ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో హంతకుణ్ని విచారించడానికి మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ చెన్నయ్ 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేటు నిన్ననే తీర్పు చెప్పింది. ఆ సందర్భంగా ముద్దాయి తరఫు లాయరు చిత్రమైన వాదన వినిపించారు. హత్య ఆవేశంలో జరిగివుంటే హంతకుడు పశ్చాత్తాపంలో లొంగిపోయి వుండాలి. అలాటిదేమీ లేకుండా పారిపోయాడు. పట్టుకుని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేద్దామంటే యీ లాయరు అభ్యంతరాలు తెలిపాడు. వాటి గురించి చర్చించేముందు హత్య జరిగిన తీరు, హంతకుడి ప్రవర్తన చర్చించడం అవసరం.
2016 ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటూ జయలలిత 'చెన్నయ్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా కాపాడబడుతున్నాయి. ముఖ్యంగా ఆడవారికి భద్రత కల్పించే నగరమిది' అని ఉపన్యసించింది. అదే రోజున కరుణానిధి ఆమెను ఖండిస్తూ ''2011లో జయలలిత అధికారం చేపట్టిన దగ్గర్నుంచి 2015 చివరి వరకు 9948 హత్యలు, లక్ష దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. అంటే రోజుకి 7 హత్యలు, 70 దొంగతనాలు అన్నమాట. గత మూడేళ్లలో మహిళల పట్ల 20 వేల నేరాలు జరిగాయి. వాటిల్లో 2335 సెక్స్ సంబంధిత నేరాలే. '' అని వెక్కిరించాడు. ఆ మాటలు నమ్మవద్దని జయలలిత ఓటర్లను కోరింది. వాళ్లు విన్నారు. ఆమె గెలిచి మే 23న మళ్లీ అధికారం చేపట్టింది. 40 రోజుల గడిచే లోపుగా అనేకమంది మహిళలు హత్యలకు గురయ్యారు. మే 8న రోహిణీ ప్రేమకుమారి అనే అంకాలజిస్టు చెన్నయి నగరమధ్యంలో వున్న ఎగ్మూరులో తన నివాసంలో హత్య చేయబడ్డారు. జూన్ 19 నుంచి 26 లోపున ఏడుగురు మహిళలు చంపబడ్డారు. ఆరుగురు చెన్నయ్‌లో, ఒకరు తిరునల్వేలి జిల్లాలో! తన ఫోటోను ఆశ్లీలంగా మార్ఫ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టినందుకు బాధపడిన ఒక యువతి సేలంలో ఆత్మహత్య చేసుకుంది. జూన్ 24 న నగరమధ్యంలోనే వున్న నుంగంబాకం లోకల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం పై ఉ|| 6.45కు రైలు కోసం వెయిట్ చేస్తున్న స్వాతి అనే 24 ఏళ్ల ఇన్ఫోసిస్ ఉద్యోగిని దారుణ హత్యతో నగరమే కాదు, రాష్ట్రమే ఉలిక్కిపడింది.
స్వాతి చిన్నప్పణ్నుంచి నుంగబాకంలోనే నివసిస్తోంది. అక్కడే గుడ్‌షెపర్డ్ స్కూల్లో చదివి తాంబరంలోని ధనలక్ష్మీ యింజనీరింగు కాలేజీలో కంప్యూటర్ సైన్సెస్‌లో చదువుకుంది. 2014 జులైలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. మైసూరులో ట్రైనింగు పూర్తి చేసుకున్నాక నుంగంబాకం నుంచి 45 కి.మీ.ల దూరంలో పరనూరులో వున్న మహీంద్రా వ(ర)ల్డ్ సిటీ క్యాంపస్‌లోని ఇన్ఫోసిస్ బ్రాంచ్‌లో రిపోర్టు చేసింది. రోజూ ఉదయం 6.45కు నుంగంబాకంలో లోకల్ ట్రైన్ పట్టుకుని ఆఫీసుకు వెళుతూంటుంది. ఆమె తండ్రి సంతాన గోపాలకృష్ణన్ రోజూ ఉదయం ఆమెను స్కూటర్ మీద 6.30 కల్లా దింపుతూంటాడు. హంతకుడు రామ్‌కుమార్ తిరునల్వేలి టౌనుకి 60 కిమీ.