ఫ్లాప్ వేరు.. డిజాస్టర్ వేరు.. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా డబుల్ డిజాస్టర్ అనే మరో పదం పుట్టుకొచ్చింది. సునీల్ నటించిన 2-కంట్రీస్ సినిమా ఈ కోవకు చెందుతుంది. తాజాగా విడుదలైన ఈ రీమేక్ మూవీ డబుల్ డిజాస్టర్ అనే పేరుతెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఏరియాలో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో 40శాతం వసూళ్లు కూడా రాలేదు. ఇక ఓవర్సీస్ సంగతి సరేసరి.
2-కంట్రీస్ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా ఆరిపోయారు. థియేటర్లలో నడుస్తున్న ఈ సినిమాను ఎత్తేయలేక, మరో సినిమా తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించిన ఎన్.శంకర్ కు కూడా భారీనష్టాలు తప్పలేదు.
సునీల్ కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన ఫ్లాపులు ఒకెత్తు. 2 కంట్రీస్ మరోఎత్తు. అతడి కెరీర్ లో ఎన్నో ఫ్లాపులున్నాయి. కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ మాత్రం ఇదే. ఈ సినిమా దెబ్బతో సునీల్ ఇక హీరో వేషాలకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. వీకెండ్ తో పాటు జనవరి 1 కలిసొచ్చినా సినిమా తేరుకోలేదంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.
2-కంట్రీస్ విడుదలకు ముందే హీరోగా 2 సినిమాల్లో నటించేందుకు అడ్వాన్సులు తీసుకున్నాడు సునీల్. ఇప్పుడీ సినిమా దెబ్బతో, ఆ 2 సినిమాలు తీస్తాడా.. లేక అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. అటు సునీల్ కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో మిరాకిల్ జరిగితే తప్ప సునీల్ కు హిట్ రావడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది.