ప్రవీణ్ పూడి ఈ తరం సినిమా ఎడిటింగ్ లో అందెవేసిన చేయి. చంద్రబోస్ ఈ తరం రచయితలలో మాంచి విషయం వున్న రచయిత. విక్కీ జె మేయర్. తనదంటూ ఓ స్టయిల్, ఓ శైలి వున్న మ్యూజిక్ డైరక్టర్. ఇలాంటి హేమా హేమీలు జస్ట్ ఓ ఫ్రయివేటు వీడియో కోసం ఏకం అవుతున్నారు.
అలా అలా అని ఆ వీడియో ఎవరికీ అందుబాటులో వుండదు. ఓ ఫ్యామిలీ వీడియో అది. కేవలం అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు షేర్ అవుతుంది. అందుకోసం ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని, ఇలాంటి ది బెస్ట్ టెక్నీషియన్లను జోడించి తయారుచేయిస్తున్నారు.
ఇంతకీ ఏమిటా? వీడియో? ఏమిటా కథ?
ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరికి తన కూతురంటే ప్రాణం. ఆ మాటకు వస్తే ఏ తండ్రికైనా తమ కూతురు అంటే ప్రాణమే. అయితే నరేంద్ర చౌదరి, తన కుమార్తె పెళ్లి ఓ మరుపురాని తీపి అనుభవంలా వుండాలనుకున్నారు. అందుకోసం నభూతో.. అన్నట్లుగా పెళ్లి ఏర్పాట్లుచేసారు. భారీ ఇన్విటేషన్లు అందించారు. కోట్లు ఖర్చు చేసి సెట్టింగ్ లు వేసారు. విదేశాల నుంచి పువ్వులు తెప్పించి మండపాలు అలంకరించారు. ఆధునిక సాంకేతికత ఉపయోగించి ఆ పెళ్లి తంతును చిత్రీకరింపచేసారు.
అయితే మామూలుగా ఏదో సినిమా పాటలో, మ్యూజిక్ నో పెట్టేసి, ఎడిట్ చేయించేస్తే ఎలా? అందుకే ఇప్పుడు ఓ మాంచి టీమ్ ను సెట్ చేసి, ఆ వీడియోను తయారుచేయించే పనిలో వున్నారు. చంద్రబోస్ చేత మూడు పాటలు రాయించాలని అనుకుంటున్నారు. వాటికి, అలాగే విడియో నేపథ్య సంగీతానికి విక్కీ జె మేయర్ ను సంప్రదించే పనిలో వున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఎడిటింగ్ వర్క్ ను ప్రవీణ్ పూడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అయ్యాక, కేవలం తమ కుటుంబీకులు, బంధువలకు ఆ సీడీ లు సర్క్యులేట్ చేస్తారు. డబ్బుంటే సరిపోదు. అభిరుచి కూడా వుండాలి. నరేంద్ర చౌదరి దగ్గర అది పుష్కలంగా వుంది.