రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు అంత సులువు కాదు. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కు ఈ విద్య పట్టుపడక పరువు పోగొట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఆంధ్రలో ఆయన భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో ఆయన నోరు మెదపలేదు. కానీ దుబ్బాక విజయం తరువాత ఆయనకు అయ్యో అనిపిస్తోంది. సకాలంలో దుబ్బాకలో ఓసారి కాలు పెట్టేసి వుంటే బాగుండేదే అని ఇప్పుడు బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎలాగైనా జిహెచ్ఎంసి లో అయినా పొత్తు కుదరితే బాగుండు అని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది
అయితే జనసేనతో పొత్తు పెట్టుకుంటే తెరాస ఏ విధమైన ప్రచారానికి తెరతీస్తుందో భాజపాకు తెలియంది కాదు. పైగా ప్రస్తుతం బరిలో వైకాపా లేదు. వైకాపా సానుభూతి పరుల ఓట్లు తెరాసకు వెళ్లాలి లేదంటే భాజపాకు రావాలి. తెలుగుదేశానికి, వామపక్షాలకు వెళ్లవు. అదే జనసేనతో పోత్తు అంటే భాజపాకు రావు. అందుకే అన్నివిధాలా ఆలోచించి భాజపా పొత్తుకు దూరంగా వుంటోంది.
పొత్తు లేకుండా పోటీ చేస్తే ప్రతి చోటా వందల్లోనో, వేలల్లోనో ఓట్లు రాబట్టడం తప్ప, గెలవడం అనేది వుండకపోవచ్చు అని జనసేనకు తెలియంది కాదు. అలా జరిగితే ఆంధ్రలో మరింత పలుచన అవుతారు.
అందుకే ఆంధ్రలో పొత్తును సాకుగా, బేరంగా చూపిస్తూ జనసేన ఎలాగైనా పొత్తు తెచ్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా సైకలాజికల్ గేమ్ అన్నట్లుగా పొత్తు చర్చలు జరగబోతున్నాయహో అంటూ జనసేన ముందుగా టముకేసింది. పైగా భాజపానే పవన్ దగ్గరకు వస్తున్నట్లు మరో కలరింగ్.
అదే భాజపా జనాలకు మండించి వుంటుంది. అలాంటిది ఏం లేదుగా అంటూ ఇమ్మీడియట్ గా మొహమాటం లేకుండా ఖండించేసారు. ఇప్పుడు పవన్ వైపు నుంచి కిమ్మన్న మాట లేదు. పైగా ఉదయం ఇచ్చిన పొత్తు చర్చల ప్రకటన ట్విట్టర్ లో ఎక్కడా, జనసేన ఏ హ్యాండిల్ లోనూ ఇప్పుడు కనిపించడం లేదు.
పైగా అర్జెంట్ మరో గంటకో గడియకో అభ్యర్థులను ప్రకటించేస్తున్నాం అంటూ కొత్త ప్రకటన. ఇప్పుడు ఆ మాట మీద వుండి సీరియస్ గా పోటీ చేయకపోతే జనసేన పరువేం కావాలి?