టాలీవుడ్‌లో ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఒక్కసారికి ఎవరికో ఏదో అయిడియా వస్తుంది. ఇక అందరూ అదే ఫాలో.. ఫాలో.. ఫాలో అంటారు. కామెడీ ఎంటర్ టైనర్‌లు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు, హర్రర్ ఎంటర్ టైనర్లు ఇలా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు టాప్ హీరోల అందరి దృష్టి యాక్షన్ సినిమాల మీద పడింది.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో కనీసం మూడుఫైట్లు అన్నా వుంటాయి. అది కామన్. అలా కాకుండా, అసలు ఫైట్లు, ఛేజింగ్‌లు కీలకంగా తీసుకుని సినిమాలు తయారవుతున్నాయి. దాదాపు ఇలాంటి సినిమాలు ఇప్పుడు అరడజనుకు పైగా టాలీవుడ్‌లో రెడీ అవుతున్నాయి. మళ్లీ అలా అని వీటిని అలా ఇలా తీసేయడం లేదు.
ప్రతి సినిమాకు భారీ బడ్జెట్‌లే. భారీ సెటప్‌లే. పైగా దాదాపు అన్నింటి విదేశీ ఫైట్ మాస్టర్లు పనిచేయడం మరో విశేషం. అంటే దీన్ని బట్టి ఈ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్‌లు ఏ రేంజ్‌లో వుండబోతున్నాయో, ఏ మేరకు కనువిందు చేయబోతున్నాయో ఊహించుకోవచ్చు.
పవన్-త్రివిక్రమ్
ఈ మధ్యకాలంలో పవన్ సినిమాల్లో యాక్షన్ ఫుల్ స్కేల్‌లో వుండడంలేదు. అన్ని జోనర్‌లు టచ్ చేస్తూనే ఫైట్లు కూడా జోడిస్తున్నారు. కానీ ఈసారి డైరక్టర్ త్రివిక్రమ్ ఫుల్‌లెంగ్త్ యాక్షన్ సినిమా చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.
పవన్‌లోని ఫన్ యాంగిల్ మిస్ కాకుండానే ఈ యాక్షన్ జోనర్‌ను సెట్ చేస్తున్నారు. అందుకోసం విదేశీ ట్రయినర్‌ను కూడా తీసుకువచ్చి, పవన్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంటే ఇక ఫైట్లు ఏ రేంజ్‌లో వుండబోతున్నాయో చూడాలి.
మహేష్ బాబు-మురుగదాస్
మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో స్పైడర్ సినిమా తయారవుతోంది. ఇది ఇంటిలిజెన్స్ ప్లేతో కూడుకున్న కథే అయినా, యాక్షన్ థ్రిల్లర్‌గానే వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా క్లయిమాక్స్ కోసమే చెన్నయ్‌లో భారీ సెట్ వేసారు. మహేష్ బాబు మరి ఏ రేంజ్ ఫైట్లు చేసాడో సినిమా విడుదలైతే గానీ తెలియదు.
బాలయ్య-పూరి
క్రేజీ డైరక్టర్ పూరిజగన్నాధ్ తొలిసారి మాస్ హీరో బాలకృష్ణతో సినిమా చేస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో విదేశీ నేఫథ్యంలో సాగే కథ ఇది. ఇందులో కూడా ఛేజింగ్‌లు, యాక్షన్ ఎపిసోడ్‌లు వీర లెవెల్లో వుంటాయని తెలుస్తోంది.
దీనికోసం ఏకంగా ఫారిన్ ఫైట్ మాస్టర్లను ఎంగేజ్ చేసారు. విదేశాల్లో భారీ చేజింగ్‌ల కోసం హెలికాప్టర్లు వాడారు. ఇంకా చాలా చాలా చేసారట. అవన్నీ సినిమా విడుదలయితే తెలుస్తాయంటున్నారు.
విక్రమ్ కుమార్-అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా రెండోసినిమా ప్రారంభమైంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీనే అంట. దీనికోసం ఇప్పటికి చిత్రీకరించిన ఫైట్లకే 12కోట్లు ఖర్చు చేసారట.చదీనికీ ఫారిన్ ఫైట్ మాస్టర్లు పనిచేసారు. ఇంకా మరి కొన్ని యాక్షన్ ఎపిసోడ్‌లు వున్నాయట. వీటన్నింటిని హాలీవుడ్ లెవెల్లో చిత్రీకరిస్తారట.
నితిన్-హను రాఘవపూడి
నితిన్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో లై అనే సినిమా తయారవుతోంది. ఈ సినిమా చాలావరకు అమెరికాలో షూటింగ్ జరపుకుంటోంది. దీనికి కూడా ఫారిన్ ఫైట్ మాస్టర్లు పనిచేసారు.
ఛేజ్, కొన్ని ఫైట్లు హాలీవుడ్ లెవెల్లో వుంటాయని తెలుస్తోంది. నితిన్ సినిమాల్లో ఇంత ఖర్చు, ఇంత భారీయాక్షన్ ఈ సినిమాలో అనే టాక్ వినిపిస్తోంది.
ప్రభాస్-సుజిత్
ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కానీ హీరో ప్రభాస్ సాహో సినిమా హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమా టైపు అని ఇప్పటికే ప్రచారం సాగిపోయింది. దీనికోసం చాలామంది ఫారిన్ టెక్నీషియన్లు పనిచేస్తారు.
అలాగే ఫారిన్‌లో కొన్ని ఫైట్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లు వుంటాయని తెలుస్తోంది. అందువల్ల ఇది పక్కా యాక్షన్ మూవీ అన్నమాట.
బన్నీ-లింగుస్వామి
ఈ సినిమాకు ఇంకా చాలాటైమ్ వుంది. ఈ సినిమాలోగా బన్నీ మరో సినిమా ఫినిష్ చేయాల్సి వుంది. కానీ లింగుస్వామితో చేయబోయే సినిమా ఫుల్ ఫైట్లతో అదిరిపోయేలా వుంటుందట.
లింగుస్వామి డైరక్టర్ అంటేనే మాస్ అండ్ ఫైట్లతో వుంటుంది వ్యవహారం. మరి బన్నీ కూడా తోడయితే చెప్పనక్కరలేదు. దానికి తోడు సబ్జెక్ట్ కూడా అలాంటిదే అయితే. యాక్షనే యాక్షన్.
యాక్షన్-ఫారిన్-విఎఫ్‌ఎక్స్
ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అన్నీ దాదాపుగా యాక్షన్ మోడ్‌లో సాగుతున్నాయి. అది కూడా ఫారిన్ టెక్నీషియన్లు, అలాగే వీలయినంత వరకు విఎఫ్‌ఎక్స్ హంగులు జోడించుకుంటున్నాయి.
దీంతో ఈ సినిమాల అన్నింటి బడ్జెట్ యాభైకోట్ల నుంచి నూరు, నూట పాతికకోట్ల రేంజ్‌లో వుంటోంది. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. సమ్‌థింగ్ ఎక్స్‌ట్రా లార్జ్ వుంటే తప్ప థియేటర్‌కు రావడంలేదు. అలాంటి సినిమా వస్తే వదలడం లేదు. బాహుబలి సిరీస్ రుజువు చేసిన సత్యం ఇదే. అందుకే హీరోలంతా ఈ బాట పట్టినట్లు కనిపిస్తోంది.
-ఆర్వీ