ఎమ్బీయస్‌: తిండిపై ఆంక్షలు- 3

బీఫ్‌ తినడం మా హక్కు అంటూ ఉస్మానియాలో దళితులు ఆందోళన చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి అక్కడకు వచ్చినవారందరికీ పెట్టారు. ఇష్టం వున్నవాళ్లు తిన్నారు, లేనివాళ్లు అటు వెళ్లనే లేదు. అంతటితో ఆగలేదు, హాస్టళ్లలో…

బీఫ్‌ తినడం మా హక్కు అంటూ ఉస్మానియాలో దళితులు ఆందోళన చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించి అక్కడకు వచ్చినవారందరికీ పెట్టారు. ఇష్టం వున్నవాళ్లు తిన్నారు, లేనివాళ్లు అటు వెళ్లనే లేదు. అంతటితో ఆగలేదు, హాస్టళ్లలో బీఫ్‌ పెట్టాలి అని గొడవ చేయసాగారు. అదే నాకు అర్థం కాదు. అది యితరులకు వెగటు కలిగిస్తున్నప్పుడు పెట్టి తీరాలి అని నువ్వెలా పట్టుబడతావు? హాస్టల్‌ మెస్‌లో భోజనమనేది విద్యార్థులకు కల్పించిన ఒక సౌకర్యం. ఇల్లరికపు అల్లుడిలా నీ కోరికలేమిటి? రేపు వెజిటేరియన్‌ హాస్టల్‌ కెళ్లి నాన్‌వెజ్‌ పెట్టమని యింకోడు గోల చేస్తే..? అక్కడ పెట్టేది యిష్టమైతే నువ్వు తిను, లేకపోతే బయటకి వెళ్లి నీ కిష్టమైనది తిను. ఫ్రాన్సులో ముస్లిములను అదుపు చేయాలని పంతం పట్టిన రైటిస్టు నాయకురాలు ప్రభుత్వ స్కూళ్లలో పెట్టే ఉచిత భోజనంలో పట్టుబట్టి పోర్క్‌ వుండేట్లా చూస్తోంది. పోర్కు తినం అని ముస్లిం పిల్లలంటే అఘోరించండి, మీకు ఫ్రీ మీల్‌ లేదు అంటోంది. ఈ బీఫ్‌ బ్యాచ్‌ వాళ్ల చేతికి అధికారం వస్తే యిలాటి పనులే చేస్తారేమో, మధ్యాహ్న భోజనపథకంలో బీఫ్‌ సమోసాలు మాత్రమే యిస్తాం అంటే.. అప్పుడేమంటాం? మా తిండి, మా యిష్టం అంటామా లేదా? 

