ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ, ఆ తర్వాత ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ టీమిండియా ఘోర వైఫల్యాన్ని చూసి భారత క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఈ జట్టు వరల్డ్ కప్‌లో లీగ్ దశను దాటడం చాలా కష్టం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అతి చెత్త పెర్ఫామెన్స్‌తో లీగ్ దశలోనే టీమిండియా వెనక్కి రావడం ఖాయమని వరల్డ్‌కప్‌కి ముందు అనుకోని క్రికెట్ అభిమాని మన దేశంలోనే వుండడేమో అనుకోవడం అతిశయోక్తి కాదు.
కానీ, ఆ అనుమానాలు పటా పంచలయ్యాయి. ఈ వరల్డ్ కప్‌లో లీగ్ దశలోని తొలి మ్యాచ్ నుంచి, క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగిన తాజా మ్యాచ్ దాకా టీమిండియా పెర్ఫామెన్స్ అన్ని రంగాల్లోనూ అద్భుతం. ఏదో జరిగింది. ఎవరో మార్చారు. లేకపోతే టీమిండియా ఆటగాళ్ళలో ఈ క్రమశిక్షణ అసాధ్యం.. అన్నది చాలామంది అభిప్రాయమిప్పుడు. ఎవరో మార్చారో, లేదంటే డిఫెండింగ్ ఛాంపియన్ హోదా తెచ్చిన కసి వల్లనో.. కారణం ఏదైతేనేం, వరల్డ్ కప్‌లో టీమిండియా అంచనాలకు మించి రాణిస్తోంది.
టీమిండియా ఓ సారి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ఆశ్చర్యకరం.. అనేంత పతన స్థాయిలో టీమిండియా బౌలింగ్ వుండేది. మరి ఇప్పుడో.. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. వరసగా ఏడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఏడు మ్యాచ్‌లలో డెబ్భయ్ వికెట్లు.. ఏ జట్టుకీ సాధ్యం కాని ఫీట్ ఇది. జహీర్‌ఖాన్ లాంటి అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ లేడు.. కుంబ్లే లాంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లేడు.. యువరాజ్‌సింగ్ లాంటి ఆల్‌రౌండర్ అసలే లేడు. అయినా టీమిండియా బౌలింగ్‌లో అద్భుతాలే చేసింది. ఓ మ్యాచ్‌లో ఒకరు.. ఇంకో మ్యాచ్‌లో ఇంకొకరు.. ఇలా బౌలర్లు సత్తా చాటుకున్నారు. స్వదేశంలో పులులు.. విదేశాల్లో పిల్లులు.. అన్న మాటను చరిత్రలో కలిపేసిన భారత బౌలర్లు, విదేశీ పిచ్‌లపై వీరవిహారం చేస్తున్నారు.
బ్యాటింగ్ విషయానికొస్తే.. ఇక్కడా లోటుపాట్లేం లేవు. ధావన్ ఓ మ్యాచ్‌లో రాణిస్తే, రోహిత్ ఇంకో మ్యాచ్‌లో.. ఛాన్స్ దొరికితే కోహ్లీ.. తనదాకా వస్తే రైనా.. ఫినిషింగ్ ఇవ్వాల్సి వస్తే ధోనీ.. మధ్యలో పరిస్థితులకు తగ్గట్టు ఆడే రహానే.. వెరసి టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కి వంకలు పెట్టలేం. ఫీల్డింగ్ విషయంలోనూ టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. అలా ఇలా కాదు, నెల రోజుల క్రితం జట్టుకీ.. ఇప్పటి జట్టుకీ స్పష్టమైన తేడా. ఎవరూ ఊహించనంత తేడా.
డిపెండింగ్ ఛాంపియన్ అనేది ఇప్పటిదాకా టీమిండియాకి వున్న హోదా. తాజా ఛాంపియన్.. అన్పించుకోడానికి రెండే రెండు మెట్లెక్కాల్సి వుంది. ఇప్పటిదాకా ప్రదర్శించిన ఆటతీరునే.. ఇకపైనా టీమిండియా కొనసాగిస్తే అవలీలగా వరల్డ్ కప్‌ని టీమిండియా సొంతం చేసుకుంటుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. మెన్ ఇన్ బ్లూ.. ఆ ఘనతను సాధించేలానే వున్నారు. వంద కోట్ల భారతీయులు టీమిండియాకి ఫుల్ సపోర్ట్‌నిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు టీమిండియా.