దర్శకుడు కృష్ణ చైతన్య డ్రీమ్ ప్రాజెక్ట్ పవర్ పేట. రెండు మూడు భాగాలా ఎమోషనల్ పొలిటికల్ సినిమా. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నితిన్ ఈ ప్రాజెక్ట్ చేస్తారని అనుకున్నారు. నితిన్ దగ్గరే కృష్ణ చైతన్య చాలా కాలం వున్నారు. ఆఖరికి నితిన్ వద్దనుకున్నారు. తరువాత శర్వానంద్ దగ్గరకు వెళ్లారు. కానీ అక్కడా వర్కవుట్ కాలేదు.
దాంతో ఆ ప్రాజెక్ట్ అలా ఆపేసి, విష్వక్ సేన్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా అందించారు. కొంత నెగిటివ్ రివ్యూలు వచ్చినా, సినిమా నిర్మాతకు వర్కవుట్ అయింది. హీరోకి మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు పవర్ పేట ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. విష్వక్ సేన్ తానే ఆ సినిమా చేయాలని ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా సంస్థ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసే అవకాశం వుంది.
కృష్ణ చైతన్యకు దర్శకుడు త్రివిక్రమ్ అండగా వున్నారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా వుంది. కానీ మరి ఒక భాగంగా చేస్తారా? రెండు భాగాలుగా కుదిస్తారా? మొదట అనుకున్నట్లు మూడు భాగాలా? ఇవన్నీ క్లారిటీ రావాల్సి వుంది.
విష్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. అవి పూర్తి అయిన తరువాత ఈ ప్రాజెక్ట్ వుండొచ్చు అని తెలుస్తోంది.