'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కథ ఏంటి.? కమామిషు ఏంటి.? అన్న అంశంపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇది పూర్తిగా, లక్ష్మీపార్వతి కోణంలో వుండబోతోంది. అవును, స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి గతంలో రాసిన ఓ పుస్తకం ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రూపొందబోతోంది.
ఆగండాగండీ.. అప్పుడే ఈ విషయమై ఓ నిర్ధారణకు వచ్చేయకండి. ఎందుకంటే, ఇది రామ్‌గోపాల్ వర్మ సినిమా. ఆయన చెప్పేది చేయడు.. చేసేది చెప్పడు. ఏదో చేస్తానని చెప్పి, ఇంకోటేదో చెయ్యడం రామ్‌గోపాల్ వర్మకి అలవాటే. కాబట్టి, ప్రస్తుతానికి లక్ష్మీ పార్వతి తాను చెప్పినట్టే వర్మ తీస్తున్నాడని అనుకోవడం మినహా.. అందులో ఏముండబోతోందో ఆమెకు తెలియదన్నమాట. 'లక్ష్మీపార్వతికి ఈ సినిమా కథ చెప్పారా.?' అని వర్మని ఓ సందర్భంలో ప్రశ్నిస్తే, 'ఆ ఛాన్సే లేదు' అనేశాడు.
లక్ష్మీపార్వతి మాత్రం, తాను రాసిన పుస్తకం ఆధారంగానే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్నాడు' అంటూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. ఎవరూ ఊహించనంత వేగంగా ఈ సినిమాని వర్మ రూపొందించేయడానికి ముందే ప్లాన్ వేసుకుని, సినిమాకి కావాల్సినంత హైప్ తీసుకొచ్చేందుకోసం.. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ నేతలతో సోషల్ మీడియా వేదికగా 'రచ్చ' చేసిన విషయం విదితమే.
స్వర్గీయ ఎన్టీఆర్, చివరి రోజుల్లో లక్ష్మీపార్వతిని వివాహమాడారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాకనే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. లక్ష్మీపార్వతి అంటే గిట్టని చంద్రబాబు, అత్యంత వ్యూహాత్మకంగా ఎన్టీఆర్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నారు. ఇదీ జరిగిన కథ. ఇదే, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో మెయిన్ ఎలిమెంట్. దానికి వర్మ ట్రీట్‌మెంట్ ఎలా వుంటుందో.. ఈ సినిమాతో 'వాస్తవాలు' అందరికీ తెలుస్తాయంటోన్న లక్ష్మీపార్వతి ఆశలు ఏమవుతాయో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.
అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్