భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాహుబలి- ది కంక్లూజన్ సినిమాకు సంబంధించి ఏ ఒక్క ఎలిమెంట్ ను మిస్ కాకుండా ప్రచారానికి వాడుకోవాలని ఫిక్స్ అయింది యూనిట్. టెక్నాలజీ పేరుచెప్పి ఇప్పటికే సగటు ప్రేక్షకుడికి దూరమైంది ఈ సినిమా. మరోవైపు బాహుబలి-2 ప్రాజెక్టుపై బజ్ తగ్గిందంటూ వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో సినిమాకు మరింత ప్రమోషన్ కల్పించేందుకు అల్టిమేట్ డెసిషన్ తీసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. కుదిరితే బాహుబలి-2 ఆడియో వేడుకను మాహిష్మతి సామ్రాజ్యంలో సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాడట.
మొన్నటివరకు ఈ సినిమా ఆడియోను విజయవాడ లేదా తిరుపతిలో విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చాయి. మరోవర్గం మాత్రం హైదరాబాద్ లోనే బాహుబలి-2 ఆడియో రిలీజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే జక్కన్న మాత్రం రామోజీ ఫిలింసిటీలో మాహిష్మతి సామ్రాజ్యం సెట్ లో ఆడియో రిలీజ్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట. ఇలా చేయడం వల్ల మరోసారి అందరి దృష్టిని ఆకర్షించినట్టు అవుతుందని రాజమౌళి ఫీలింగ్.
దీనికి తోడు ఉగాది సందర్భంగా మార్చి 28 లేదా 29న బాహుబలి-2 పాటల్ని విడుదల చేస్తే టైమింగ్ అదిరిపోతుందని కూడా భావిస్తున్నారు. త్వరలోనే పాటల విడుదల తేదీ, వేదికపై ఓ స్పష్టమైన ప్రకటన చేయబోతున్నాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.