మహర్షి సినిమా ఇప్పటికే 3 గంటలుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్ చాలా ఎక్కువగా ఉందనే భావనను చాలామంది వ్యక్తంచేశారు. ఇలాంటి సినిమాకు అదనంగా మరికొన్ని సన్నివేశాలు జత చేస్తే పరిస్థితి ఏంటి? సరిగ్గా అలాంటి ప్రయోగాన్నే చేయబోతోంది మహర్షి యూనిట్.
అవును.. ఈ వీకెండ్ లేదా వచ్చేవారం నుంచి మహర్షి సినిమాకు అదనంగా మరికొన్ని సన్నివేశాలు జతచేయాలని నిర్ణయించారు. తొలి అర్థభాగంలో ఒక సీన్, మలి అర్థభాగంలో 2 సన్నివేశాల్ని అదనంగా చొప్పించాలని అనుకుంటున్నారు. ఇలాచేయడం వల్ల సినిమా నిడివి మరో 10 నిమిషాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అచ్చంగా సినిమా రన్ టైమ్ 188 నిమిషాలు అవుతుంది.
సినిమా ఫస్టాఫ్ లో వచ్చే పెళ్లిచూపులు సీన్ మహేష్ కు చాలా ఇష్టమట. నిజానికి ఆ సీన్ 3 నిమిషాలకు పైగా ఉంది. కానీ రన్ టైమ్ పెరిగిపోతోందని నిమిషానికి కుదించారు. మహేష్ ఆదేశాలతో ఇప్పుడా సీన్ ను యథాతథంగా చూపించబోతున్నారు. ఇక సెకెండాఫ్ లో అల్లరి నరేష్-మహేష్ మధ్య వచ్చే ఓ సన్నివేశంతో పాటు.. రైతులతో మహేష్ మాట్లాడే మరో సీన్ ను కూడా యాడ్ చేస్తారట.
మహర్షికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. వర్కింగ్ డేస్ లో ఈ సినిమా ఎలా నిలబడుతుందో చూడాలని అంతా వేచి చూస్తున్నారు. ఇప్పటికే సోమవారం వసూళ్లు తగ్గాయి. ఇవాళ్టి నుంచి వీకెండ్ వరకు వసూళ్లు మందకొడిగానే సాగే సూచనలు కనిపిస్తున్నాయి.