సినిమాల నిర్మాణం పూర్తిగా లాటరీగా మారిపోయింది. పది సినిమాలు హిట్ కొడితే వచ్చిన లాభాలు ఒక్క సినిమా పట్టుకుపోతుంది. సినిమా నిర్మాణానికి యాభై కోట్లు ఖర్చయితే లాభం పది కోట్లు వుంటే గొప్ప. అలా అయిదు సినిమాలు హిట్ అయితే యాభై కోట్లు వస్తుంది. కానీ ఒక్క సినిమా తేడా కొడితే ఆ యాభై పట్టుకుపోతుంది.
అయినా ఇక్కడ చివరి ఆశ అడుగంటే వరకు సినిమాలు చేస్తూనే వుంటారు. ఒక్క షో పడితే గేమ్ టర్న్ అయిపోతుంది అనే ఆశ. కానీ తొంభై శాతం మందికి ఆ ఆశ నెరవేరదు. ఒక్క పది శాతం మంది అదృష్ట వంతులు వుంటారు.
ఇలాంటి అదృష్టం కోసం టాలీవుడ్ లోని ఓ బ్యానర్ పట్టుదలగా ప్రయత్నిస్తోందట. సినిమాలు తీస్తూనే వున్నారు. వదులుతూనే వున్నారు. నష్టాలు మూటగట్టుకుంటూనే వున్నారు. ఎందుకిలా అన్నది టాలీవుడ్ జనాలకు అర్ధం కావడం లేదు. కోరి ఎందుకు సినిమాలు ఎక్కిస్తున్నారు, అవి ఎక్కిస్తున్నపుడే తెలిసిపోతోంది, నష్టం మూట కట్టుకోబోతున్నారని. అలాగే జరుగుతోంది. ఆ గేమ్ ప్లాన్ ఏమిటి అన్నది టాలీవుడ్ జనాల్లో పెద్ద డిస్కషన్ పాయింట్ గా మారింది.
గత ఏడాది, ఈ ఏడాది కలిసి ఈ నిర్మాణ సంస్థ వంద కోట్ల వరకు నష్టాలు చవిచూసింది అన్నది ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్న టాక్. చేతిలో మంచి ప్రాజెక్ట్ లు లేకపోలేదు. వాటిలో ఒక్కటి మంచి సక్సెస్ కొట్టినా ఈ నష్టాలు దూది పింజెల్లా ఎగిరిపోతాయి. అదే గేమ్ ప్లాన్ అనుకోవాలేమో?కానీ తేడా కొడితే… అశుభం అప్రతిఘతమగు గాక!