చిత్రసీమకు కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. సినిమాలను రూపొందించడంలో కాపీలు కొట్టుకోవడం ఎప్పుడు మొదలైందో.. ఆ కాపీల అసలు కథలు వెలుగులోకి రావడం కూడా అప్పుడే మొదలైంది. అధికారికంగా కాపీ కొడితే సమస్య లేదు. అలాగే ఎక్కడో ప్రపంచ సినిమాల నుంచి తస్కరించినా భారతీయ సినిమాలను పట్టించుకునే వాళ్లు ఉండరు. అయితే.. ఎవరో రాసిన కథను ఏదో విధంగా వాడేసుకోవడంతోనే గొడవంతా! ఇలాంటి వాటిపై ఫిర్యాదుల లొల్లి మొదలైందంటే.. అది ఓ పట్టాన ముగియదు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి లొల్లి మొదలైతే.. సదరు సినిమాలు ఆగిపోవడం, లేదంటే సదరు వివాదం పెరిగి పెద్దది కావడం జరుగుతోంది.
ఒకవైపు తెలుగునాట ‘శ్రీమంతుడు’ సినిమా వివాదం కోర్టు వరకూ ఎక్కింది. ఈ సినిమా రూపకర్తలైన హీరోకి, దర్శకుడికి, నిర్మాతకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వారు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. తను ఒక వీక్లీకి రాసిన సీరియల్ ను ఆధారంగా చేసుకుని ‘శ్రీమంతుడు’ సినిమా రూపొందించారనేది ఫిర్యాదు దారుడు చేస్తున్న ఆరోపణ. అతడు రాసిన నవల కథాంశం ఏమిటో వివరిస్తూ.. దాన్ని స్వల్ప మార్పులు ఎలా చేసి.. సినిమాను రూపొందించారో ఆ రచయిత పూసగుచ్చినట్టు వివరిస్తున్నాడు. దీంతో అతడి వాదనకు విలువ దక్కుతోంది. ఇప్పటికే ‘శ్రీమంతుడు’ సినిమా వచ్చి చాలా కాలం అయినా.. కోర్టు అతడి ఫిర్యాదుకు విలువనిచ్చింది అంటే, విచారణకు అందరినీ పిలుస్తోందంటే.. కాపీ ఆరోపణలకు విలువ దక్కినట్టే.
ఎన్నో పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి కాపీ ఆరోపణలు వస్తూ ఉంటాయి. వాటిల్లో చాలా వరకూ కేవలం ప్రచార ఆర్భాటాలు మాత్రమే. ఇలాంటి వాటిల్లో ‘శ్రీమంతుడు’ మీద వచ్చిన ఆరోపణలు మాత్రం కోర్టుల నోటీసుల వరకూ వచ్చాయి. మరి ఈ వివాదాన్ని ఆ సినిమా యూనిట్ ఎలా ఎదుర్కొంటుంది, తాము కాపీ కొట్టలేదని ఎలాంటి నిరూపించుకుంటుంది? అనే అంశాలకు వేచి చూస్తే కానీ సమాధానం దొరకదు. ఒకవైపు తను రాసిన కథలకు వేరే వాళ్లు పేర్లు వేసుకున్నారు, తను రచన చేసిన సినిమాల క్రెడిట్ తనకు దక్కలేదు.. అని ఇది వరకూ వ్యాఖ్యానించిన కొరటాల శివ సినిమా విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం ఆసక్తికరమైన అంశం.
ఏ క్రెడిట్ తనకు దక్కలేదని ఈయన ఆవేధన చెందాడో.. అలాంటి క్రెడిట్ విషయంలో మరొకరికి అన్యాయం చేశాడా? వీక్లీ లో వచ్చిన సీరియల్ ను కథగా కూర్చి.. తన ఖాతాలో విజయాన్ని, బోలెడంత క్రెడిట్ ను వేసుకున్నాడా? అనే అంశాల గురించి కోర్టు విచారణ పూర్తి అయితే కానీ తెలియదు.
అయితే.. సదరు సీరియల్ రచయిత కు వచ్చిన ఆలోచనే యాధృచ్ఛికంగా కొరటాల అండ్ కంపెనీకి కూడా వచ్చి ఉండవచ్చు. ఈ సృజనలో వీళ్లిద్దరూ ఒకే రూట్లో వెళ్లి ఉండొచ్చు. బహుశా అదే జరిగి ఉండినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఈ వివాదం ఇప్పుడు కోర్టుకు ఎక్కింది.
