యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్శిటీ)లో రోహిత్ అనే ఒక తెలివైన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఆ మరణం కేంద్రంగా అనేక అంశాలు చర్చనీయమయ్యాయి. మొత్తం మీద చూస్తే వేడి, ఆవేశం ఎక్కువ కనబడింది, సత్యమనే వెలుగు తక్కువ కనబడింది. ఆ మసక చీకటిలో దొరికిన సమాచారంతోనే యీ వ్యాసం రాస్తున్నాను. పొరపాట్లు ఎత్తి చూపితే సవరించుకుంటాను. మామూలుగా అయితే ఒక విద్యార్థి ఆత్మహత్యపై యింతలేసి చర్చలు జరగవు. ఇదే యూనివర్శిటీలో పదేళ్లగా 10 ఆత్మహత్యలు జరిగాయిట. వారిలో 8 మంది దళితులేట. అప్పుడెప్పుడూ యితర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, జాతీయ పార్టీలో ఉపాధ్యక్షులూ, జనరల్ సెక్రటరీలు వచ్చి వాలలేదు. ఇప్పుడెందుకు వచ్చారంటే యీ ఆత్మహత్యలో నింద మోస్తున్న ఎబివిపి, బిజెపికి అనుబంధ సంస్థ కాబట్టి! బిజెపిని కొట్టడానికి చిన్న గడ్డిపోచ దొరికినా దాన్ని బ్రహ్మాస్త్రంగా మలచుకుందామని ఆరాటపడుతున్నారు కాబట్టి! బిజెపితో రాజకీయశత్రుత్వం వున్నవాళ్లందరూ ఏకమై పోయి, భారీ స్థాయి హితోక్తులు వల్లిస్తున్నారు. సమాజపు స్థితిగతులను చర్చించేస్తున్నారు. అసలు గొడవ ఏమిటి, అవతలివాళ్లు చెప్పేది ఎంతవరకు నిజం వంటి విషయాలు చర్చించడానికి కూడా యిష్టపడటం లేదు. టీవీ చర్చల్లో కూడా బిజెపి, ఎబివిపి వారిని నోరు పెగలనీయకుండా మాటిమాటికీ, మాటమాటకీ అడ్డుపడుతున్నారు.
మొదట కొన్ని విషయాల్లో మనకు స్పష్టత రావాలి. యూనివర్శిటీల్లో రాజకీయాల జోక్యం వుండకూడదు అని అభిభాషణలు చేసే రాజకీయ నాయకులెవరికీ ఆ హక్కు లేదు. వీళ్లందరూ విద్యార్థి దశలో కాలేజీల్లో, యూనివర్శిటీల్లో వుండే రోజుల్లో రాజకీయాల్లో వెలిగినవారే. అక్కడి అనుభవంతోనే పైకి ఎగబాకారు. యూనివర్శిటీలో బలమైన సంఘాలన్నీ ఏదో ఒక పార్టీకి అనుబంధంగా వుండేవే. ఆ యా పార్టీలు వీరికి నిధులు, మార్గదర్శకత్వం చేస్తూ, వీరిలో మంచి వక్తలుగా, నేతలుగా వున్నవారిని గుర్తించి చదువయ్యాక పార్టీలో చేర్చుకుంటూ వుంటారు. ఇది ఎప్పణ్నుంచో జరుగుతూ వస్తున్నది. ఈ రోజు యూనివర్శిటీల్లో అచ్చగా చదువు చదువుకోవాలి తప్ప యితర విషయాల జోలికి వెళ్లకూడదు అనడం ఆచరణలో సాధ్యం కాదు. దేశవిదేశాల్లో జరిగే విషయాలపై విద్యార్థులు ఎందుకు స్పందించాలి, తమ పరీక్షల గోల తాము చూసుకోక.. అని అనవచ్చు కాని ఆ వయసులోనే సమాజం గురించి ఏదో చేయాలనే తపన, ఏదో ఒక భావజాలం చేత ప్రభావితం కావడం, ఆవేశపడడం, తాము తలచుకుంటే ప్రపంచాన్నే మార్చేస్తామనే భ్రమలో పడడం జరుగుతాయి. యూనివర్శిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత యీ నిషా దిగిపోతుంది. ఉద్యోగం ఎవడిస్తాడా, అమెరికాకు వీసా కోసం చిలుకూరు బాలాజీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలా అనే రంధిలో పడతారు. ఉద్యోగం దొరికాక ప్రేమ, పెళ్లి, కుటుంబబాధ్యతలు, ఉద్యోగంలో ప్రమోషన్.. యిలాటివాటితో సమాజం, రాజకీయాలు యిలాటివాటిపై ఆసక్తి చచ్చిపోతుంది. యూనివర్శిటీ రోజుల నాటి ఉపన్యాసాలు, ప్రతిజ్ఞలు ఎవరైనా గుర్తు చేస్తే సిగ్గుపడతారు కూడా. యూనివర్శిటీ రోజుల్లోనే వాళ్లకు పలురకాల భావజాలాలకు ఎక్స్‌పోజ్ అవుతారు. కావాలి కూడా. ఆ తర్వాత తమతో ఏకీభవించనివారితో వాదోపవాదాలు కూడా చేస్తారు.
