ప్రభాస్ అంటే బాహుబలి, బాహుబలి అంటే ప్రభాస్. అంతలా పాపులర్ అయిపోయాడు. అందుకే బాహుబలి టీజర్ అంటే, ప్రభాస్ టీజర్ అన్నమాట. ప్రభాస్ టీజర్ అంటే.. సాహో టీజర్. ప్రభాస్ పర్సనాలిటీకి, లెవెల్ కు తగినట్లు వుంది సాహో టైటిల్. ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా టీజర్ కూడా రెడీ అయిపోయింది. టీజర్ ఎలా వుంటుందన్నది ఇటీవలే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది కూడా.
ఈ టీజర్ ను బాహుబలి-2 ప్రదర్శించే ప్రతి థియేటర్లలో ప్రదర్శించే ఏర్పాట్లు చేసారు. అయితే అంతకు ముందుగా అంటే 28కి కాస్త ముందుగానే టీజర్ లాంచ్ కార్యక్రమం ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. ఇటీవల బాహుబలి-2 కోసం ఏ విధంగా అయితే థియేటర్ లో మీట్ ఏర్పాటుచేసారో, అలాగే ఈ టీజర్ ను మీడియా కోసం రెండు రోజులు ముందుగా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోనీలెండి. బాహబలి టీమ్ కు ఎలాగూ తెలుగు మీడియా అంటే పట్టదు. చిన్నచూపు కూడా. ఎందుకంటే వాళ్ల వెంట తెలుగుమీడియా పడుతుంది కాబట్టి, వాళ్లు బాలీవుడ్ మీడియా వెంట పడుతుంటారు. ల్యాబ్ దగ్గరో, మరో దగ్గరో బాహుబలి జనాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటపడి ఇంటర్వూలు తీసుకుంటుంది తెలుగు మీడియా. మరెందుకు వాళ్లు ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వూలు ఇస్తారు. అలాగే బాలీవుడ్ లో అయితే ఓరోజు ముందే మీడియాకు చూపిస్తారు. ఇక్కడయితే అసలు మీడియాను పట్టించుకునే నాధుడే వుండడు. కనీసం బాహుబలి ప్రభాస్ అయినా తన సినిమా సాహో విషయంలో ఆ కేర్ తీసుకుంటే మంచిదే.