మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకొచ్చింది. ఈసారి ఆమె సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మాదకద్రవ్యాలు సేవిస్తూ, రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికినట్టు సమాచారం.
భారీగా డ్రగ్స్ తో ముంబయి నుంచి ఓ బ్యాచ్ హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు, గట్టి నిఘా పెట్టారు. ఐదుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా, వాళ్ల వద్ద 200 గ్రాముల కొకైన్ దొరికింది.
వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఎందుకంటే, తాజా తనిఖీల్లో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. అన్ని వివరాలతో ఒకేసారి మీడియా ముందుకురావాలని పోలీసులు భావిస్తున్నారు.
డ్రగ్స్ కేసులో గతంలోనే రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడు ఆమె సోదరుడి పేరు వెలుగులోకి వచ్చింది. లిస్ట్ లో మరింతమంది వీఐపీలున్నట్టు తెలుస్తోంది.