ఎమ్బీయస్ : తమిళ జైనులు

నేను 1985లో మద్రాసు బ్రాంచ్‌లో పనిచేయడానికి వెళ్లినపుడు అక్కడ పుష్యమిత్రన్ అనే ఒక కొలీగ్ తారసిల్లాడు. ‘‘మీ పేరు వింతగా వుందేమిటి?’’ అని అడిగితే ‘‘మేం తమిళ జైనులం.’’ అన్నాడు. ‘‘తమిళనాడులో జైనులున్నారా? జైనులనగానే…

నేను 1985లో మద్రాసు బ్రాంచ్‌లో పనిచేయడానికి వెళ్లినపుడు అక్కడ పుష్యమిత్రన్ అనే ఒక కొలీగ్ తారసిల్లాడు. ‘‘మీ పేరు వింతగా వుందేమిటి?’’ అని అడిగితే ‘‘మేం తమిళ జైనులం.’’ అన్నాడు. ‘‘తమిళనాడులో జైనులున్నారా? జైనులనగానే రాజస్థాన్, గుజరాత్‌లే గుర్తుకొస్తాయి. 

పంజాబీ జైన్లను కూడా చూశాను కానీ, తమిళ జైనులున్నారని తెలియదు.’’ అని ఆశ్చర్యపడి ‘‘మీరు బనియా (వైశ్యులు)లేనా?’’ అని అడిగాను. ‘‘కాదు, మేం రైతులం.’’ అన్నాడు. ‘‘రైతులా!? వ్యవసాయం చేసేటప్పుడు క్రిమికీటకాలపై జీవహింస జరుగుతుంది కాబట్టి జైనులు వ్యవసాయం చేసేవారు కారని ఎవరో చెప్పారే!’’ అన్నాను యింకా ఆశ్చర్యపడుతూ. అతను నవ్వాడు. ‘‘దక్షిణాదిన ఒకప్పుడు జైనమతం వర్ధిల్లిందని, జనాభాలో చాలామంది జైనులుండేవారనీ మీకు తెలుసు కదా! మరి వారందరూ వ్యాపారం మాత్రమే చేసేవారని ఎలా అనుకున్నారు?’’ అన్నాడతను.

నిజమేస్మీ అనుకున్నాను. మన తెలుగునాట, కన్నడసీమలో (కేరళ గురించి తెలియదు) జైనారామాలు చాలా వున్నాయని, బౌద్ధానికి ముందు నుంచీ జైనం యిక్కడ వుందని, మహారాజు, మహారాణిలలో ఒకరు హిందువులు, మరొకరు జైనులు అయిన సందర్భాలు కూడా వున్నాయని గుర్తుకువచ్చింది. కర్ణాటకలో శ్రావణ బెళగొళ (బాహుబలి అనేది అక్కడి విగ్రహం పేరే, యిప్పుడెవర్ని అడిగినా బాహుబలి అంటే ప్రభాస్ అంటారు కాబోలు), యాదగిరి గుట్టకు వెళ్లేదారిలో కొలనుపాక, ఆంధ్రలో పెనుకొండలో జైన దేవాలయాలు ఉన్నాయని గుర్తుకు వచ్చింది. జైన జనాభా అంతగా వున్నపుడు వీళ్లలో అన్ని వృత్తులవాళ్లూ వుండి వుంటారు. ధర్మవ్యాధుడి శైలిలో వృత్తి వేరే, ధర్మం వేరే అనుకునేవారేమో!