అలాటప్పుడు యితరులను ఫలానాది తిను, ఫలానాది తినవద్దు అని శాసించడం ఏం సబబు? మన కిష్టం లేనిదాన్ని మన యింట్లో పడేస్తే ఒప్పుకోకూడదు, అలాగే వాడింటికి వెళ్లి నా కిష్టం లేనిది తినకు అని నిర్బంధించకూడదు. వాళ్లు చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ వుంటే వాళ్ల పని పట్టడానికి చట్టం వుంది, దాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసి వూరుకోవచ్చు. అసలు ఆ చట్టాల గురించే నాకు అర్థం కాని విషయాలు చాలా వున్నాయి. 'గోవు హిందువులకు పవిత్రం కాబట్టి గోమాంసం తినడం హిందువులకు నిషిద్ధం' తో ఆలోచన మొదలుపెడదాం. పురాణకాలంలో బ్రాహ్మణులు సైతం గోమాంసం, పందిమాంసం తిన్నారని, మద్యం తాగారని రుజువులున్నాయి అనే ప్రస్తావనలు యిక్కడ అప్రస్తుతం. యుగయుగానికి సామాజిక నీతి మారుతుంది. మద్యపానం శుక్రుడు నిషేధించాడంటారు. గోమాంసభక్షణ ఎవరు, ఎప్పుడు నిషేధించారో నాకు తెలియదు. ఒక పాయింటేమిటంటే సింధునాగరికత వాళ్లు నగరవాసులు, వ్యవసాయంపై ఆధారపడినవారు. వాళ్లకు గోసంపద ముఖ్యం. ఆర్యులు సంచారజీవులు. వాళ్లకు గుఱ్ఱాలు ముఖ్యం. ఆవుల్ని తినడానికి అభ్యంతరం లేదు. కానీ క్రమేపీ ఆర్యులు వ్యవసాయానికి మళ్లడంతో గోవులను రక్షించడానికి గోభక్షణ మానేసి వుండవచ్చు. గోవులు వుండడం రాజ్యసంపదకు చిహ్నంగా వుండేదనుకోవాలి. అందుకే భారతంలో గోగ్రహణం అనేది యుద్ధానికి దారి తీసిన అంశమైంది. ఏది ఏమైనా యిటీవలి కాలంలో హిందువుల్లో చాలా వర్గాలు గోమాంసం తినటం లేదు. కొన్ని వర్గాలు మాత్రం తింటూనే వున్నాయి. వాళ్లందరినీ హిందూమతంలోంచి వెలి వేస్తారా? అనేది ప్రశ్న. ఘర్‌ వాపసీ ద్వారా వెనక్కి తెచ్చిన హిందువుల కంటె వెలి వేసిన హిందువులు ఎక్కువై పోతే సంఖ్యాపరంగా హిందువుల ఆధిక్యత మరింత తగ్గిపోతుంది. వెలి వేస్తే గీస్తే ఎవరైనా పీఠాధిపతులు వేయాలి. ఆ ఆదేశాన్ని సకల వర్గాలు ఆమోదించి ఔదల దాల్చాలి. పోప్‌లా అంత సర్వాధికారం వున్న పీఠాధిపతులు మనకు ఎవరున్నారు?

గోమాంస భక్షణ హిందువులకు నిషిద్ధం కానీ ముస్లిములకు, క్రైస్తవులకు కాదు కదా? మరి వారిని తినకూడదని ఎలా అంటాం? గోహత్య చేస్తే మహాపాతకం అని మన నమ్మకం. దానివలన రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయనుకుంటే అలా చంపిన యితర మతస్తులు నరకానికి పోతే మనకేం ముప్పు? నిజంగా మన పవిత్రంగా భావించేవాటినన్నిటినీ రక్షిస్తున్నామా? గోవులు, బ్రాహ్మణులు క్షేమంగా వుంటే సమస్త లోకానికి శుభం కలుగుతుందని ఆర్యోక్తి. ఇక్కడ బ్రాహ్మణులు అంటే బ్రహ్మత్వం కలిగినవారు, మేధావులు అనే అర్థంలో కొందరు చెప్తారు. జన్మ చేత బ్రాహ్మణులైన వారిని కాని, బ్రహ్మత్వం సాధించిన పుణ్యాత్ములను కాని, మేధావులను కాని క్షేమంగా వుంచే ప్రయత్నాలు ఏమీ జరగటం లేదు. బ్రాహ్మల గోల వదిలేయండి. మనకు గోమాతే కాదు, నదీమాత, భూమాతా కూడా పవిత్రమే. నదులను మనం పవిత్రంగా వుంచుతున్నామా? ఇళ్లల్లో మురికినీటిని, ఫ్యాక్టరీలో మాలిన్యాలను అన్నిటినీ నదుల్లోకి తోసేస్తున్నాం. గంగాప్రక్షాళన అంటూ ప్రభుత్వం ఓ పక్క దశాబ్దాలుగా కోట్లు గుమ్మరిస్తోంది, మనం కశ్మలాన్ని గుమ్మరిస్తున్నాం.  ప్రక్షాళన అనేది ఎప్పటికీ తాజాగా వుండే సమస్యగా అయింది. ఇక భూమాత, ప్రకృతిమాతను ఎంత దుర్వినియోగం చేస్తున్నామో చెప్పాలంటే పేజీలు చాలవు. అన్నివైపులా కాలుష్యభరితమే. అవి పవిత్రమైనవి అని ఏ మాత్రం భావించినా యింత ఎబ్యూజ్‌ చేస్తామా? అవేమీ పట్టించుకోకుండా గోవుల పవిత్రత గురించే చర్చ జరుగుతోంది. గోమాంసభక్షణ ఆపినంత మాత్రాన గోరక్షణ అయిపోయినట్లేనా? వాటి పవిత్రత కాపాడినట్లేనా?

