రచయిత కోన వెంకట్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మౌనాన్ని ఆసరాగా తీసుకుని, కొందరు జోకర్లు రెచ్చిపోతున్నారు అనే అర్థంవచ్చేలా ఆయన ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ పై మహేష్ కత్తి అనే సోషల్ ఏక్టివిస్ట్ చేస్తున్న ట్విట్టర్ పోరాటానికి టాలీవుడ్ వైపు నుంచి ఇదే తొలి స్పందన అనుకోవాలి.
పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకు పడడమే తప్ప, ఎవ్వరూ ఇంతవరకు ఇందులో తలదూర్చలేదు. అయితే పవన్ ఫ్యాన్స్ ఇలా విరుచుకు పడుతుంటే, పవన్ వారిని వారించడంలేదు కనుక, తనకు ఎవరూ సుద్దులు చెప్పక్కరలేదని, తన పోరాటం తాను చేస్తానని కొద్దిరోజుల ముందే మహేష్ కత్తి స్పష్టంచేసారు.
అంతకు ముందుగానీ, తరువాత గానీ మీడియాలో హడావుడే తప్ప, సినిమా జనాలు ఎవరూ స్పందించిన దాఖలాలులేవు. ఇలాంటి టైమ్ లో రచయిత కోన వెంకట్ ఈ ట్వీట్ చేయడం కాస్త ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ట్వీటు ఊపుతో కోన శిష్యబృందం కానీ, మరెవరైనా కానీ పవన్ కు మద్దతుగా ముందుకు దూకుతారేమో చూడాలి.