‘‘మా దగ్గర జైనులెవరూ తారసిల్లలేదు నాకు. మీ తమిళనాడులో ఎంతమంది వుంటారు?’’ అని అడిగాను. ‘‘మొత్తం మీద ఓ ఇరవై వేల మంది వుంటారు. మమ్మల్ని సామనార్లు అంటారు. శ్రమణులు అనే మాట నుంచి వచ్చి వుండవచ్చు. చివర్లో ర అనేది గౌరవవాచకం. (సాములారు అన్నట్లన్నమాట!) తమిళనాడులోని ఉత్తరప్రాంతపు జిల్లాలలో ఎక్కువగా వున్నాం. మమ్మల్ని ఉత్తరాది జైనులు పట్టించుకోరు. వాళ్లంతా డబ్బున్న జైనులు. మేం సామాన్యులం. మా ఆచారవ్యవహారాలు వాళ్లు జీర్ణించుకోలేరు.’’ అన్నాడు. 

అతను జందెం వేసుకునేవాడు. శ్రావణ పౌర్ణమినాడు మార్చుకునేవాడు. ఇంట్లో శాకాహారులే. ఒకప్పుడు తమిళనాట జైనులు ఎంతటి ప్రాభవం చవిచూశారో చెప్పుకుని వచ్చాడు.

ప్రాచీన సంగం తమిళసాహిత్యం లోని (క్రీ.పూ. 3 వ శతాబ్దంలో ప్రారంభమైదంటారు) 5 ప్రముఖ కావ్యాలలో మూడు జైనులు రాసినవే. ‘‘శిలప్పదికారం’’ రాసిన ఇళంగో అడిగళ్ అనే యువరాజు జైనుడే. దానిలో ప్రధాన పాత్రలైన కణ్ణగి, ఆమె భర్త కోవలన్ జైనులని చెప్పబడ్డారు. మధురై రాజును శపించిన కణ్నగి, కవి ఇళంగో అడిగళ్ విగ్రహాలు చెన్నయ్ మెరీనా బీచ్‌లో కనబడతాయి. కణ్ణగి కథపై సినిమాలు కూడా వచ్చాయి. 

అలాగే క్రీ.శ. 6 వ శతాబ్దం నాటి కావ్యం ‘‘మణిమేఖలై’’ రాసిన కుళవణిక్కన్ సీతలై సాతనార్, ‘‘జీవక చింతామణి’’ రాసిన తిరుక్కతేవర్ కూడా జైనులే. చివరది క్రీ.శ. 10 వ శతాబ్దంలోదిట.

అందరి కంటె ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి తిరువళ్లువర్. ఏడుపదాల శ్లోకాన్ని కురళ్ అంటారు. అలాటి 1330 కురళ్‌లను సంకలనం చేసిన పుస్తకం తిరు (శ్రీ అని అర్థం) కురళ్. దాని రచయిత ఎవరో తెలియదు. క్రీ.పూ. 2 వ శతాబ్దానికి చెందిన తిరు(శ్రీ) వళ్లువర్ అనే ఆయన రాశాడని అంటారు. 

అది ధర్మార్థకామాలనే పురుషార్థాలను అతి సులభమైన భాషలో చెప్తుంది. దైవప్రసక్తి లేకుండానే అహింస, శాకాహారం గురించి బోధిస్తుంది. తిరువళ్లువర్ వృత్తి రీత్యా సాలెవాడని కొందరు, తన పుస్తకంలో వ్యవసాయం గురించి ఎక్కువ చెప్పాడు కాబట్టి రైతని కొందరు అంటారు. దానిలోని సూక్తులు చాలా గొప్పవి కాబట్టి అది తమిళ ‘‘పంచమవేదం’’ అని పేరు తెచ్చుకుంది. చిదంబరం తన బజెట్ ఉపన్యాసంలో ఆ పుస్తకం నుంచి ఉదహరించకుండా వుండడు.

తిరుక్కురళ్‌లో దేవుడు, పూజ వగైరాలు లేకుండా మంచి నడత గురించి చెప్పడం చేత ద్రవిడ ఉద్యమకారులకు కూడా తిరువళ్లువర్ ఆరాధ్యుడయ్యాడు. రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ను ప్రాంతాల వారీగా చీల్చినపుడు ఒకదానికి ‘తిరువళ్లువర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్’ అని పేరు పెట్టాడు కరుణానిధి. ‘వళ్లువర్ కొట్టమ్’ (వళ్లువర్ శాల) అని చెన్నయ్‌లో ఒక కట్టడాన్ని కట్టించాడు. ‘‘సాగరసంగమం’’లోని ‘మౌనమేలనోయి’ పాట అక్కడే చిత్రీకరించారు. 