మిగతావాటి మాట ఎలా వున్నా గోవు విషయంలో అది పాలు యిస్తుంది కాబట్టి, మన చంటిపిల్లలు అవి తాగి పెద్దవాళ్లవుతున్నారు కాబట్టి దాన్ని కాపాడి తీరాలని కొంతమంది వాదన. ఆవు మాత్రమే పాలిస్తుందా? గేదె యివ్వదా? ఈ బీఫ్‌ చట్టంలో దానికి రక్షణ లేదట. గేదెమాంసభక్షణను నిషేధించలేదట. అదేమి వివక్షతో నాకు అర్థం కాలేదు. తెలుగువాళ్లలో చాలామంది గేదెపాలు తాగేవాళ్లమే. గేదె పట్ల యీ చిన్నచూపు దేనికి? విశ్వామిత్ర సృష్టి అనా? మరి విశ్వామిత్రుడు కూడా గొప్పవాడే కదా, లోకానికి గాయత్రీమంత్రాన్ని ప్రసాదించినవాడే కదా! కొందరు మేకపాలు కూడా తాగుతారనుకుంటాను. గాంధీగారే కాదు, గాంధేయవాదులు చాలామంది మేకపాలు తాగేవారు. మరి మేకను చంపడానికి అడ్డుపెట్టకపోవడం అదీ వివక్షతే కదా! మతం మాట ఎలా వున్నా, భారతదేశం వ్యావసాయిక దేశం కాబట్టి, ఆవును కాపాడి తీరాలి, లేకపోతే దేశ ఆర్థికవ్యవస్థ దెబ్బ తింటుంది అంటారు. నిజమే మనది వ్యావసాయిక దేశం. ఆవునే కాదు, పాడిపంటలు పెరిగేందుకు అవసరమైన సమస్త పశుజాతులను కాపాడాలి, భూసారాన్ని కాపాడాలి, జలవనరులను పరిరక్షించాలి, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మేవారిని దండించాలి. బీఫ్‌ తింటే ప్రాణాలు తీస్తామంటున్నారే, తలకోసి ఫుట్‌బాల్‌ ఆడతామంటున్నారే, చెరువులను కబ్జా చేసేవారిని ఏం చేస్తామో చెప్పటం లేదేం? మన వ్యవసాయదృక్పథం బీఫ్‌తో మొదలై బీఫ్‌తో ఆగిపోతోందా? ఈ మధ్యే ఆంధ్రజ్యోతిలో ఒకాయన వ్యాసం రాశారు – ఆవు ముసలిదైనా దాన్ని సాకితే లక్షలులక్షలు వస్తాయని, చంపితే దానిలో పదోవంతు కూడా రాదనీ గణాంకాలు యిచ్చారు. నిజంగా ఆయన చెప్పినట్లుగా ముసలి ఆవులను సాకడం అంత లాభదాయకమైతే కోళ్లఫారాలు, రొయ్యల చెరువులకు బదులు ఆవుల ఫారాలే వుండేవి. గోమూత్రం ఏ ధరకు అమ్ముతున్నారో, గోమయంతో గోబర్‌ గ్యాస్‌, సేంద్రియ ఎరువులు ఎంత తయారు చేయవచ్చో ఆయన రాసుకుని వచ్చారు. 40 ఏళ్లకు పైగా గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల గురించి వింటూ వచ్చాను. వాటిని నెలకొల్పడానికి బ్యాంకులు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి. పెట్టినవాళ్లు కనబడలేదు. సేంద్రియ ఎరువుల గురించి అందరూ మాట్లాడడమే తప్ప ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. అందరి చేతా బీఫ్‌ మాన్పించాకనే ఆ పని తలపెడదామనుకుంటే ఏం చెప్పలేం. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Archives