ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ పేరు ఇప్పుడు టాలీవుడ్ వార్తల్లో తెగ మారుమోగిపోతోంది. థాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి. అయితే ఈ సినిమా మీద మరెవరి కన్నూ పడలేదా? త్రివిక్రమ్ మాత్రమే దీన్ని పసికట్టారా? అన్న అనుమానం వస్తే, లేదని సమాధానం వస్తోంది.
ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. అందుకే ఆల్ ఇండియా రైట్స్ టీ సీరీస్ సంస్థ కొనేసింది. ఇదే లైన్ ను కాస్త తీసుకుని కొరటాల శివ కూడా మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారని టాక్ వుంది.
అయితే వీళ్లందరికన్నా ఈ లార్గో వించ్ సినిమా మీద కన్నేసిన తెలుగు డైరక్టర్ లు వున్నారట. వాళ్లలో అందరి కన్నా ముందుగా వున్నది సురేందర్ రెడ్డి అంట. అతగాడు బన్నీ కోసం ఈ లైన్ తో మాంచి కథను తయారుచేసే పనిలో పడ్డాడట. బన్నీకి లైన్ కూడా చెప్పాడట అప్పట్లో.
అయితే డైరక్టర్ సుకుమార్ కూడా ఇదే సినిమా లైన్ తో ఏదో చేస్తున్నారని అప్పట్లో తెలిసిందట. నాన్నకు ప్రేమతో అంటూ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేస్తే, ఈ లైన్ నే ఏదో చేస్తున్నారని అనుకుని, సురేందర్ రెడ్డి డ్రాప్ అయిపోయాడంట. అయితే సుకుమార్ కేవలం తండ్రి కోసం పగ తీర్చుకోవడం అన్నది మాత్రమే తీసుకుని తను స్వంతంగా కథ అల్లుకున్నారు. అది తెలియక ఎందుకులే అని సురేందర్ రెడ్డి ఆగిపోయారని తెలుస్తోంది. లేదూ అంటే, ఈపాటికి బన్నీతో ఇదే కథ వచ్చేదన్నమాట.
మొత్తంమీద కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు తీసుకునే మన దర్శకులు కథలు అల్లడంలో మాత్రం పూర్తిగా వీక్ అని అర్థం అవుతోంది. ఎక్కడో ఎదో ఇన్సిపేరేషన్ వుండాలి. వుంటే అది పట్టకుని, పదికోట్లు, పదిహేనుకోట్లు రెమ్యూనిరేషన్ లాగేస్తారు.