ల దూరంలో వున్న మీనాక్షిపురం వద్ద వున్న పన్‌పొళి గ్రామనివాసి. తండ్రి బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి. తల్లి గృహిణి. ఇద్దరు అక్కలున్నారు. తిరునల్వేలి జిల్లాలోని అలంకులంలో ఐన్‌స్టీన్ ఇంజనీరింగు కాలేజీలో బిఇ పూర్తి చేసి, ఉద్యోగం కోసం మూణ్నెళ్ల క్రితం చెన్నయ్ వచ్చి సౌరాష్ట్ర నగర్ ఎయిత్ స్ట్రీట్‌లో స్వాతి యింటికి దగ్గర్లో వున్న లాడ్జిలో వున్నాడు. తన కంటె రెండేళ్లు పెద్దదైన స్వాతిని మే 11న చూశాక తనతో స్నేహం చేయమని, తనను ప్రేమించమని వేధించసాగాడు. కానీ ఆమె నిరాకరించింది. రోజూ ఆమె వెంటే నుంగంబాకం స్టేషన్‌లో రైలెక్కి ఆఫీసుకి వెళ్లి వస్తూండేవాడు. స్టేషన్‌లో బుక్‌స్టాల్‌ను వంతులవారీగా నడిపే దంపతులు యితన్ని గమనించారు. హత్య జరిగినపుడు బుక్‌స్టాల్‌లో భర్త వున్నాడు. పోలీసులు ఐడెంటిఫికేషన్ పెరేడ్‌కు పిలిచినపుడు అతను రామ్‌కుమార్‌ను గుర్తు పట్టాడు. స్వాతి రామ్‌కుమార్ గురించి తండ్రికి ఫిర్యాదు చేసి, తండ్రికి చూపించింది. అందువలన ఆయన కూడా పెరేడ్‌లో హంతకుణ్ని గుర్తుపట్టాడు.
జూన్ 24న స్వాతిని ఆమె తండ్రి ఎప్పటిలాగానే స్టేషన్ దగ్గర దింపాడు. ఆమె రెండో నెంబరు ప్లాట్‌ఫాంపై లోకల్ ట్రైన్ గురించి వెయిట్ చేస్తోంది. లేడీస్ కంపార్టుమెంటు ఆగే చోటికి ఎదురుగా ఓ బెంచి మీద ఎప్పటిలా కూర్చుంది. వెనక్కాల టెలిఫోన్ బూతు, పుస్తకాల షాపు, ఫలహారశాల, మరో స్టాలు వరసగా వున్నాయి. అక్కడ రామ్‌కుమార్ చురకత్తి లాటి ఆయుధంతో రెడీగా వున్నాడు. నెలన్నరగా తను ప్రేమిస్తున్నా స్పందించని స్వాతిపై అతను కుతకుతలాడిపోతున్నాడు. ఆమె వైపు కదిలాడు. వెనక్కాల అలికిడి విని స్వాతి తల తిప్పింది. హంతకుడు కత్తితో ఆమె కుడి దవడ మీద, మెడ మీద, తల మీద కొట్టాడు. ఆమె కింద పడిపోయింది. అతను వెంటనే కోడంబాకం వైపు పట్టాల మీదకు దుమికి, ఒక 50 మీటర్ల దూరం పట్టాల మీద పరిగెట్టి, చేతిలోని ఆయుధాన్ని సిగ్నల్ బాక్సుల వద్ద పడేసి, రైల్వే బోర్డరు రోడ్డు వైపున్న గోడ ఎక్కాడు. దాని అంచుపై గాజుముక్కలు పాతి వుండడంతో అవి అతనికి గుచ్చుకున్నాయి. రక్తం కారి గోడ మీద అంటింది. అతను గోడ దూకి పారిపోయాడు. అతను స్టేషన్‌పై యీ ఘోరకృత్యం చేస్తూండగా పక్కనున్నవారు వారించలేదు, అడ్డుపడలేదు, అతని వెంట పరిగెట్టలేదు. ఆమె వద్దకు వచ్చి ఆమె పరిస్థితి ఎలా వుందో, బతికి వుందో, అప్పటికే చచ్చిపోయిందో చూడలేదు. పోలీసులకు కాని, ఆంబులెన్సుకి కాని ఫోన్ చేయలేదు. హత్య జరిగిన కొన్ని నిమిషాలకు రైలు రాగానే అక్కణ్నుంచి పారిపోతే మేలనుకుని, కంటికి ఎదురుగా కనబడిన కంపార్టుమెంటులోకి ఉరికారు. వాళ్ల తర్వాత స్టేషనుకు వచ్చినవారైనా స్వాతి రక్తం కారుతూ, బాధతో కొట్టుకుంటూ వుంటే ఎవరూ ఆమె దగ్గరకు రాలేదు. ఆ తర్వాత చాలా రైళ్లు వచ్చాయి, వెళ్లాయి. ఆ స్టేషన్లో ఎక్కేవారు ఎక్కారు, దిగేవారు దిగారు. ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. చివరకు ఎవరు ఫోన్ చేశారో ఏమో కానీ పోలీసులకు రెండు ఫోన్ కాల్స్ వెళ్లాయి. వాళ్లు 9 గంటల సమయంలో వచ్చారు. అప్పటికి ఆమె చనిపోయి వుంది. ఆమె శవం మీద గుడ్డ కప్పినవారు కూడా లేకపోయారు. పోలీసులే గుడ్డ కప్పి, ఆమె బ్యాగులోంచి ఐడెంటిటీ కార్డు తీసి చూసి, దాని ప్రకారం వాళ్ల యింటికి వెళ్లి తండ్రికి జరిగినది చెప్పారు.