అయినా.. నవలా సాహిత్యాన్ని చదివే అలవాటు ఉన్న వారికి వివిధ సందర్భాల్లో నవలకారులను సినిమా వాళ్లు కాపీ కొట్టిన విధానాలు స్పష్టంగానే అర్థం అవుతూ ఉంటాయి. ఉదాహరణకు మధుబాబు ‘యముడు’ అని రాసిన పాత నవల ఒకటి ఉంది. స్వాతిలో అది వీక్లిగా అచ్చయినట్టుంది. సదరు నవల లోని కొన్ని ఘట్టాలు మహేశ్ బాబు హీరోగా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘అతడు’ సినిమాలో కనిపిస్తాయి. పార్థూ వల్ల నష్టపోయిన ఒక పూజారి కుటుంబానికి మహేశ్ క్యారెక్టర్ ఆర్థిక సాయం చేయడం, అది డైరెక్ట్ గా చేయకుండా వాళ్లింటి పూల చెట్ల పొదల్లో డబ్బు పడేయడం… ఆ పని చేస్తున్నప్పుడు తన స్నేహితుడిని వెంట తీసుకెళ్లడం.. అది జరిగిన మరుసటి రోజు ఉదయం.. పూజారి వాళ్లింటికి రాముడూలక్ష్మణుడు మారువేషాల్లో వచ్చి ఆర్థిక సాయం చేశారని ఊరంతా అనుకోవడం.. ఈ ఎపిసోడ్ అంతా యాజిటీజ్ గా మధుబాబు నవల ‘యముడు’లో ఉంటుంది. ఆ నవలలో కూడా హీరో క్యారెక్టర్, అతడి స్నేహితుడి క్యారెక్టర్ల మధ్య ఈ సన్నివేశం యథాతథంగా ఉంటుంది. మధుబాబు నవల ఎప్పుడో 90లలో వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా 2005లో వచ్చినట్టుంది.
మరి త్రివిక్రమ్ కాపీ కొట్టాడా? అంటే ఔనని అనాలా, కాదని అనాలా? ఇది కో ఇన్సిడెన్సా లేక కాపీనా? అనేది తేల్చడం అంత సులభం కాదు. ‘అతడు’ సినిమా కథాంశంలో కూడా వెంకటేష్ నటించిన ‘వారసుడొచ్చాడు’ సినిమాకు చాలా పోలికే ఉంటుంది. చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయిన వేరే కుర్రాడి స్థానంలో హీరో ఎంట్రీ ఇస్తాడు. వాళ్లింట్లో పరిస్థితులను సరిజేస్తాడు. రెండు సినిమాల్లోనూ పారిపోయిన కుర్రాడు అప్పటికే మరణించి ఉంటాడు. అలాగే ‘అతడు’ లో సీన్ల చిత్రీకరణలోనూ హాలీవుడ్ సినిమాలను అనుకరించిన తీరు అందరికీ తెలిసిందే. చిత్రీకరణకు సంబంధించిన కాపీలకు వీడియో ఆధారాలను కూడా అందిస్తారు నెటిజన్లు.
ఈ కాపీలను కనుగోవడంలో నెటిజన్లు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంటారని వివరించనక్కర్లేదు. ఒక సినిమా పోస్టర్ విడుదల కాగానే.. అదే సినిమాకు కాపీ.. అనే అంశం గురించి ప్రచారం మొదలవుతూ ఉంటుంది. ఇటీవల జయం రవి తమిళ సినిమా ‘భోగన్’ విషయంలోనూ ఇదే జరిగింది. దీని కాపీ కహానీ పెద్దగానే ఉంది. ఈ సినిమా పోస్టర్లు విడుదల కాగానే.. వాటిని చూసి ఇది హాలీవుడ్ సూపర్ హిట్ ‘ఫేస్ ఆఫ్’ కు కాపీ అనే ప్రచారం మొదలైంది.