కన్యాకుమారిలో వివేకానంద మెమోరియల్‌కు దగ్గర్లోనే వళ్లువర్ యొక్క 133 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. ఇంతకీ ఆ తిరువళ్లువర్ జైనుడంటారు. తిరువళ్లువర్ బొమ్మ చూస్తే మీసం, పెద్ద గడ్డం, పైన కొప్పు ఏదో ఋషిలా వుంటాడు. జైనుడా? అని ఆశ్చర్యం వేస్తుంది.

ఆర్. ఉమామహేశ్వరి రాసిన ‘‘రీడింగ్ హిస్టరీ విత్ ద తమిళ జైనాస్’’ అనే పుస్తకం 2017లో వచ్చింది. పేపర్‌బ్యాకే 9 వేల రూ.లు అనడంతో సమీక్ష చదవడంతో సరిపెట్టాను. దాని ప్రకారం మద్రాసు కలక్టరుగా పని చేసిన ఆంగ్లేయుడు ఎఫ్. డబ్ల్యు. ఎల్లిస్ (1777-1819) తిరుక్కురళ్‌లోని ఒక భాగాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. 

ఆయన అది రాసినది జైనుడే అని నిర్ధారిస్తూ, ఆ రచయిత పేర నాణాలు కూడా వేయించాడు. వాటిల్లో ఆయన బొమ్మ మీసం, గడ్డం లేకుండా, తలపాగాతో వుంటుందట. ఇంకో విషయమేమిటంటే ఆ పుస్తకంలో 2003లో తమిళ జైనులు 32,700 మంది వున్నారని ఆవిడ రాసింది.

అయితే పోనుపోను తిరువళ్లువర్‌ను హిందూ ఋషి ఆకారంలో పోత పోసేశారు. విబూది నామాలు, రుద్రాక్షమాలలు లేవు కానీ, ఒక చేతిలో తాటాకుపత్రాలు అవీ చూడగానే ఎవరో ఋషి కాబోలు అనుకుంటారు. ద్రవిడ పార్టీ వాళ్లు ఆయనను ఆ రూపంలోనే ఊరూరా విగ్రహాలు పెట్టించి, ప్రజల మెదళ్లలో ఎస్టాబ్లిష్ చేశారు. 

అయితే యిటీవల తమిళనాడును కాషాయరంజితం చేద్దామనుకుంటున్న హిందూ సంఘాల వారు ఆయన మీద కూడా ఓ చెయ్యేశారు. హిందూ మక్కళ్ కచ్చి అనే సంస్థ అధ్యక్షుడు అర్జున్ సంబంధ్ నవంబరు 4న తంజావూరు జిల్లాలో పిళ్లయార్ పట్టి అనే వూళ్లో ఆయన విగ్రహం చేతికి రుద్రాక్షమాల కట్టి, పైన కాషాయరంగు శాలువా కప్పారు.

తిరుక్కురళ్ థాయ్ అనువాదాన్ని నవంబరు 2 న బాంగ్‌కాక్‌లో మోదీ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా తమిళనాడు బిజెపి వారు తిరువళ్లువర్ ఫోటోను ట్వీట్ చేసింది. దానిలో ఆయనకు నుదుటి మీద, భుజాలకు విబూది రేఖలు పెట్టి, మెళ్లోను, జబ్బలకు రుద్రాక్షమాలలు వేసి, పైన కాషాయరంగు శాలువా కప్పేశారు. ఆ ఉత్సాహంలో యీయన బయటి విగ్రహాలకు సైతం ఆ అలంకారం చేశాడు. ఇక దాంతో పెద్ద గొడవ ప్రారంభమైంది. అదిగో, ఆ సందర్భంగానే నాకు మా పుష్యమిత్రన్, యితర విషయాలు గుర్తుకు వచ్చాయి.