ఈ వార్త బయటకు రాగానే సాటి ప్రయాణీకుల ప్రవర్తన పట్ల చెన్నయ్ వాసులతో సహా సభ్యసమాజం యావత్తు తలదించుకుంది. హంతకుడిపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్టేషన్‌లో సిసిటివి కెమెరా లెందుకు లేవని అందరూ అడగసాగారు. విచారణ బాధ్యత మీదంటే మీదని అని గవర్నమెంట్ రైల్వే పోలీసు (జిఆర్‌పి), చెన్నయ్ సిటీ పోలీసు వ్యవస్థ తగవు లాడుకుంటున్నారని విని మండిపడ్డారు. జూన్ 27 న మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌లోని యిద్దరు న్యాయమూర్తులు సుమోటోగా కేసు చేపట్టి పబ్లిక్ ప్రాసిక్యూటరును పిలిచి పోలీసుల తగవులాటలో నిజానిజాలు తేల్చమని అడిగారు. రెండు రోజుల్లోగా హంతకుణ్ని కనిపెట్టి తీరాలన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే ప్రాసిక్యూటర్ 'రైల్వే పోలీసు, చెన్నయ్ సిటీ పోలీసుకు కేసు అప్పగించేసింది. నుంగంబాకం ఎసిపి దేవరాజ్ కేసు విచారిస్తున్నార'ని నివేదించారు. ఇక అక్కణ్నుంచి స్వాతి యిరుగుపొరుగు, సహోద్యోగులు, కుటుంబసభ్యులు అందర్నీ అడిగి సమాచారం సేకరించారు. హత్యకు ముందు, వెనక నుంగంబాకం, చూలైమేడు ప్రాంతాల్లోని ఫోన్‌కాల్స్ రికార్డులు తిరగేశారు. ఈ ప్రమాదాన్ని వూహించిన హంతకుడు స్వాతిని చంపిన తర్వాత ఆమె సెల్ తీసుకుని స్టేషన్‌కు దగ్గరలో వున్న చూలైమేడులో పారేశాడు. అంతేకాదు, హంతకుడి దగ్గర వున్న సిమ్ అతని పేర లేదు. ఇంజనీరింగు కాలేజీలో తన క్లాసుమేటు దగ్గర వున్నది తీసుకుని వాడుకుంటున్నాడు. ఆ సిమ్ క్లాసుమేటు తండ్రి పేర వుంది. ట్యూటికొరిన్‌లో ఓ అద్దె యింట్లో వుండగా ఆయన తన పేర తీసుకున్న సిమ్ అది.
