ఎమ్బీయస్‌ : రాహుల్‌ గాంధీకి సెలవు

రాహుల్‌ గాంధీ కనబడడం మానేశారు. అది కూడా వూహించని విధంగా. ఫిబ్రవరి 23న పార్లమెంటు సెషన్‌ ప్రారంభమైనపుడు రాహుల్‌ గాంధీ భూసేకరణ ఆర్డినెన్సుపై మోదీ సర్కారును చెరిగేస్తాడని కాంగ్రెసు నాయకులు అనుకున్నారు. కానీ రాహుల్‌…

రాహుల్‌ గాంధీ కనబడడం మానేశారు. అది కూడా వూహించని విధంగా. ఫిబ్రవరి 23న పార్లమెంటు సెషన్‌ ప్రారంభమైనపుడు రాహుల్‌ గాంధీ భూసేకరణ ఆర్డినెన్సుపై మోదీ సర్కారును చెరిగేస్తాడని కాంగ్రెసు నాయకులు అనుకున్నారు. కానీ రాహుల్‌ ఎక్కడా కనబడలేదు. సాయంత్రం కాంగ్రెసు నాయకులు మీడియాతో 'ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రేపు జంతర్‌మంతర్‌ వద్ద జరగబోయే నిరసన కార్యక్రమానికి రాహుల్‌ గాంధీ నాయకత్వం వహిస్తారు' అని చెప్పారు. ఆ రాత్రి పొద్దుపోయాక కాంగ్రెసు మీడియా డిపార్టుమెంటు నుండి మీడియాకు సమాచారం వచ్చింది – పార్టీ భవిష్యత్తుపై యోచించడానికి రాహుల్‌ సోనియా నడిగి కొన్ని వారాలపాటు సెలవు తీసుకున్నారు' అని. రాహుల్‌ ఉండి మాత్రం ఉద్ధరించేదేముంది, రాజకీయాలకు శాశ్వతంగా సెలవు తీసుకుంటే అద్భుతంగా వుంటుంది కదా, అసలు మొత్తం పార్టీయే దేశానికి టాటా చెప్పేస్తే భేషుగ్గా వుంటుంది కదాని జోకులు వేశారందరూ. కానీ పార్టీలో వున్నవాళ్లకి అలా తోచదు కదా, 'పార్టీ ఎన్నో ఏళ్లగా వుంది, జనాల నోట్లో నానింది, అదృష్టం బాగుండి, బిజెపి తప్పులు చేస్తే జనాలు ప్రత్యామ్నాయం కోసం వెతికినప్పుడు మనం కంటికి ఆనతాం, అప్పటిదాకా రింగులో తచ్చాడుతూంటే మంచిది, గతంలో ఎన్నిసార్లు దివాలా తీసి మళ్లీ కోలుకోలేదు, బిజెపి కూడా 2 ఎంపీ స్థానాల నుంచి యిప్పుడు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి రాలేదా?' అనుకుంటారు. కావాలంటే రాహుల్‌ సెలవు తీసుకోమను తప్పులేదు కానీ బొత్తిగా పార్లమెంటులో బజెట్‌ సమావేశాలు నడిచే సమయంలో తీసుకోవాలా, అప్రదిష్ట కాకపోతే! అని పళ్లు నూరుకుంటున్నారు. ఇంతకీ రాహుల్‌కు అర్జంటుగా సెలవెందుకు కావలసి వచ్చింది? తన లీవు లెటర్లో ఏం రాసి వుంటాడు?

