రోగ్.. మరో చంటిగాడి ప్రేమకథ. ఈ క్యాప్షన్ తోనే ఈ సినిమా ఏంటనే విషయాన్ని చెప్పేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. చంటిగాడు ఛాయల్లో సినిమా ఉంటుందనే విషయం తెలిసిపోతుంది. అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తే మాత్రం ఒక్క చంటిగాడే కాదు… శివమణి, చిరుత, ఇడియట్ సినిమాలతో పాటు మధ్యమధ్యలో లోఫర్ ను కూడా మిక్స్ చేశాడని అనిపిస్తోంది. ఈసారి పూరి కచ్చితంగా ఏదో మేజిక్ చేస్తాడని ఆశించిన అతడి హార్డ్ కోర్ అభిమానులకు సేమ్ పూరీనే రుచిచూపించాడు. అవే ఫైట్లు, అదే టేకింగ్… కాకపోతే గతంలో వచ్చిన సినిమా ట్రయిలర్స్ లా బ్యాక్ గ్రౌండ్ లో భయంకరమైన అరుపులు, పెడబొబ్బలు మాత్రంలేవు. బహుశా మ్యూజిక్ డైరక్టర్ తమన్ లేకపోవడం వల్ల ఈ విప్లవాత్మక మార్పు చోటుచేసుకొని ఉంటుంది.
ఓవరాల్ గా రోగ్ టీజర్ లో ఏమీలేదు. పాత ఫ్రేమ్స్ కే కొత్త ముఖాలు తగిలించారంతే. కొత్తబ్బాయ్ 'ఇషాన్' బాగానే ఉన్నాడు. వరుస ఫ్లాపులతో దూసుకెళ్తున్న మన్నారా చోప్రాకు ఈసారి మంచి క్యారెక్టర్ దక్కినట్టు కనిపిస్తోంది. మరో హీరోయిన్ ఏంజెలాను అందాలు చూపించడానికే పరిమితం చేసినట్టున్నారు. జ్యోతిలక్ష్మితో పూరికి దగ్గరైన సత్యదేవాకు మరో మంచి పాత్ర దక్కినట్టుంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఎలా ఉందో తెలియాలంటే ఆడియో ఫంక్షన్ వరకు ఆగాల్సిందే.
రోగ్ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలీదు కానీ, టీజర్ చూస్తుంటే మాత్రం కథలో కొత్తదనం కనిపించడం లేదు. అయితే ఇషాన్ ఎంట్రీకోసం నిర్మాత కమ్ తండ్రి సీఆర్ మనోహర్ భారీగానే ఖర్చుపెట్టాడని అర్థమౌతోంది.