున్నాను కూడా. నాకు వారు గెలవాలనే వుంది. వారిని గెలిపించాలనే వుంది. 

ఒక్కోసారి వచ్చినవాళ్లను మీరు చిన్న చిన్న విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు.?

అవును. నాకు తెలియదు..ఇన్నాళ్లు పట్టించుకోలేదు.నేను, నా వ్యవహారాలు. ఇప్పుడు ఎలాగూ మాట్లాడుతున్నాను వివిధ వర్గాల జనంతో. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.

ఈ షో లో అదనపు ఆకర్షణ..వాళ్ల వైనాలు, కథలు..ఇంకా ఇంకా చెప్పిస్తున్నారు.

ముందుగానే  ఓ క్వశ్చినీర్ ఇస్తున్నాం. వాటిని నేను చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తున్నా, క్విజ్ మధ్యలో వాటిని అడిగి. వారి వైనాలు, వ్యధలు, కథలు తెలుసుకుంటున్నా. కొన్ని కొన్ని చాలా చిత్రంగా వున్నాయి. మొన్న ఒకాయన..తండ్రిపై కోపంతో చేతిమీద 82 కోతలు కోసుకున్నాడట. ఎందుకు? దాని వెనుక వ్యవహారం. ఇలా చాలా సంగతులు..అన్నీ ఆసక్తికరంగా వుంటున్నాయి. 

ఇంతకీ ఈ షో టెలివిజన్ లెక్కల ప్రకారం విజయవంతం అయినట్లేనా?

డవుటా..టీఆర్పీ రేటింగ్ లు చూడండి..మావాళ్లు చెబుతున్నారు. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని

మాటీవీ లో మీకు వాటా వుంది కాబట్టి, మీరు ఈ షో చేస్తున్నారనుకోవాలా..లేక ఎవరు మీకు ఇలాంటి షో ఆఫర్ చేసినా చేసేవారా?

వైనాట్..ఎవరు ఆఫర్ చేసినా చేసేవాణ్ణే. ఎందుకంటే, ఈ షో అలాంటిది. అదే సమయంలో మాటీవీ నాకు బిగ్ బాస్ లాంటి కార్యక్రమం చేయండి అని అడిగితే నో అని చెప్పేవాడిని. మొహమాటం లేకుండా.

మీరు టీవీ మాధ్యమానికి వచ్చారంటే, దాని పాపులారిటీ అంగీకరించినట్లేనా?

ఇప్పుడేమిటి? ఎప్పుడో మా టీవీ రాక ముందే జీ టీవీకి కార్యక్రమాలు అందించాం. టీవీ ఇప్పటికే చాలా ఎత్తుకు ఎదిగింది. ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతుంది కూడా. హిందీలో పాపులర్ నటులు అందరూ టీవీ షోలు చేసారు. తమిళనాట సూర్య చేసారు. ఎవరైనా చేయాల్సిందే. టీవీ రేంజ్ అలా వుంటుంది.

మీ అభిమానుల సంగతి సరే. ఇప్పుడు టీవీ లోకి వచ్చాక, ఇళ్లలో కొత్త అభిమానులు పుట్టుకోస్తారమో?

టీవీ చూసేవాళ్లలో నాన్నగారి అభిమానుల ఏజ్ గ్రూప్ నుంచి యంగ్ కోర్ గ్రూప వరకు వుంటుంది. షో కాగానే మెసేజ్ లు వస్తున్నాయి. ఏదో మొక్కుబడి మెసేజ్ లు కాదు. డిటైల్డ్ గా. అంటే అర్థం అదేగా..జనానికి మరింత చేరువ అవుతున్ననని.

ఈ విజయం మీ ఒక్కరిదేనా..

అలా ఎందుకంటాను..ఇక్కడ ఎంతో మంది టీమ్ వర్క్ చేస్తున్నారు. డీటీపీ దగ్గర నుంచి క్వశ్చనీర్ వరకు. పైగా ఎంపికలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నాం. ఎక్కడా ఏ తేడా లేకుండా. ఎంతో మంది కృషి ఫలితమే ఈ షో..దీనికి నేనో ఏడెడ్ అడ్వాంటేజ్ మాత్రమే. కానీ నాకు మాత్రం ఈ షో జీవితాన్ని, ప్రపంచాన్ని మరింత తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తోంది.

-థాంక్యూ..బెస్టాఫ్ లక్ సర్

థాంక్యూ

చాణక్య

[email protected]