దర్శకుడు త్రివిక్రమ్ చేసిన పని వల్ల హారిక హాసిని సంస్థ ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాల్లోంచి సీన్లు ఎత్తేయడంలో ఘనాపాఠి అయిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి ఏకంగా ఓ విదేశీ సినిమా లైన్ ఎత్తేసారని మొదట్నించీ గుసగసులు వినిపిస్తున్నాయి.
అజ్ఞాతవాసి సినిమా వ్యవహారం తెలిసి కూడా ఒరిజినల్ సినిమా హక్కులు తీసుకున్న టీసీరీస్ సంస్థ గుంభనంగా వుంటూ వచ్చింది. సరిగ్గా విడుదల ముందు పేచీకి దిగింది. కోర్టు నోటీసులతో పాటు, చాంబర్ లో పంచాయతీ పెట్టింది.
అయితే ఈ పంచాయతీ అలా ఇలా లేదు. ఒకపక్క టీ సీరీస్ తో సన్నిహిత సంబంధాలు వున్న హీరో రానా డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క చాంబర్ లో పంచాయతీ నడుస్తోంది. టీ సిరీస్ సంస్థ టోటల్ గ్రాస్ సేల్ లో పదిశాతం తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అంటే సుమారు 15కోట్లు అన్నమాట. ఇంత మొత్తం వదులుకోవడం అంటే ఇక రెండేళ్ల కష్టం హుష్ కాకి అవుతుంది.
అయితే విడుదల ముందు తకరారు పడేకన్నా, కొంత లమ్ సమ్ మొత్తం ఇచ్చేందుకు హారిక హాసిని సంస్థ లోపాయికారీ డిస్కషన్లు సాగిస్తున్నట్లు వినికిడి. అయిదుకోట్ల వరకు అయితే ఓకె అని అనేసినట్లు ఫీలర్లు వినిపిస్తున్నాయి.
మరోపక్క దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ డీల్ కు సుముఖంగానే వున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ మొత్తం తన రెమ్యూనిరేషన్ లోంచి తగ్గించుకోమని ఆయన చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అ..ఆ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇలాంటి ఆఫర్ నే ఇచ్చినట్లు తెలుస్తోంది.