గతంలో ఒకసారి కంచి కామకోటి పీఠంలో జూనియర్‌గా వున్న జయేంద్ర సరస్వతి యిలాగే అంతర్ధానమై పోయారు. సీనియర్‌ అయిన చంథ్రేఖర సరస్వతి గాభరా పడి వెతికించారు. తల కావేరి (కావేరీ నది పుట్టిన ప్రాంతం) దగ్గర దొరికాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్లాను అన్నాడు జయేంద్ర. అదేం కాదు, పీఠంపై తన పట్టు సాధించడానికి వెళ్లాడన్నారు విజ్ఞులు. ఆయన డిమాండ్లను కాదన్నాడు పెద్దాయన. అలిగి వెళ్లి అక్కడ కూర్చున్నాడు చిన్నాయన. పీఠం పరువు పోతుందని పెద్దాయని లొంగి, వెనక్కి పిలిపించి తాళాలు అప్పగించారు. ఇప్పుడు రాహుల్‌ కూడా తల్లిమీద అదే సత్యాగ్రహం చేస్తున్నాడని అర్థమయ్యాక వూహాగానాలు ప్రారంభమయ్యాయి. కుటుంబస్నేహితుడైన శామ్‌ పిత్రోదా సలహాపై థాయ్‌లాండ్‌లోని బౌద్ధారామానికి వెళ్లి ధ్యానం చేస్తున్నాడని కొందరన్నారు. అబ్బే ఫిబ్రవరి 16 నాటికే యూరోప్‌ వెళ్లిపోయాడు అని మరి కొందరన్నారు. ఎక్కడికీ వెళ్లలేదు, ఉత్తరాఖండ్‌లో గుడిసెలో వుంటూ జనాలకు సేవ చేసేస్తున్నాడు అంటూ జగదీశ్‌ శర్మ అనే కాంగ్రెస్‌ నాయకుడు కొన్ని ఫోటోలు ట్విట్టర్‌లో పెట్టాడు. కానీ ఆ ఫోటోలు 2008 నాటివని కొందరు కనిపెట్టేశారు. ఇంకోవారంలో రాహుల్‌ దర్శనం యిస్తాడని యివాళే కమల్‌ నాథ్‌ అన్నాడు.

రాహుల్‌ పరిస్థితి దయనీయంగా వుంది. కాంగ్రెసు స్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు పరిస్థితిలా వుంది. తల్లి చూస్తే ఏదీ ఎటూ తేల్చదు. అంతా నాన్పుడు (ఆ విషయం తెలుగువారికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదు, తెలంగాణ విషయంలో చూశాంగా, నాన్చినాన్చి చివరకు పార్టీని ముంచింది) గట్టిగా నిలదీస్తామంటే రోగిష్టిది. అలా అని తనకు పగ్గాలు అప్పగించదు. తనకిస్తే తన యిష్టం వచ్చినట్లు చెడుగుడు ఆడేస్తాడేమోనని ఆవిడకు భయం. 2013 డిసెంబరు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోగొట్టుకుని గతంలో వున్న 43 స్థానాలకు బదులు 8 సీట్లు వచ్చినపుడు రాహుల్‌కి ఆవేశం వచ్చింది – ''నేను పార్టీ వ్యవస్థను సమూలంగా మార్చేస్తాను – మీరెవ్వరూ వూహించలేని తీరుగా..'' అని ప్రకటించాడు. కానీ అతను వూహించలేనిదేమిటంటే – మార్పుకి పార్టీ అధ్యకక్షురాలే అడ్డుపడుతుందని! పార్టీ ఓడినప్పుడల్లా అందరూ తననే బాధ్యుణ్ని చేస్తున్నారు. అలా అని పార్టీ నిర్వహణ తనకు అప్పగిస్తారా అంటే అప్పగించరు. ఏదైనా నిర్ణయం తీసుకుని తల్లికి చెపితే 'అందర్నీ సంప్రదించి అప్పుడు అంతిమ నిర్ణయం చెపుతా, అప్పటిదాకా ఏమీ చేయకు' అంటుంది. పార్టీలో సీనియర్లందరూ సోనియాను కలిసి మాట్లాడతారు. వారి స్థానంలో వద్దామనుకుంటున్న జూనియర్లు రాహుల్‌ను ఆశ్రయిస్తున్నారు. పాతవాళ్ల వలన పార్టీకి ప్రయోజనం ఏమీ లేదని, వాళ్లని  తప్పించి ప్రజాస్వామ్యయుత ఎన్నికల ప్రక్రియ ద్వారా కొత్త మొహాలను తేవాలని రాహుల్‌ ప్రతిపాదన. అలా చేస్తే పాతవాళ్లు తిరగబడతారని, రాహుల్‌ వంటి అనుభవశూన్యుడు ఆ పరిస్థితిని ఎదుర్కోలేడని సోనియా మాతృహృదయం తల్లడిల్లింది. అందువలన చూదాం చూదాం అంటూ బండి నెట్టుకుంటూ వచ్చింది. రాహుల్‌ ఓపిక పట్టాడు.