రెండు దశాబ్దాల కిందటే వచ్చిన ఆ సినిమాను తమిళంలో ఇప్పుడు కాపీ కొడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. విలన్ స్థానంలోకి హీరో, హీరో స్థానంలోకి విలన్ ట్రాన్స్ ఫర్ అయ్యే కథే.. ‘ఫేస్ ఆఫ్’. ఇదే సినిమాను తెలుగులో ఎప్పుడో కాపీ కొట్టి తీశారు. అందులో కృష్ణ హీరో. ఆ సినిమా పేరు ‘మానవుడు దానవుడు’. ఫేస్ ఆఫ్ 1997 లో రాగా మానవుడు-దానవుడు 1999 లో వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ తెలుగు వెర్షన్ కు దర్శకుడు కూడా!
మరి మనోళ్లు అప్పుడే కాపీ కొడితే.. తమిళులు ఇప్పుడు కాపీ కొట్టినట్టున్నారు. ఆ ప్రచారం అలా ఉండగానే.. ఆ సినిమా కథ తనది అని ఒక యువ రచయిత మీడియాకు ఎక్కాడు. జయం రవి – అరవింద్ స్వామిల కాంబినేషన్ లో ‘తనీ ఒరువన్’ వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సినిమాపై భారీ అంచనాలుండినాయి. ఈ ‘భోగన్’ సినిమాకు ప్రభుదేవ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరి అంతటి క్రేజీ సినిమా విషయంలో ఒక రచయిత కాపీ ఆరోపణలు చేయడం సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.
అతడు చేసిన ఆరోపణ ఏమనగా.. కొన్నాళ్ల కిందట ఈ సినిమా కథతో తను సినిమాను ఆరోపించాడని అతడు చెప్పాడు. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆ సినిమా అంతటితో ఆగిపోయిందని, ఆ తర్వాత దాన్ని పట్టాలెక్కించడనికి తను కొంతమందికి ఈ కథను వినిపించాను అని.. అలా పొక్కిన తన కథను ‘బోగన్’ గా తెరకెక్కిస్తున్నారని ఆ రచయిత ఆరోపించాడు. దీనిపై తమిళ సినీ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదంతపై దర్శకుడు విక్రమన్ ఆధ్వర్యంలో విచారణ కూడా మొదలైంది!
ఈ విచారణలో తేలింది ఏమిటంటే.. ‘బోగన్’ సినిమా అసలు క్రెడిట్ ఆఫ్రికా వాళ్లది అని! ఈ సినిమా కథ ఒక ఆఫ్రికన్ సినిమా నుంచి కాపీ కొట్టారని.. విక్రమన్ ప్రకటించాడు! ఈ విషయం గురించి అసలు కథను విక్రమన్ కూలంకషంగా వివరించాడు. ఈ సినిమా కథ నాది అంటున్న.. రచయిత ఒక ఆఫ్రికన్ సినిమాను చూసి దాన్ని తయారు చేసుకున్నాడు. సినిమాను ఆరంభించాడు.. అది పూర్తి కాలేదు. ఆ తర్వాత బోగన్ యూనిట్ అదే ఆఫ్రికన్ సినిమాను చూసింది. దాన్నుంచి కథను కాపీ కొట్టి.. తమ సినిమాకు కథగా చేసుకుంది!
ఈ విధంగా ఇద్దరు దొంగలూ బయపడ్డారు. ఆరోపణలు చేస్తున్న రచయితా కాపీ కొట్టాడు, బోగన్ సినిమా యూనిట్టూ కాపీ కొట్టింది. అసలు క్రెడిట్ ఎవరో ఆఫ్రికన్ వాళ్లకు దక్కాల్సింది. ఇదంతా విక్రమన్ ప్రకటించిందే! దీంతో వివాదం సద్దుమణిగింది. ఎవ్వరూ మారు మాట్లాడలేకపోయారు.. సూది కోసం సోదికెళితే.. పాత రంకంతా బయటపడినట్టుగా మారిందక్కడ పరిస్థితి. అయినా పెద్ద పెద్ద స్టార్ హీరోలను పెట్టుకుని, గ్లామరస్ హీరోయిన్ల ను కలిగి ఉండి.. కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతూ.. కావాల్సినంత క్రేజ్ ను కలిగి ఉండి, సినిమాలపై హైప్ ను కలిగి ఉండి.. కథ విషయంలో ఇలాంటి అడ్డదారులు తొక్కడం ఏమిటో! అన్నీ ఉన్నా.. ఇలాంటి పనులతో పరువు పోగొట్టుకోవడం ఏమిటో ఈ సినిమా వాళ్లు!