ఈ శాలువా, రుద్రాక్షలతో తిరువళ్లువర్‌కు అపచారం జరిగిపోయిందని డిఎంకె నాయకుడు స్టాలిన్ అభ్యంతరం తెలిపాడు. ఎవరో కానీ ఆ రాత్రి ఆ విగ్రహం కళ్లకు గంతలు కట్టి, పేడ, సిరా పూశారు. వళ్లువర్‌ను కాషాయీకరణ చేయడం తమిళులకు ద్రోహం చేసినట్లే అని కమ్యూనిస్టుల దగ్గర్నుంచి అభ్యంతరాలు తెలపసాగారు. బిజెపి జాతీయ సెక్రటరీ ఎచ్ రాజా తాము చేసిన పనిలో తప్పేమీ లేదని వాదించారు. ‘‘స్టాలిన్‌ను రెండు కురళ్‌లు తప్పు లేకుండా చదివి వినిపించమను. మేం మా ట్వీట్‌ను తొలగిస్తాం.’’ అని ఛాలెంజ్ చేశాడు.

స్టాలిన్ చదివినా చదవలేకపోయినా తిరువళ్లువర్‌ను యీ కొత్త అవతారంలో చూపే హక్కు బిజెపికి ఎవరిచ్చారో తెలియదు. ఆయన జైనుడో, హిందువో తెలియదనుకుందాం. ఆయన కురళ్‌లలో శివుడి గురించో, విష్ణువు గురించో రాస్తే అప్పుడు హిందువు అనుకోవచ్చు. కానీ ఆయన రాయలేదు. 

అలాటప్పుడు ఆయనను హిందువుగా చూపించే ప్రయత్నం దేనికి? నిజానికి బుద్ధుడు హిందూమతానికి వ్యతిరేకంగా యజ్ఞయాగాదులను నిరసించి, తన మతాన్ని వ్యాప్తి చేశాడు. దాన్ని హిందువులు అడ్డుకున్నంతకాలం అడ్డుకోవడానికి ప్రయత్నించి, ఆ మతం వ్యాప్తి చెందుతూంటే నిస్సహాయంగా చూస్తూ వుండిపోయారు. కొంతకాలానికి బౌద్ధానికి కూడా ఆచారవ్యవహారాల జాడ్యం పట్టి క్షీణించసాగింది. అప్పుడు బుద్ధుడు వేరెవరో కాదనీ, విష్ణువు అవతారమేననీ ఒక వాదనను ప్రచారంలోకి తెచ్చి, దాన్ని పూర్తిగా క్షీణింపచేశారు. ఇప్పుడు బౌద్ధం తన జన్మస్థలంలో తప్ప వేరే చోట్ల వ్యాప్తిలో వుంది.

ఇక జైనం మాటకి వస్తే కాకతీయుల కాలం (కొండగుర్తుగా చెప్పుకోవాలంటే క్రీ.శ. 1200-1300) వరకు యిక్కడ వర్ధిల్లింది. కాకతీయ సామ్రాజ్యం అంటే కేవలం తెలంగాణ వరకే పరిమితం అనుకోకూడదు. ఇప్పటి ఆంధ్ర, తెలంగాణలతో బాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలోని కొన్ని ప్రాంతాలవరకు విస్తరించింది. 

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ ‘‘ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి’’లో  ‘‘కాకతీయ యుగంలో ఆంధ్రదేశంలోని ప్రాచీనమైన జైన, బౌద్ధ మతాలు సంపూర్ణంగా క్షీణించడం, శైవ, వైష్ణవ మతాలు ప్రబలడం సంభవించాయి. గౌతమ బుద్ధుణ్ని మహావిష్ణువు దశావతారాల్లో ఒకడిగా అంగీకరించి పూజించటం ప్రారంభించటం చేత, క్రమక్రమంగా బౌద్ధులు ప్రాచీనమైన హీనయాన బౌద్ధాన్ని విస్మరించి, మూర్తిపూజాదికాలైన ఆచారాలతో నిండిన మహాయానాన్ని అవలంబించటం చేత, బుద్ధధర్మం క్రమంగా హిందూధర్మంలో లీనమైంది. 

