కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ కార్యాలయోద్యోగులపై ఆరోపణలు చేస్తూ వచ్చిన సోలార్ స్కామ్ నిందితురాలు సరితా నాయర్ యీసారి ఏకంగా ముఖ్యమంత్రికే రూ.1.90 కోట్ల లంచం యిచ్చానని తీవ్ర ఆరోపణ చేసింది. 2013 జూన్‌లో తనపై, తన భాగస్వామి బిజూ రాధాకృష్ణన్‌పై పెట్టిన 46 కేసులను విచారించడానికి ఏర్పడిన కమిషన్ ఎదుట హాజరు కావడానికి సరిత గత 11 నెలలుగా మొహం చాటేస్తూ వచ్చింది. అలాటిది అసెంబ్లీ ఎన్నికలు మూడు నెలలున్నాయనగా జనవరి 27న హాజరై సంచలనం రేపింది. ముఖ్యమంత్రికి నేషనల్ డెవలమ్‌మెంట్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడానికి ఢిల్లీ వచ్చినపుడు అతనికి అత్యంత ఆప్తుడైన థామస్ కురువిళ్లాకు ఢిల్లీలో 2012 డిసెంబరు 27న 1.10 కోట్లు యిచ్చానని చెప్పింది. తక్కిన 80 లక్షలు తిరువనంతపురంలో కురువిళ్లాకే యిచ్చిందట. జిక్కుమోన్ ముఖ్యమంత్రి తరఫున రూ. 7 కోట్లు అడిగాడని, అలాగే ఆర్యదన్‌్ మొహమ్మద్ అసిస్టెంటు కేశవన్ మంత్రి తరఫున రూ. 2 కోట్లు అడిగాడని, తను ఆర్యదన్‌కు వాళ్లింట్లో రూ.25 లక్షలు, కొట్టాయంలో సెమినార్‌లో మరో రూ.15 లక్షలు యిచ్చానని ఆరోపించింది.
నిజానికి ఇప్పటిదాకా అనేకమందిపై ఆరోపణలు చేస్తూ వచ్చిన సరిత ముఖ్యమంత్రి జోలికి వెళ్లలేదు. కమిషన్ ముఖ్యమంత్రిని పిలిపించి 2016 జనవరి 25 న 14 గంటల పాటు అతని స్టేటుమెంటు రికార్డు చేసినపుడు ఆమె తరఫు లాయరు యీ ఆరోపణ చేయలేదు, దీని గురించి ప్రశ్నించలేదు. కానీ రెండు రోజులు తిరక్కుండా సరిత యిలా స్టేటుమెంటు యివ్వడంతో దీని వెనక్కాల లిక్కర్ లాబీ, సిపిఎం వున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. కేరళలో పాక్షిక మద్యనిషేధం అమలు చేస్తూ, ఊమెన్ ఫైవ్ స్టారు హోటళ్లలో తప్ప వేరే చోట మద్యం అమ్మరాదంటూ అనేక బార్లు మూయించేశాడు. అందువలన బార్ల యజమానులు అతనిపై కక్ష కట్టారు. అతని కాబినెట్ సహచరులకు లంచాలిచ్చి లోబరచుకోవాలని చూశారు. ఆ ఆరోపణలతో ఎక్సయిజ్ శాఖామాత్యుడు కె.బాబు, ఫైనాన్స్ మంత్రి, కేరళ కాంగ్రెసు (మాని వర్గం)కి అధ్యక్షుడు మాని రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ విషయంపై మాని కోపంతో వున్నాడు. అతని కొడుకు, ఎంపీ అయిన జోస్ మాని కేంద్ర కామర్స్ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఢిల్లీలో ఫిబ్రవరి1 న కలిసి రబ్బర్ మద్దతు ధర పెంచమని కోరితే ఆమె తప్పకుండా పెంచుతామని హామీ యిచ్చింది. స్థానిక ఎన్నికలలో 15% ఓట్లు తెచ్చుకున్న బిజెపి దక్షిణ కేరళలో బలంగా వున్న మాని వర్గానికి చెందిన క్రిస్టియన్లు, ఈళవ కులస్తుల సంఘంతో కలిపి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసి 22% ఓట్లు సంపాదిద్దామని ప్రయత్నిస్తోంది. అందుచేత యిప్పుడు మాని మద్దతు సంపాదించి, ఊమెన్‌పై ఆందోళన చేయడంలో చురుకైన పాత్ర వహిస్తోంది.
