‘ఆగడు’ చిత్రం చూసి ‘గబ్బర్‌సింగ్’లానే ఉందంటూ ప్రేక్షకులు తిరస్కరించారు. త్వరలో రాబోతున్న మరో సినిమా వాలకం చూస్తుంటే దీనికి కూడా ‘గబ్బర్‌సింగ్’ క్యారెక్టరైజేషనే హెవీ ఇన్‌స్పిరేషన్ అనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ ట్రెయిలర్స్, హీరో క్యారెక్టర్ అన్నీ ‘గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ టైప్ రౌడీ పోలీస్ పాత్రలు గతంలోను వచ్చినా కానీ ‘గబ్బర్‌సింగ్’తో తనదైన ముద్ర వేసాడు పవన్‌కళ్యాణ్.
కళ్యాణ్‌రామ్ తెలివిగా దీనిని ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ తరహా చిత్రమన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాలోని పాట రీమిక్స్ కూడా చేసి పెట్టారు. అయినప్పటికీ ‘గబ్బర్‌సింగ్ 3’లా ఉందనే టాక్ బయట వినిపిస్తోంది. అన్నట్టు ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఆగడు’కి కూడా రచయితగా పని చేసాడు. మొత్తానికి ఈ దర్శకుడిపై గబ్బర్‌సింగ్ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్టుంది.
చాలా పరాజయాలు ఎదుర్కొని, నిర్మాతగా భారీ నష్టాలు చవిచూసిన కళ్యాణ్‌రామ్ ‘పటాస్’తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ‘పటాస్’ చిత్రం నందమూరి అభిమానుల అటెన్షన్ రాబట్టుకోవడంలో ఆల్రెడీ సక్సెస్ అయింది. ఇక మిగిలిన ప్రేక్షకులు కూడా దీనిని గబ్బర్‌సింగ్ నకలుగా ముద్ర వేయకుండా ఎంటర్‌టైన్ అయినట్టయితే కళ్యాణ్ కల తీరిపోతుంది.