కానీ జైనమతం అలా కాక కాకతీయ రాజ్యారంభం నాటికి బలవత్తరంగా వుండేది. కాకతీయ ప్రభువులు మొదట జైనమతాన్నే ఆదరించారు. వారి కులదైవమైన కాకతి కూడా జైన దేవతయే అయి వుండవచ్చు. కానీ శైవమతం ఆంధ్రదేశాన వ్యాపించినప్పుడు కాకతీయులు ఆ మతాన్ని అవలంబించారు.’’ అని రాశారు. (గ్రాంథిక భాషను వ్యావహారిక శైలికి మార్చి రాశాను)

కర్ణాటక నుంచి వీరశైవం వచ్చేవరకూ జైనమతానికి పెద్ద యిబ్బంది లేకపోయింది. ఆదరణ తగ్గినా, నెట్టుకుంటూ వచ్చింది. వీరశైవం వచ్చాక కాకతీయ కాలంలోనే జైనుల్ని హింసించి తమ మతంలోకి మార్చుకున్నారు. జైనదేవాలయాలను వీరభద్రాలయాలుగా మార్చారు. ఇవన్నీ చరిత్ర పుస్తకాల్లో విపులంగా వున్నాయి. 

అందుకే దక్షిణాదిన బౌద్ధులు, జైనులు ఎవరూ కనబడటం లేదు. వారందరినీ హిందువులుగా మార్చేశారు. ఇదంతా మధ్యయుగాల్లో జరిగిన విషయాలు. జరిగినదేదో జరిగిపోయింది. జైనం ద్వారా తంత్రం, వైద్యం, ప్రజల భాషలో సాహిత్యం, తర్కం, జీవరక్షణ యిత్యాది అనేక శాస్త్రాలు భారత సంస్కృతిలో భాగమయ్యాయి. ఆదిశంకరుడు జైనం నుంచి, బౌద్ధం నుంచి అనేక సిద్ధాంతాలు తీసుకున్నాడు. భిన్న సంస్కృతుల, ధర్మాల మేళవింపే భారతీయ వారసత్వం.

అయితే యిటీవల ప్రాచీన భారతంలో హైందవం తప్ప వేరే మతం లేదన్న రీతిలో ప్రచారం సాగుతోంది. ఇది గర్హనీయం. మనకు చరిత్ర గురించి సరైన అవగాహన లేకపోవడం చేత, ఎవరేది చెపితే అది నమ్మేసే పరిస్థితికి వచ్చేశాం. వాట్సాప్‌లో ఎవరో ఏదో రాస్తే అదే వేదమై పోతోంది. నిజమా కాదా అని చెక్ చేసుకోవటం లేదు.

మనం గొప్పవాళ్లం, మనమే గొప్పవాళ్లం, మనకు ఎవరూ సాటి రారు అని చెపుతూంటే పొంగిపోతున్నాం తప్ప మనతో పాటు యితరులూ గొప్పవాళ్లేమో అనే సందేహం తెచ్చుకోవడానికి కూడా ఇచ్చగించటం లేదు. నాగరికత పెరిగే కొద్దీ సంస్కారం పెరగాలి, విశాలదృష్టి పెరగాలి. సమాచార సేకరణ గతంలో కంటె యిప్పుడు సులభమైంది. ఎవరైనా (నాతో సహా) ఏదైనా చెప్పగానే చటుక్కున నమ్మేయకుండా, ప్రామాణికమైన ఆధారాలతో క్రాస్‌చెక్ చేసుకోవాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]