ఇక సిపిఎం ఎలాగైనా ఊమెన్‌ను అప్రదిష్టపాలు చేయాలని చూస్తోంది. 2011 ఎన్నికలలో యుడిఎఫ్ అతి తక్కువ మార్జిన్‌తో గెలిచింది. 5 సీట్లు 500 ఓట్ల తేడాతో గెలుచుకుంది. 140 సీట్ల ఎసెంబ్లీలో 4 సీట్ల మెజారిటీతో ఊమెన్ ప్రభుత్వం ఏర్పరచాడు. ఇప్పటిదాకా నెట్టుకు రావడమే కాదు, బలపడ్డాడు కూడా. 2014లో దేశాన్నంతా మోదీ హవా వూపేసినా, కేరళలోని 20 ఎంపీ సీట్లలో 12 గెలిచాడు. ఊమెన్‌పై అవినీతి ఆరోపణలు లేవు. కోచిలో 246 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు, కోచిలో రూ. 5181 కోట్ల మెట్రో రైలు ప్రాజెక్టు, తిరువనంతపురం దగ్గర్లో అడానీ గ్రూపు కడుతున్న రూ. 7525 కోట్ల డీప్ వాటర్ పోర్టు, కంటెయినర్ టెర్మినల్ యిలా కొన్నిటిని అతని సమర్థపాలనకు ఉదాహరణలుగా చూపుతారు. ఊమెన్ సామాన్యప్రజలకు అందుబాటులో వుంటూ, ఫిర్యాదులు స్వీకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ సోలార్ స్కాముతో సిపిఎం ఊమెన్‌ను, యుడిఎఫ్‌ను దెబ్బ కొట్టాలని ఉబలాటపడుతోంది. లిక్కర్ లాబీ, సిపిఎం కలిసి సరితను ఉపయోగించుకుంటున్నారని ఊమెన్ ఆరోపించాడు. తాము అధికారంలోకి వస్తే మద్యనిషేధం పాలసీని సమీక్షిస్తామని సిపిఎం యిప్పటికే ప్రకటించింది.
వాళ్లు ఎంచుకున్న సరిత ఎటువంటిది? 1978లో అళప్పురా జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఆమె స్కూల్లో వుండగానే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, తల్లి పెంచింది. చదువుల్లో చాలా చురుకైన అమ్మాయి. 1993లో ఎస్‌ఎస్‌సి పూర్తి చేసి, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేసింది. పెళ్లయి 2004లో ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూండగా వివాహితుడైన బిజూ రాధాకృష్ణన్‌తో పరిచయమైంది. భర్తకు విడాకులిచ్చి యితన్ని పెళ్లాడింది. బిజూ నేరమనస్తత్వం కలవాడు, సరిత మాటకారి. ఇద్దరూ కలిసి మాయమాటలు చెప్పి చాలా రకాలుగా చాలామందిని మోసం చేశారు. 2008-2010 మధ్య వాళ్ల మీద 16 చీటింగ్ కేసులు పడ్డాయి. జైలుకి వెళ్లారు. 8 నెలలు జైల్లో వుండి 2010లో బెయిలు మీద బయటకు వచ్చి 2011లో టీమ్ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ లి. అనే కంపెనీ పెట్టి సోలార్ పానెల్స్ వ్యాపారం మొదలుపెట్టారు. విఐపిల యిళ్లకు వాటిని అమరుస్తూ వాళ్లతో పరిచయాలు పెంచుకున్నారు. సరిత వారితో శారీరక సంబంధాలు పెట్టుకుని, వారితో వేదికలపై కనబడుతూ, వాళ్ల పేరు చెప్పి యితరులను ఏమారుస్తూ ఎదిగిపోయింది. ఆ పరిచయాలు చూపిస్తూ పబ్లిక్ నుండి డిపాజిట్లు వసూలు చేశారిద్దరూ. మొత్తం రూ. 12 కోట్ల ఫ్రాడ్ యిది. 2013 నుంచి 33 కేసులు పడ్డాయి. వాళ్లపై గట్టిగా చర్య తీసుకుందామని నాయకులు ప్రయత్నిస్తే వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసేవారు.