పార్లమెంటు ఎన్నికలలో ఘోరపరాజయం, ఆ పై ఐదు ఎసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితి యింకా హీనమైనా సోనియాలో కదలిక లేదు. ఇక రాహుల్‌ మొండికేశాడు. నువ్వు తప్పుకుని, ఆ పదవి నాకు అప్పగించు, నా ప్రయోగాన్ని అమలు చేయనీ. పోయేదేమీ లేదు, మనం యిప్పటికే నిండా మునిగి వున్నాం. చలేసేందుకు అవకాశమే లేదు అన్నాడు. ఆవిడ వినలేదు. రాహుల్‌ ఊహల్లో తేలుతున్నాడనీ, అవన్నీ ఇండియాలో కుదిరేవి కాదనీ ఆవిడ నమ్మకం. 2014 లోకసభ ఎన్నికల సమయంలో 16 నియోజకవర్గాల్లో అతను చెప్పినట్లే అమెరికా తరహాలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించి, ఎవరికి బలముందని తేలిందో చూసుకుని, వారికి టిక్కెట్లు యిచ్చింది. అయితే అందరూ ఓడిపోయారు. పార్టీలో సీనియర్లందరూ రాహుల్‌ని వెక్కిరించారు. 'దేశం మొత్తం కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలు వీచే సమయంలో వచ్చిన ఫలితాలను తీసుకుని ప్రయోగం విఫలమైందంటే ఎలా?' అని రాహుల్‌ అనుయాయులు వాదిస్తున్నారు.  చిన్నా, పెద్దా ఎవరైనా సోనియా వద్దకు వచ్చి సమస్య చెపితే 'రాహుల్‌తో మాట్లాడండి' అంటుందామె. రాహుల్‌తో చెపితే 'పార్టీ అధ్యకక్షురాలుందిగా ఆవిడదే తుది నిర్ణయం' అంటాడతను. ఈ దోబూచులతో ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియక రాష్ట్ర నాయకులు నిస్తేజం అయిపోతున్నారు. 

మాయం కావడానికి వారం రోజుల క్రితం రాహుల్‌ సోనియాను కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న కొందరు నాయకులపై, అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికారకులని భావించే కొందరిపై చర్య తీసుకోమని కోరాడట. దానితో బాటు అనేక రాష్ట్రాలలో పార్టీ అధ్యకక్షులను మార్చమని, ఏప్రిల్‌లో జరగబోయే పార్టీ సెషన్‌కు ముందుగానే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మార్పులు చేయమని అడిగాడట. గతంలో కామరాజ్‌ పథకం పేర జరిగిన కాంగ్రెసు ప్రక్షాళన టైపులో ఏదో ఒక తీవ్రచర్య చేపట్టకపోతే కాంగ్రెసుకు మైనారిటీలు, యువత దూరమై పోతారని రాహుల్‌ వాదన. ఆవిడ దేనికీ తలవూపలేదు. రాహుల్‌ను అధ్యకక్షుడయితే తక్షణం పార్టీ విడిచి వెళ్లడానికి డజను మంది నాయకులు సిద్ధంగా వున్నారని ఆవిడకు తెలుసు. తలిని లొంగదీయడానికి రాహుల్‌ మాయం కావాలని నిశ్చయించుకున్నాడు. పార్లమెంటు సెషన్‌లో వుంది కదా అని ఎవరో అంటే 44 మంది ఎంపీలు పెట్టుకుని అక్కడ ఊడబొడిచేదేముంది, మన మాట ఎటూ చెల్లుబాటు కావటం లేదు అన్నాడట. సరైన సమయంలో సుపుత్రుడు కనబడకపోవడాన్ని సమర్థించుకోవడానికి సెలవు చీటీ కథ చెప్పింది తల్లి. తనను యిన్నాళ్లూ నమ్ముకున్నవారికి న్యాయం చేయాలనే హామీ తీసుకుని రాహుల్‌కు పగ్గాలు అప్పచెప్పవచ్చని వూహాగానాలు వినబడుతున్నాయి. ఈలోగా తెలంగాణ రాష్ట్ర అధ్యకక్షుడి మార్పు జరిగింది. ఆయన సోనియా కాండిడేటో, రాహుల్‌ కాండిడేటో స్పష్టత లేదు. ఏదో ఒక మార్పు చేశాం, కాస్త ఓపిక పట్టు అని రాహుల్‌కి నచ్చచెప్పడానికి సోనియా చేసిన మార్పేమో కూడా తెలియదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]