ఇన్ని జాగ్రత్తలు పడినా కేసు యిక్కడదాకా వచ్చిందంటే దానికి కారణం సిసిటివి కెమెరాలకు చిక్కిన హంతకుని చిత్రాలు. అవి కూడా నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో పెట్టినవి కావు. ఉదయం 6.45కు స్టేషన్‌లో చాలామంది జనమే వున్నారు. ఎవరూ హంతకుడికి అడ్డు వెళ్లలేదు సరికదా కనీసం అతని ఫోటో సెల్‌ఫోన్‌తో తీసి పోలీసులకు పంపలేదు. అతను రైలు పట్టాలు దాటి గోడ దూకి రోడ్డెక్కాక స్టేషన్ పక్కన వున్న సౌరాష్ట్ర నగర్‌లో సెవెన్త్ క్రాస్ స్ట్రీట్‌లో ఒక యింటికి ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాకు చిక్కాడు. హత్య జరగడానికి ముందు రైల్వే బోర్డరు రోడ్డు మీద ఒక ప్రయివేటు సంస్థ ఏర్పరచుకున్న కెమెరాకు చిక్కాడు. హత్య జరగడానికి ముందు అతను బ్యాక్‌పాక్‌తో వెళుతున్నట్లు కనబడ్డాడు. అది హంతకుడే కావాలని ఏమీ లేదు కదా! కానీ హత్య జరిగాక చిక్కిన ఫోటోలో గోడ దూకేటప్పుడు గాజుముక్కలు గుచ్చుకుని కారిన రక్తం కారిన చేతులను చూసుకుంటున్నాడు. దాంతో హంతకుడు ఫలానా అని తెలిసిపోయింది. ఇక అక్కణ్నుంచి అతని గురించి వేట ప్రారంభమైంది. వారం రోజుల తర్వాత దొరికాడు. ఆ కెమెరాలే వుండి వుండకపోతే ఎన్నాళ్లకు దొరికేవాడో తెలియదు. హత్య జరిగి హంతకుడికై వేట సాగుతున్నపుడు జస్టిస్ కృపాకరన్ మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు 15 ప్రశ్నలతో ఒక లేఖ రాశారు. వాటిలో బసు స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, హాస్పటళ్లలో, షాపింగు మాల్స్‌లో, బీచ్ రోడ్లపై సిసిటివి కెమెరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2013లో ఎపి పబ్లిక్ సేఫ్టీ (మెజర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ చేసి ప్రయివేటు సంస్థలన్నీ వీధిని కూడా కవరు చేసేట్లా సిసిటివి కెమెరాలు పెట్టాలని చట్టం చేసింది. అలాటి చట్టం అన్ని రాష్ట్రాలూ చేయాలని కేంద్రం హోం శాఖ ఎందుకు ఆదేశించదు? అని అడిగారు.
పశ్చాత్తాపభారంతో పోలీసులకు సహకరించిన ఎందరో సాధారణ పౌరుల సహకారంతో జులై 1 కల్లా హంతకుడి ఆనుపానులు పోలీసులు కనిపెట్టగలిగారు. హత్య చేశాక, రామ్‌కుమార్ తన సొంతూరికి వెళ్లిపోయి యింట్లోనే దాగున్నాడు. సిసిటివిల ద్వారా బయటకు వచ్చిన తన ఫోటోను టీవీల్లో చూసి, అది తనే అని యిరుగుపొరుగు గుర్తు పడతారని భయపడి కాబోలు, యింట్లోంచి బయటకు రాలేదు. జులై 1 రాత్రి 11 గంటలకు అతని యింటిని పోలీసులు చుట్టుముట్టారు. తన దగ్గరకు రావద్దని, వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా పోలీసులు దగ్గరకు రావడంతో ఒక చాకుతో తన గొంతు కోసుకున్నాడు. అతన్ని వెంటనే తెన్‌కాశిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి తిరునల్వేలి లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకువచ్చారు. అతను గాయపడడంతో విచారణ చేయడం కష్టమైంది. జుడిషియల్ కస్టడీలో వుంచి, అరెస్టు చేసిన 12 రోజుల తర్వాత విచారణకై 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించమని కోర్టును కోరారు. రామ్‌కుమార్ తరఫున వాదిస్తున్న లాయరు పి.రామరాజు ''పోలీసులే మా క్లయింటు మెడ కోశారనే అనుమానం వుంది మాకు. అతని చికిత్స పూర్తి కాకుండానే చెన్నయ్‌కు తెచ్చారు. అతను మాట్లాడే పరిస్థితిలో లేడు. అతనికి సరైన మెడికల్, సైకలాజికల్ చికిత్స చేయించందే విచారణ ప్రారంభించడం అన్యాయం. అతని ప్రాణం ప్రమాదంలో పడుతుంది. అందువలన జుడిషియల్ కస్టడీలోనే వుంచాలి' అని వాదించాడు. ఇరుపక్షాల వాదనలు విన్నాక జడ్జి మూడు రోజుల పోలీసు కస్టడీని అనుమతించారు. రామ్‌కుమార్ తన అడ్వకేట్‌ను పొద్దున్న, సాయంత్రం అరగంటసేపు కలవవచ్చని చెప్పారు. వైద్యచికిత్స కొనసాగించే బాధ్యత పోలీసులదే, శనివారం తిరిగి జుడిషియల్ కస్టడీకి అప్పగించాలి. అన్నారు. విచారణ మొత్తాన్ని వీడియో తీయిస్తామని పోలీసులు చెప్తున్నారు.