2013లో సరిత, బిజూలు పరస్పరసంశయాలతో విడిపోయారు. బిజూ తన భార్యను 2006లో చంపివేశాడని సరిత ఆరోపించడంతో అతనిపై హత్యానేరం మోపబడింది. 2013లో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. సోలార్ కేసు విచారణ ప్రారంభం కాగానే సరిత తనతో లైంగిక సంబంధం పెట్టుకున్న ట్రాన్స్‌పోర్టు మంత్రి కెబి గణేశ్ కుమార్‌తో వ్యవహారం గురించి కాల్ రికార్డు, వీడియోలు లీక్ చేసింది. దెబ్బకు అతను రిజైన్ చేశాడు. ఇప్పుడు తనను 13 మంది విఐపిలు, ఒక ఐపియస్ ఆఫీసరు లైంగికంగా అనుభవించారని, వాళ్ల పేర్లు సీల్డ్ కవర్లో పెట్టి యిస్తానని సరిత కమిషన్‌కు చెప్పింది. 2014లో కాంగ్రెసు ఎమ్మెల్యే ఎపి అబ్దుల్లాకుట్టి తనను రేప్ చేయబోయాడని ఫిర్యాదు చేసింది కానీ మళ్లీ దాన్ని వెనక్కి తీసుకుంది. ఏం అని అడిగితే 'అతని రాజకీయ ప్రత్యర్థి, కెపిసిసి జనరల్ సెక్రటరీ తాంబనూర్ రవి నన్ను అలా చెప్పమన్నాడు. చెప్పాను' అని సమాధానమిచ్చింది.
ఒకటి మాత్రం నిజం – సరిత ముఖ్యమంత్రి ఆఫీసుకి, యింటికి తరచుగా వచ్చి వెళుతూ వుండేది. ముఖ్యమంత్రి ఆఫీసులో సిబ్బందిగా వున్న జిక్కుమోన్ జోసెఫ్, టెన్నీ జోపెన్‌లు, బాడీగార్డుగా వున్న పోలీసు కానిస్టేబుల్ సలీం రాజు సరితతో అనేకసార్లు ఫోనులో మాట్లాడారని తేలింది. దాంతో ఊమెన్ జోపెన్‌ను అరెస్టు చేయించి, మిగతా యిద్దర్నీ ఉద్యోగాల్లోంచి తీసేసి, 2003 అక్టోబరులో జస్టిస్ శివరాజన్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేశాడు. ఆ విధంగా తన సిబ్బంది తప్పు చేశారు తప్ప, తను కాదని ఊమెను ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాడు. ఇన్నాళ్లకు సరిత ముఖ్యమంత్రికే డైరక్టుగా యిచ్చానని చెపుతూ, అంటే అతనికి అత్యంత సన్నిహితంగా వుండేవారికే యిచ్చానని కొత్త ఆరోపణలు చేసింది. నిజానికి ముఖ్యమంత్రిది రూ. 9 కోట్ల డిమాండని జిక్కుమోన్ చెప్పాడు అంది. విద్యుత్ మంత్రి ఆర్యదన్ మొహమ్మద్ రూ. 2 కోట్లు అడిగితే రూ. 40 లక్షలిచ్చా అంటోంది. అంతేకాదు, ఫిబ్రవరి 1 న కొత్త ఆరోపణ చేస్తూ 'విచారణ కమిషన్ ముందు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడవద్దని కోరుతూ నన్ను నలుగురు కాంగ్రెసు నాయకులు కోరారు. వారి సంభాషణలు మూడు సిడిల్లో వున్నాయి వినండి' అంటోంది. ఆ సిడిలు నిజమైనవో, అబద్ధమైనవో యింకా తేలలేదు కానీ టీవీ ఛానెళ్లలో ప్రసారం కావడంతో కాంగ్రెసుకు యిబ్బందికరంగా పరిణమించింది. దీనికి తోడు సరితను తాను ఎన్నడూ కలవలేదని 2014లో అసెంబ్లీలో చెప్పిన ఊమెన్, కలిశానని మొన్నటి 14 గంటల కమిషన్ విచారణ సమయంలో చెప్పాడు. దీనిపై అసెంబ్లీలో హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు.
