నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే…అన్న కవితలాగే వుంటుంది, జర్నలిస్ట్ నుంచి నిర్మాతగా ఎదిగిన మహేష్ కోనేరు జీవితం. ఇటీవల గుండెపొటుతో మరణించిన విశాఖ నుంచి హైదరాబాద్ కట్టుబట్టలతో వచ్చాడు. ఓ వెబ్ సైట్ లో జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు.
దర్శకుడు రాజమౌళి స్టార్ట్ చేసిన వెబ్ సైట్ లో చేరాడు. అక్కడి నుంచి ఆయన అనుగ్రహం పొంది, ఆయన 'బాహుబలి' సినిమాకు పీఆర్వోగా మారాడు. మంచి పీఆర్వో అనిపించుకున్నాడు. అక్కడితో హీరో ఎన్టీఆర్ కు దగ్గరయ్యాడు. కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ఫ్యామిలీ కి బాగా సన్నిహితుడు అయ్యాడు.
కళ్యాణ్ రామ్ డేట్ లు ఇవ్వడంతో నిర్మాతగా మారాడు. నా నువ్వే, 118, తిమ్మరసు, మిస్ ఇండియా సినిమాలు నిర్మించాడు. నాగశౌర్య, అల్లరి నరేష్, సందీప్ కిషన్ లతో మూడు సినిమాలు ఒకేసారి ప్లాన్ చేసాడు. ఇదంతా ఇలా వుండగా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా సక్సెస్ లు చవిచూసాడు. తీసిన సినిమాలు కావచ్చు, చేస్తున్నవి కావచ్చు, అన్నీ కలిపి 100 కోట్ల టర్నోవర్ లేదు.
కానీ ఇప్పుడు వింటున్న వార్తలు చూస్తుంటే దాదాపు 80 కోట్ల అప్పు వున్నట్లు లెక్క తేలుతోంది. ఇదే అతి పెద్ద చిదంబర రహస్యం. మహేష్ కోనేరు ఎంత మృదు స్వభావో, ఎంత సంస్కారవంతంగా వ్యవహరిస్తూ, ఎంత మంచిగా మాట్లాడే మనిషి అన్నది జర్నలిస్ట్ లు అందిరికీ తెలుసు. ఇండస్ట్రీకి తెలుసు.
అందుకే మహేష్ కోనేరు ను అందరూ నమ్మారు. ఎవరు పడితే వారు అప్పులు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాళ్లలో ఫైనాన్సియర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, జర్నలిస్ట్ లు, ఇండస్ట్రీలో పని చేసేవారు, బంధువులు ఇలా సమస్త జనాలు వున్నారు అని వార్తలు వినవస్తున్నాయి.
యాభై కోట్ల వర్త్ సినిమాలు చేసి, మరో యాభై కోట్ల వర్త్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి, ఎక్కడా పట్టుమని ఒకటి రెండు కోట్లకు మించి నష్టాలు పొందని ఓ చిన్న నిర్మాత 80 కోట్ల మేరకు అప్పులు చేసి, చనిపోవడం అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో పెద్ద డిస్కషన్ పాయింట్ అయిపోయింది.
ఇన్ని కోట్ల రూపాయలు ఏమై వుంటాయి. ఎక్కడన్నా ఆస్తులు కొన్నాడా? కొంటే ఎక్కడ? ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ మొత్తం అంతా ఎక్కడికి వెళ్లిపోయింది. ఏ ఒక్క చెడు అలవాటు లేని వ్యక్తి. అలవాట్లు వుండి వుంటే అక్కడకు పోయాయి డబ్బులు అనుకోవచ్చు. అలాంటి అవకాశం లేదు.
ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర అప్పులు చేయడం వల్లనే ఇన్ని కోట్ల అప్పులు చేరాయి. ఇండస్ట్రీలో ఇలా దాచి అప్పులు చేయడం అన్నది చాలా కష్టం. సింపుల్ గా సర్క్యులేట్ అయిపోతాయి. కానీ ఇక్కడ అస్సలు తెలియలేదు. మహేష్ కోనేరుకు అత్యంత సన్నిహిత వ్యక్తులు కూడా ఇది తెలియకే కోట్లకు కోట్లు కోల్పోయారు.
ఇలా కోల్పోయిన వారి అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న ఒక్కటే ఇన్ని పదుల కోట్లు ఎక్కడికిపోయాయి? కోనేరు కలిసిన కోట్లు ఎక్కడ ఆస్తులుగా మారాయి? అసలేం జరిగింది? ఇదే అసలు సిసలు రహస్యంగా మిగిలిపోయింది ప్రస్తుతానికి.