ఇక్కడితో ఆగాలని అందరూ కోరుకుంటారు. అయితే ఆగటం లేదు. అనేకసార్లు భౌతికపరమైన దాడులకు కూడా దిగుతారు. అక్కణ్నుంచి గొడవలు ప్రారంభం. వారు కొట్టారని వీరు, వీరు తన్నారని వారు. మళ్లీ యిరుపక్షాలు కొన్ని సందర్భాల్లో ఏకమై మూడో పక్షం వారితో తగవుకి వస్తారు. అందరూ బాహాబాహీ యుద్ధం చేస్తున్నారని కంగారు పడి ప్రిన్సిపాలో, వైస్ ఛాన్సలరో పోలీసులను రప్పిస్తే అందరూ కలిసి ఏకమై పోయి పోలీసులను క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వం, అనుమతి యిచ్చిన విసిని ఘొరావ్ చేస్తాం అంటూ గొడవ చేస్తారు. మేం తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నా మీరు చూస్తూ కూర్చోవాలి తప్ప పోలీసుల ద్వారా చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అంటారు. విద్యార్థుల్లో యీ గొడవలు మామూలేలే, కొన్నాళ్లు పోతే వాళ్లే సర్దుకుంటారు, మధ్యలో మనం తలదూర్చకూడదు అని అధ్యాపకులు, ఎడ్మినిస్ట్రేటర్లు సాధారణంగా చూసీచూడనట్లు వూరుకుంటారు. ఎందుకంటే ఏదైనా క్రమశిక్షణ చర్య తీసుకుంటే విద్యార్థి భవిష్యత్తు పాడై పోతుంది, యీ పాలపొంగు ఆవేశం చల్లబడ్డాక జీవితాంతం వ్యథతో కుమిలిపోతాడు అని సహనం చూపిస్తారు. ఇలాటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే బయటివాళ్లు వచ్చి 'ఎడ్మినిస్ట్రేషన్ అలసత్వం వలననే యూనివర్శిటీ వాతావరణం పాడై పోతోంది' అని విమర్శలు చేస్తారు. అలా అని గట్టి చర్యలు తీసుకుంటే మానవత్వం లేకుండా విద్యార్థులపై కాఠిన్యం వహిస్తున్నారు అని మళ్లీ గొడవ చేస్తారు. ఇప్పుడు చూడండి, నలుగురు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎందుకు? వాళ్లు చేసిన పని సవ్యమైనదే అని యూనివర్శిటీ యాజమాన్యం భావిస్తోందా? రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం వలన వాళ్ల తప్పు (యిప్పటిదాకా అలాగే అనుకున్నారుగా) సడన్‌గా ఒప్పు అయిపోతుందా? నిన్న వాళ్లు చేసిన పనులు రేపు యితరులూ చేశారనుకోండి, వాళ్లని దండించరా?
చాలా దశాబ్దాలుగా యూనివర్శిటీల్లో లెఫ్టిస్టు యూనియన్లు ఒకవైపు, ఎబివిపి మరొకవైపు వుంటూ వచ్చాయి. ఇటీవలి కాలంలో యువత కమ్యూనిజానికి దూరంగా జరిగారు. వామపక్షాల యూనియన్లు బలహీనపడ్డాయి. ఎబివిపి బలపడుతూ వచ్చింది. దళిత యూనియన్లు ఏర్పడినపుడు కులప్రస్తావన సహించని లెఫ్టిస్టులు వాటిని వ్యతిరేకించారు. అప్పుడు వారికి ఎబివిపి మద్దతు యిచ్చి నిలబెట్టింది. ఎబివిపిలో కూడా అనేకమంది దళిత నాయకులున్నారు. అది అగ్రవర్ణాల నాయకత్వంలో నడవటం లేదు. అయినా దాన్ని దళిత వ్యతిరేకిగా చూపిద్దామనే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే ఎబివిపికి కౌంటర్‌గా నిలబట్టేందుకు దళితులు, మైనారిటీల పేరనే సమీకరణ సాగుతోంది. కానీ వీరి బలం మరీ ఎక్కువగా లేదు. భావజాలం రీత్యా ఆరెస్సెస్‌కి, కులమతాల రీత్యా దళిత, మైనారిటీలకు చెందని తటస్థ విద్యార్థుల సంఖ్య ఎక్కువ కావడంతో చాలామంది విద్యార్థులు యూనియన్లకు దూరంగా వుంటున్నారు. అందువలన విద్యాలయాల యూనియన్లలో చాలా ఏళ్లగా ఎబివిపి బలం పుంజుకుంటూ వస్తోంది. ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దాని దూకుడు మరీ పెరిగింది. అనేక సందర్భాల్లో అది హద్దులు దాటుతోంది కూడా. దాన్ని అడ్డుకోవడం చేతకాని వారందరికీ రోహిత్ ఆత్మహత్య ఒక సాధనంగా కనబడింది. అతను దళితుడు కావడంతో ఎబివిపికి, బిజెపికి వున్న హిందూత్వ, అగ్రవర్ణ ముౖద్రపై విరుచుకుపడి దళితుల సానుభూతి సంపాదిద్దామని పథకాలు వేశారు. దానికి తోడు హైదరాబాదులో ఎన్నికలు వచ్చిపడ్డాయి. అందువలన మరీ రెచ్చిపోయారు. బిజెపితో ఎట్టి పరిస్థితుల్లోను కలవని మజ్లిస్, కాంగ్రెస్ అందరి కంటె ఎక్కువ అడావుడి చేశాయి. బిజెపితో ప్రస్తుతం చేతులు కలిపిన టిడిపి, కలపాలని చూస్తున్న తెరాస గట్టిగా ఏమీ అనటం లేదని, అందుకే యిరు తెలుగు ముఖ్యమంత్రులు వచ్చి పలకరించలేదని విరుచుకుపడ్డాయి. విసి రాజీనామా చేయాలి, ఎబివిపి లేఖ ఫార్వార్డ్ చేసినందుకు దత్తాత్రేయ రాజీనామా చేయాలి, ఎంపీ లేఖపై మీ స్పందన ఏమిటని రిమైండర్లు పంపినందుకు స్మృతి ఇరానీ రాజీనామా చేయాలి – అంటూ డిమాండ్ చేశారు. మోదీనీ వదల్లేదు. అతని సమావేశంలో నినాదాలు చేశారు. సందట్లో సడేమియాగా అరవింద్ కేజ్రీవాల్ వచ్చి బిజెపిపై తన కసి వెళ్లగక్కి, ఢిల్లీ పోలీసులపై తన అదుపు లేదని వాపోయారు కూడా. నిర్భయ హత్య జరిగినపుడు షీలా దీక్షిత్ యిదే సంగతి మొత్తుకుంటే అప్పుడు అరవింద్ విన్నారు కాదు. అర్ధరాత్రి ఓ ఆడపిల్లను రక్షించలేని షీలా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనికి రాదని నినాదాలు యిచ్చారు, వివాదాలు చేశారు. రాజయ్య కోడలు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నపుడు వచ్చినపుడు తొంగి చూడని రాహుల్ గాంధీ యిప్పుడు వచ్చి లెక్చరు దంచాడు. 'రాజకీయనాయకుడిగా రాలేదు, యువకుడిగా వచ్చా'నన్నాడు. ఇంకా నయ్యం, సాటి మేధావిగా వచ్చాననో, అసలు యూనివర్శిటీ మొహం ఎలా వుంటుందో చూడ్డానికి వచ్చాననో అనలేదు!
వీళ్లందరికి అందివచ్చిన అంశం – చచ్చిపోయిన విద్యార్థి దళితుడు కావడం. అబ్బే అదేం కాదు, దళితుడు కాకపోయినా యింత ఆందోళన చేసేవాళ్లం అంటే అయితే మరి తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వందలాది విద్యార్థుల విషయంలో యీ స్థాయి ఆందోళన జరగటం లేదేమన్న ప్రశ్న వస్తుంది. ఐఐటీ విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడి విసిలు రాజీనామాలు చేశారా? కళాశాలల్లో వాతావరణాన్ని బాగు చేయడానికి ప్రభుత్వాలు ఏమైనా చర్యలు చేపట్టాయా? రోహిత్ దళితుడు కావడం, ఆంబేడ్కర్ స్టూడెంట్స్ యూనియన్‌లో ముఖ్యుడు కావడం చేతనే యింత పూనకం వస్తోంది. అతన్ని 'యువమేధావి', 'దళితమేధావి' అని కీర్తిస్తున్నారు. మొదట గమనించవలసినది దళితమేధావి, రెడ్డిమేధావి అంటూ విడిగా వుండరు. మేధావితో సరిపెట్టాలి. ఇతడు మేధావి అయ్యే క్రమంలో వున్నాడు. ప్రస్తుతానికి తెలివైన విద్యార్థి అంటే సరిపోయేది. ఇక కర్మధారయసమాసంలో పూర్వపదం కూడా చర్చకు వస్తోంది – దళితుడా కాదా అని. దళితుడు కాదు, 'తండ్రి, తాత వడ్డెర కులానికి చెందినవారు' అని ఎబివిపి సగం సమాచారం బయటపెట్టింది. 'నేను మాల కులస్తురాలిని' అని తల్లి మరో సగం చెప్పింది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం రోహిత్ తండ్రి బిసి, తల్లి ఎస్సీ అన్నమాట. మరి అతను ఎస్సీ అవుతాడా కాదా అన్నది ప్రశ్న. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)