మీడియా ముందు హుషారుగా వుండే సరిత కమిషన్ ముందు ధాటీగా సమాధానాలు చెప్పడం లేదు. నీ ఆరోపణలకు ఆధారాలేవి అని అడిగిన ప్రశ్నలకు ఏకాక్షర సమాధానాలు, అదీ వినీవినబడకుండా చెప్తోంది. లైంగిక అత్యాచారానికి గురయ్యాను అని చెప్పింది, వివరాలు చెప్పు అంటే అది వ్యక్తిగతం కాబట్టి చెప్పను అంటోంది. అలాటివి గతంలో ధారాళంగా చెప్పిన మనిషి యీ రోజు యిలా మాట్లాడడం వింతగానే వుంది. ముఖ్యమంత్రి పై గతంలోనే ఎందుకు ఆరోపణలు చేయలేదు అని అడిగితే ''నేను కోచిలో చీఫ్ మేజిస్ట్రేటుకు నాతో సంబంధం వున్న విఐపిల గురించి చెపితే ఆయన అన్నీ కాగితంపై రాసి యిమ్మన్నాడు. అన్ని వివరాలతో 30 పేజీల లేఖ తయారుచేశాను. ఈలోగా ముఖ్యమంత్రి తరఫునుంచి రాయబారులు వచ్చి అవన్నీ బయటపెట్టకుండా వుంటే ముఖ్యమంత్రి నాకు జరిగిన నష్టాలను పూడుస్తారని చెప్పారు. దాంతో అది చింపేసి కేవలం 4 పేజీల్లో ఏదో రాసి యిచ్చేశాను'' అని సమాధానం చెప్పింది. ఈమె 2014లో సిపిఎం మీద ఆరోపణ చేసింది. ''ముఖ్యమంత్రిపై డైరక్టుగా ఆరోపణ చేస్తే రూ.10 కోట్లు యిస్తామన్నారు.'' అంటూ! ఇప్పుడు ఊమెన్ అది గుర్తు చేస్తూ అదీ నిజమేనంటారా? అని అడుగుతున్నాడు.
కేరళ అసెంబ్లీ ముగింపు సెషన్‌లో యీ విషయమై ప్రతిపక్షాలు లేవనెత్తుతూండగానే వారికి మరొక ఆయుధం దొరికింది. 1992లో రుణాకరన్ ముఖ్యమంత్రిగా వున్నపుడు 32 వేల టన్నుల పామోలిన్‌ను మలేసియా నుంచి దిగుమతి చేసుకున్నారు. దాని వలన రాష్ట్రానికి రూ.2.32 కోట్లు నష్టం వాటిల్లింది అని ప్రతిపక్షం అంటుంది. ఫైనాన్స్ శాఖలో అధికారులపై కేసు నడిచింది. దానిపై విచారణ జరిపిన విజిలెన్సు కోర్టు గత వారం తీర్పు యిస్తూ అధికారులది తప్పు లేదని, అన్నీ ఫైనాన్స్ మంత్రి ఊమెన్‌కు తెలిసే జరిగాయనీ అంది. అధికారులను విడిచిపెట్టేసింది. ''ఊమెన్‌కు తెలిసే జరిగాయన్నారు కాబట్టి అతను రాజీనామా చేయాలి'' అంటూ ఫిబ్రవరి 24న అసెంబ్లీలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ''నేను ఎప్పణ్నుంచో చెపుతున్నాను, అధికారులు అమాయకులనీ. ఆ ముక్కే కోర్టు యిప్పుడు చెప్పింది. ఆ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 9 కోట్లు లాభం వచ్చింది. కోర్టు నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించలేదు, నన్ను తప్పుపట్టనూ లేదు. 23 ఏళ్ల పాత కేసు చూపి నన్ను రాజీనామా చేయమనడం హాస్యాస్పదం. మధ్యలో అనేకసార్లు మీరు ప్రభుత్వంలో వున్నపుడు ఆధారాలతో నాపై కేసు పెట్టలేకపోయారా?'' అని ఊమెన్ ఛాలెంజ్ చేశాడు. సరిత కేసులో ఆ పాటి ధైర్యం చూపగలడో లేదో వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)