క్వార్టర్ ఫైనల్స్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ వరల్డ్ కప్‌లో విజయాల పరంపరను కొనసాగిస్తూ, టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా, వరల్డ్ కప్‌కి రెండడుగులో దూరంలో నిలిచి వుందిప్పుడు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. 303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, 45 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా అర్థ సెంచరీని సైతం చెయ్యలేకపోయారంటే టీమిండియా బౌలర్లు ఎంత పక్కాగా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
భారత బౌలింగ్ విషయానికొస్తే, 9 ఓవర్లు వేసిన ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు నేలకూల్చాడు. మహ్మద్ షమి, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, మోహిత్ శర్మ ఒక వికెట్ తీసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఈ వరల్డ్ కప్‌లో ఏడో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది.
కాగా, ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడమే కాకుండా, అన్ని మ్యాచ్‌లలోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఘనతను నిలబెట్టుకుంది టీమిండియా. 137 పరుగులు చేసి, టీమిండియా భారీ స్కోర్ చేయడానికి కారణమైన రోహిత్‌శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.