పవన్ కళ్యాణ్ మళ్లీ హైదరాబాద్ వచ్చేసారు. ఆంధ్రులను నానా ఇబ్బందులకు గురిచేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, భయభ్రాంతులను చేస్తున్న హైదరాబాద్ కే ఆయన వచ్చేసారు. గప్ చుప్ గా వచ్చి, ఇంట్లోకి చేరి మూడు నాలుగు రోజులు అవుతోందని బోగట్టా. ఎన్నికల కోసం పెంచిన గెడ్డం లుక్ తీసేసారు. నీట్ గా తయారయ్యారు. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.
పవన్ బాబేనా గూట్లోకి చేరుకున్నది, చంద్రబాబు, జగన్ కాదా? అని ఎవరైనా అడిగేయచ్చు. కానీ బాబుగారి సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్లు, హడావుడి హైరానా. ఇక జగన్ కూడా ఎన్నికలు ముగియగానే ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే ప్రశాంత్ కిషోర్ కు వీడ్కోలు చెప్పారు. పార్టీ సభ్యులతో, బాధ్యులతో డిస్కషన్లు సాగించారు. మరోపక్క ఢిల్లీలో ఇసితో పార్టీముఖ్యులు భేటీ అవుతున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ అస్సలు ఓ ప్రకటన లేదు., మీడియా మీట్ లేదు. మరేమీలేదు. సైలంట్ గా ఇంట్లోకి వచ్చేసారు. గాజువాకలోనే వుంటానని ఇల్లు తీసుకున్నది అలాగే వుంది. భీమవరం సంగతి సరేసరి. అమరావతిలో ఆవులు దూడలు ఇల్లు అలాగే వుంది. అలా ఆంధ్ర అంతా వదిలేసి, మళ్లీ ఆంధ్రులను ఇబ్బంది పెడుతున్నారని ఎలుగెత్తి చాటిన తెలంగాణకే ఆయన చేరారు. పాపం, ఎన్ని ఇబ్బందులు పడాలో? ఎన్నిదౌర్జన్యాలకు గురి కావాలో? అని అభిమానులు ఆందోళన చెందుతారేమో?
ఇదిలావుంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక, అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తరువాత ఎప్పుడు సినిమా చేసేదీ నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. తన ప్రియనేస్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లోనే ఈ సినిమా వుండబోతోందని తెలుస్తోంది. అయితే అది ఇప్పుడేకాదు, డిసెంబర్ టైమ్ లో అని తెలుస్తోంది.