‘మా’ ఎన్నికల్లోనూ హామీలండోయ్

ఎన్నికలు ఎక్కడైనా ఎన్నికలే. హామీలు తప్పవు..పోటీలు తప్పవు. టాలీవుడ్ నటీనటుల సంఘ మా ఎన్నికల్లో కూడా ఇప్పుడు హామీలు చోటు చేసుకుంటున్నాయ్. నిన్న మొన్నటి దాకా మా అధ్యక్ష పదవి ఏక గ్రీవం అవుతుందని,…

ఎన్నికలు ఎక్కడైనా ఎన్నికలే. హామీలు తప్పవు..పోటీలు తప్పవు. టాలీవుడ్ నటీనటుల సంఘ మా ఎన్నికల్లో కూడా ఇప్పుడు హామీలు చోటు చేసుకుంటున్నాయ్. నిన్న మొన్నటి దాకా మా అధ్యక్ష పదవి ఏక గ్రీవం అవుతుందని, తానే అధ్యక్షుడిని అవుతానని సంబర పడ్డారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు రెగ్యులర్ గా అధ్యక్షుడిగా వుంటూ వస్తున్న మురళీమోహన్ మళ్లీ పోటీకి దిగుతున్నారని వార్తలు అందాయి. 

దాంతో ఆయన ఖంగుతిన్నారు. గోదాలోకి దిగిన తరువాత వెనకడుగు వేస్తే, చిన్నతనం అవుతుంది. అలా అని ఓడిపోతే (ఇది రెండోసారి అవుతుంది) పరువు పలుచనవుతుంది. అందుకే ఆయన మెగా క్యాంప్ అండ కోరుతున్నట్లు కనిపిస్తోంది. చిరు సోదరుడు నాగబాబు ఇప్పుడు బహిరంగంగా రాజేంద్రుడికి మద్దతు పలికారు. 

అంటే, మా ఎన్నికల్లోనూ సామాజిక వర్గాల ఫ్యాక్టర్ పనిచేసేలా కనిపిస్తోంది. ఇదిలా వుంటే గతంలో ఆర్ధిక స్థోమత లేని కళాకారులు పాతిక మందికి నెలనెలా పింఛను ఇచ్చేవారని, అది ఒక్కటికి వచ్చేసిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 

అంటే ఏమిటని అర్థం..మా ప్రస్తుత కార్యవర్గం పేద కళాకారులను ఆదుకోవడం లేదనేగా. తాను అధ్యక్షుడిని అయితే యాభై మందికి పింఛను ఇస్తానని ఆయన ప్రకటించారు. అంతే కాదు. అంతకన్నా ఎక్కువ మందికి ఇస్తామని ఎవరైనా అంటే, తాను పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. ఇప్పుడు మురళీ మోహన్ కానీ మరొకరు కానీ 60 మందికి ఇస్తామంటే, రాజేంద్రడు ఏమవుతారో? ఇంకా ఎన్ని ఎన్నికల హామీలు వస్తాయో?