ఇంజనీరింగు పాసయిన రామ్‌కుమార్ ఆలోచనా ధోరణి, వ్యవహారం తలచుకుంటే విస్మయం, కంపరం కలుగుతాయి. స్వాతిని ప్రేమించే హక్కు తన కెంత వుందో, తన ప్రేమను నిరాకరించే హక్కు ఆమెకు వుందని అతను గుర్తించలేదు. ఆమె అతని కంటె రెండేళ్లు పెద్దది. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిని. ఇతను నిరుద్యోగి. ఆమెకు అపరిచితుడు. ఇద్దరిదీ ఒక వూరు కాదు, ఒక కాలేజీ కాదు, ఒక ఆఫీసు కాదు. ఒక కాలనీలో వుంటున్నారంతే. ఇతనిలో ఆకర్షించే గుణం ఆమెకు కనబడకపోయి వుండవచ్చు. నెలల తరబడి వెంటపడితే ఆమె మనసు కరిగినా కరిగి వుండవచ్చు. కానీ యితనికి అంత ఓపిక లేదు. మే 11 న తొలిసారి చూశాడు. తను వలచగానే ఆమె వలలో పడనందుకు కోపం తెచ్చుకున్నాడు. చంపేయడానికి నిశ్చయించుకున్నాడు. జూన్ 24 కల్లా ఆ పని పూర్తి చేశాడు. ఏదైనా వాగ్వాదం జరిగి, ఆవేశంలో ఆమెను కొడితే చనిపోలేదు. కోల్డ్‌బ్లడెడ్‌గా, పథకం వేసి ఆమెను నరికి వేశాడు. దీనిలో పాపం స్వాతి తప్పేమిటి? తన యిష్టాయిష్టాలను ప్రకటించడమేనా? ఈ విద్యాధికుడు కూడా యిలా ప్రవర్తించడానికి మన సినిమాల్లో చిత్రీకరిస్తున్న హీరో పాత్రలు కూడా కొంత కారణమని ఒప్పుకోవాలి. కాలేజీలో అందరి ఎదుట ముద్దు పెట్టు అని జబర్దస్తీ చేయడం, అర్ధరాత్రి తాగి అలగా ఫ్రెండ్స్‌తో కలిసి యింటికి వచ్చి అల్లరి పెట్టడం, అడ్డుపడిన హీరోయిన్ తండ్రిని అవహేళన చేయడం – యివే కథానాయకుడి లక్షణాలుగా, అంతిమంగా కథానాయకి అతనంటే పడిచచ్చేందుకు కారణమైన గుణాలుగా చూపిస్తున్నారు. వీటి ప్రభావం ఎంతో కొంత మేరకు సమాజంపై వుంటుందని అనుకోవడానికి ఆస్కారం వుంది. మా ''హాసం క్లబ్బు''లో ఓ సారి ఒక హాస్యకవి, ఒక మిమిక్రీ ఆర్టిస్టు కలిసి ఓ ప్రదర్శన యిచ్చారు. మగ కుక్క ఆడకుక్క వెంట ఎలా పడుతుందో గేయరూపంలో కవి చదువుతూండగా, మిమిక్రీ ఆర్టిస్టు శబ్దరూపంలో కుక్కను అనుకరించాడు. అందరూ పడిపడి నవ్వారు. చివరిలో ముక్తాయింపుగా – 'ఇలా మూడునాలుగు వీధుల దూరం వెంటపడినా ఆడకుక్క కరుణించకపోతే మగకుక్క తోక వేలాడేసుకుని వెనక్కి వచ్చేస్తుంది కానీ దాని మీద యాసిడ్ పోయదు!' అని కవి ముగించారు. ప్రేక్షకులందరూ స్టన్నయిపోయారు. మనుష్యులుగా పుట్టినందుకు సిగ్గుపడ్డారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)